ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పెంచడం
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పెంచడం
ఫిన్‌లాండ్‌లోని తేజరిల్లు! రచయిత
ఇరవై ఏండ్ల మార్కూస్ (ఎడమ వైపు) సహాయం లేకుండా తినలేడు, త్రాగలేడు, స్నానం చేయలేడు. ఆయన సరిగ్గా నిద్రపోడు, రాత్రంతా ఎవరో ఒకరు ఆయనను చూసుకుంటూ ఉండాలి. ఆయన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి, ఆయనకు తరచూ ప్రథమ చికిత్స చేయాల్సివస్తుంది. అయితే, మార్కూస్ తల్లిదండ్రులు ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయనలోని మృదు స్వభావం, దయాగుణం, ప్రేమను వారు ఇష్టపడతారు. తమ అబ్బాయికి వైకల్యాలు ఉన్నా అతణ్ణిబట్టి వారు గర్విస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో, దాదాపు 3 శాతం మంది ఏదో ఒక రకమైన బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. జన్యు సమస్యలు, పుట్టినప్పుడు తగిలే గాయాలు, శిశువుగా ఉన్నప్పుడే మెదడుకు సోకే ఇన్ఫెక్షన్‌లు, ఆహార లోపాలతోపాటు మందులు, మద్యం, లేక రసాయనాల హానికర ప్రభావాలవల్ల బుద్ధి మాంద్యం ఏర్పడవచ్చు. చాలా సందర్భాల్లో దానికిగల కారణం తెలియదు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలుగల తల్లిదండ్రులుగా ఉండడం ఎలా ఉంటుంది? అలాంటి తల్లిదండ్రులను ఎలా ప్రోత్సహించవచ్చు?
తల్లిదండ్రులు దుర్వార్త విన్నప్పుడు
తమ పిల్లవానికి బుద్ధిమాంద్యం ఉందని తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు కష్ట పరిస్థితి మొదలవుతుంది. “మా పాపకు డౌన్ సిండ్రోమ్ (క్రోమోజోమ్‌లలోని లోపంవల్ల కలిగే బుద్ధి మాంద్యం) ఉందని నాకు, నా భర్తకు తెలిసినప్పుడు మేము కుప్పకూలిపోయాం” అని సిర్కా గుర్తుచేసుకుంటోంది. మార్కూస్ తల్లి ఆన్ని ఇలా చెబుతోంది: “మా అబ్బాయికి బుద్ధి మాంద్యం ఉంటుందని నేను విన్నప్పుడు, ఇతరులు వాడ్ని ఎలా చూస్తారో అని కలవరపడ్డాను. అయితే కొంతకాలానికి ఆ విషయం గురించి కలవరపడడం మానేసి వాడి అవసరాల మీద, వాడికి నేను చేయగల సహాయం మీద దృష్టినిలిపాను.” ఇర్మ్‌గార్డ్ కూడా అలాగే ప్రతిస్పందించింది. “మా అమ్మాయి యునికేకు ఉన్న వైకల్యం గురించి డాక్టర్‌లు మాకు చెప్పినప్పుడు, నా మనసులో మెదిలిన మొదటి విషయం, నేను నా చిట్టితల్లికి ఎలా సహాయం చేయగలను అనేదే” అని ఆమె చెబుతోంది. అలా రోగనిర్ధారణ అయిన తర్వాత సిర్కా, ఆన్ని, ఇర్మ్‌గార్డ్ లాంటి తల్లిదండ్రులకు ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి?
“మొదటిగా మీరు చేయవలసిన పనేమిటంటే, మీ పిల్లవాని వైకల్యం గురించిన, అందుబాటులో ఉన్న సేవల గురించిన, మీ పిల్లవాడు మానసికంగా సాధ్యమైనంతవరకు పూర్తిగా ఎదగడానికి సహాయం చేసేందుకు మీరు చేయగల నిర్దిష్ట పనుల గురించిన సమాచారం సేకరించడం” అని యు. ఎస్. నేషనల్ డిస్సెమినేషన్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్ సలహా ఇస్తోంది. ఈ సమాచారాన్ని అన్వయించుకోవడం మీ పిల్లవాణ్ణి చూసుకోవడంలో మీకు సంకల్పాన్ని, నిర్దేశాన్ని ఇవ్వగలదు. అది, ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణించిన దూరాన్ని, చేరుకున్న ప్రదేశాలను మ్యాప్‌మీద గుర్తించడంలాంటిది.
ప్రోత్సాహకరమైన విషయం
సవాళ్లున్నా, బాల్యంలో వచ్చే బుద్ధి మాంద్యంవల్ల ఎదురయ్యే కలవరపర్చే పరిస్థితుల్లో కూడా ప్రోత్సాహకరమైన విషయం ఉండవచ్చు. ఎలా?
మొదటిగా, అలాంటి చాలామంది పిల్లలు బాధలు అనుభవించడంలేదని
తెలుసుకొని తల్లిదండ్రులు ఓదార్పు పొందవచ్చు. డాక్టర్ రాబర్ట్ ఐసక్సన్, ద రిటార్డెడ్ ఛైల్డ్ అనే తన పుస్తకంలో ఇలా వ్రాశాడు: “చాలామంది సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఇతరుల సహవాసాన్ని, సంగీతాన్ని, కొన్ని ఆటలను, రుచికరమైన ఆహారాన్ని, స్నేహితుల స్నేహాన్ని ఆస్వాదించగలుగుతున్నారు.” వారు తమ జీవితాల్లో ఎక్కువ సాధించలేకపోవచ్చు, సాధారణ పిల్లలతో పోలిస్తే తమ చుట్టూ ఉన్న లోకంతో వారికంత సంబంధంలేకపోవచ్చు. అయినా, అధిక గ్రహణశక్తి కారణంగా సంక్లిష్టమైన జీవితాలు గడిపే మామూలు పిల్లల కన్నా పరిమిత గ్రహణశక్తిగల ఈ పిల్లలు సాధారణంగా సంతోషంగా ఉంటారు.రెండవదిగా, తమ పిల్లవాడు కష్టపడి సాధించే విజయాలనుబట్టి తల్లిదండ్రులు గర్వపడవచ్చు. పిల్లవాడు నేర్చుకునే ప్రతీ క్రొత్త పని, ఎత్తైన కొండను ఎక్కడంతో సమానం, పిల్లవాడు సాధించిన విజయాల గురించి ధ్యానించడం తల్లిదండ్రులకే కాక పిల్లలకూ సంతృప్తినిస్తుంది. ఉదాహరణకు బ్రయాన్, ట్యూబరస్ స్కేలారొసిస్ అనే అరుదైన జన్యు సంబంధ వ్యాధితో, మూర్ఛలతో, ఆటిసమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ అబ్బాయి తెలివైనవాడే అయినా మాట్లాడలేడు, తన చేతులమీద అతనికి నియంత్రణలేదు. అయినా, కప్పులో సగంవరకు ఉన్న పానీయాలను ఒలకబోయకుండా త్రాగడం నేర్చుకున్నాడు. మనసుకూ శరీరానికీ అంత సమన్వయం సాధించడంవల్ల బ్రయాన్ తనకిష్టమైన పాలను తనంతట తానే త్రాగగలడు.
బ్రయాన్ తల్లిదండ్రులు ఈ విజయాన్ని తమ అబ్బాయి తన వైకల్యాల మీద సాధించిన మరో చిన్న విజయంగా పరిగణిస్తున్నారు. “మేము మా కుమారున్ని అడవిలోని గట్టి చెక్కగల చెట్టుగా దృష్టిస్తాం, ఈ చెట్టు ఇతర చెట్లలా త్వరగా పెరగకపోయినా అది ఎంతో విలువైన కలపను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వైకల్యాలున్న పిల్లలు కూడా మెల్లగా ఎదుగుతారు. అయితే వారు తమ తల్లిదండ్రుల దృష్టిలో శాశ్వత విలువగల ఓక్ వృక్షాల్లా, టేకు వృక్షాల్లా తయారవుతారు” అని ఆ అబ్బాయి తల్లి లారీ చెబుతోంది.
మూడవదిగా, తమ పిల్లవాడు చూపించే ప్రేమపూర్వక స్వభావాన్నిబట్టి చాలామంది తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. ఇర్మ్‌గార్డ్ ఇలా చెబుతోంది: “యునికే త్వరగా నిద్రపోవడానికి ఇష్టపడుతుంది, నిద్రపోయే ముందు సాధారణంగా ఇంట్లో ప్రతి ఒక్కరికీ ముద్దుపెడుతుంది. మేము ఇంటికి చేరుకోక ముందే ఆమె నిద్రపోయినట్లయితే, మేము ఇంటికి తిరిగివచ్చేంతవరకు వేచివుండనందుకు క్షమించమని ఒక చిన్న నోట్ వ్రాస్తుంది. ఆమె తాను మమ్మల్ని ప్రేమిస్తున్నానని, మమ్మల్ని ఉదయాన్నే చూడడానికి ఎదురుచూస్తున్నానని కూడా వ్రాస్తుంది.”
మార్కూస్ మాట్లాడలేడు, అయినా తాను తన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నానని వారికి చెప్పడానికి అతికష్టం మీద సంజ్ఞా భాషలో కొన్ని పదాలను నేర్చుకున్నాడు. ఎదిగే విషయంలో వైకల్యం ఉన్న టియా అనే అమ్మాయి తల్లిదండ్రులు తమ భావాలను ఇలా వ్యక్తం చేశారు: “ఆమె మా జీవితంలో ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, ఆలింగనాలను, ముద్దులను నింపింది.” అలాంటి పిల్లలందరికీ వారి తల్లిదండ్రులు మాటలతో, చేతలతో ఎంతో ప్రేమానురాగాలను వ్యక్తం చేయాలనేది స్పష్టం.
నాల్గవదిగా, తమ పిల్లవాడు దేవునిపట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసినప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులు ఎంతో సంతృప్తిచెందుతారు. ఈ విషయంలో జూహా చక్కని ఉదాహరణ. ఆ అబ్బాయి తన తండ్రి అంత్యక్రియలప్పుడు, తాను ప్రార్థించవచ్చా అని అడిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జూహా తాను చేసిన చిన్న ప్రార్థనలో, తన తండ్రి దేవుని జ్ఞాపకంలో ఉన్నాడని, తగిన సమయంలో దేవుడు తన తండ్రిని పునరుత్థానం చేస్తాడని తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత, పేరుపేరున తన కుటుంబ సభ్యులను పేర్కొంటూ వారికి సహాయం చేయమని దేవుణ్ణి అడిగాడు.
అలాగే, దేవునిపట్ల యునికేకు ఉన్న నమ్మకం కూడా ఆమె తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. యునికేకు నేర్చుకుంటున్న ప్రతీ విషయం అర్థంకాదు. ఉదాహరణకు, బైబిల్లోని అనేక పాత్రల గురించి ఆమెకు తెలుసు, అయితే అవి పూర్తి చిత్రంగా ఏర్పడని పజిల్‌లోని ముక్కల్లాగా, ఆమె మనసులో తనకు తెలిసిన ఇతర వాస్తవాలతో పొందుపర్చబడలేదు. అయినా, సర్వశక్తిగల దేవుడు ఒకరోజు భూమ్మీద నుండి సమస్యలను తొలగిస్తాడనే విషయం ఆమె అర్థం చేసుకుంటుంది. దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో జీవించాలనే ఆశ యునికేకు ఉంది, అక్కడ ఆమెకు పూర్తి మానసిక సామర్థ్యాలుంటాయి.
ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండడాన్ని ప్రోత్సహించడం
బుద్ధి మాంద్యంగల పిల్లలు పిల్లలుగానే ఉండిపోరు, వారు మానసిక వైకల్యంగల వయోజనులుగా ఎదుగుతారు. కాబట్టి,
ప్రత్యేక అవసరాలున్న పిల్లలు అవసరమున్న దానికన్నా ఎక్కువగా ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారికి సహాయం చేయడం మంచిది. మార్కూస్ తల్లి ఆన్ని ఇలా చెబుతోంది: “మార్కూస్ కోసం ప్రతీది మేము సులభంగా, వేగంగా చేసిపెట్టగలం. కానీ తాను చేయగలిగిన పనులన్నీ తనంతటతాను చేసుకోవడానికి సహాయం చేసేందుకు మేము అన్ని ప్రయత్నాలు చేశాం.” యునికే తల్లి కూడా ఇలా అంది: “యునికేకు ఎన్నో చక్కని లక్షణాలున్నాయి, అయితే ఆమె కొన్నిసార్లు మొండిగా ప్రవర్తిస్తుంది. ఆమెకు ఇష్టంలేని పని ఆమెతో చేయించాలంటే, మమ్మల్ని సంతోషపెట్టాలని ఆమెకున్న కోరికను గుర్తుచేయాల్సివస్తుంది. ఆమె ఒక పనిని చేయడానికి ఒప్పుకున్నా, ఆ పని పూర్తిచేసేంతవరకు ఆమెను ప్రోత్సహిస్తూనే ఉండాలి.”బ్రయాన్ తల్లి లారీ తమ అబ్బాయి జీవితాన్ని మరింత సంతృప్తికరంగా చేసేందుకు దోహదపడగల మార్గాల కోసం ఎప్పుడూ అన్వేషిస్తుంది. దాదాపు మూడు సంవత్సరాలుగా లారీ, ఆమె భర్త, బ్రయాన్‌కు కంప్యూటర్ మీద టైప్ చేయడం నేర్చుకునేందుకు సహాయం చేశారు. బ్రయాన్ ఇప్పుడు ఎంతో సంతృప్తితో తన స్నేహితులకు, కుటుంబానికి ఈ-మెయిల్‌లు పంపిస్తున్నాడు. అయితే ఆయన టైప్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఆయన మణికట్టును పట్టుకోవాల్సివస్తుంది. మోచెయ్యి దగ్గరే సహాయం అవసరమయ్యే విధంగా ప్రగతి సాధించేందుకు తల్లిదండ్రులు ఆయనకు సహాయం చేస్తున్నారు. మోచేతి దగ్గర మాత్రమే సహాయం అవసరమయ్యేంతగా ప్రగతి సాధించాడంటే దానర్థం, ఆయన ఇతరులపై ఆధారపడకుండా ఉండడంలో ఎంతో సాధించాడని వారికి తెలుసు.
అయితే, తల్లిదండ్రులు పిల్లల నుండి ఎక్కువ ఆశించకూడదు లేక ప్రగతి సాధించమని వారిపై మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రతీ పిల్లవానికి వేరువేరు సామర్థ్యాలుంటాయి. ద స్పెషల్ ఛైల్డ్ అనే పుస్తకం ఇలా సలహా ఇస్తోంది: “అనుభవం చెబుతున్న మంచి సూత్రం ఏమిటంటే, ఇతరులపై ఆధారపడకుండా ఉండడాన్ని ప్రోత్సహించడానికీ పిల్లవాడు విసుగు చెందకుండా కావాల్సిన సహాయం అందించడానికీ మధ్య సమతుల్యాన్ని కాపాడడానికి ప్రయత్నించడం.”
సహాయానికి గొప్ప మూలం
మానసిక వైకల్యం ఉన్న పిల్లలుగల తల్లిదండ్రులకు ఎంతో ఓర్పు, సహనం అవసరం. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేకమంది తల్లిదండ్రులు నిరాశానిస్పృహలకు గురౌతారు. నిస్సత్తువ చివరకు హానికరమైన పరిణామాలకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు తమపై తామే జాలిపడవచ్చు. అలాంటప్పుడు ఏమి చేయాలి?
తల్లిదండ్రులు “ప్రార్థన ఆలకించువాడైన” దేవుణ్ణి సహాయం కోసం అడగవచ్చు. (కీర్తన 65:2) ఆయన సహించేందుకు ధైర్యాన్ని, నిరీక్షణను, బలాన్ని ఇస్తాడు. (1 దినవృత్తాంతములు 29:12; కీర్తన 27:14) మానసిక వేదనననుభవిస్తున్న మన హృదయాలను ఆయన ఓదారుస్తాడు, మనం బైబిలు అందించే ‘నిరీక్షణలో సంతోషించాలని’ ఆయన కోరుకుంటున్నాడు. (రోమీయులు 12:12; 15:4, 5; 2 కొరింథీయులు 1:3, 4) దేవునిపై ఆధారపడే తల్లిదండ్రులు, భవిష్యత్తులో ‘గ్రుడ్డివారు చూడగలిగినప్పుడు, కుంటివారు నడవగలిగినప్పుడు, మూగవాని నాలుక పాడినప్పుడు’ తమ ప్రియమైన పిల్లవాడు కూడా పరిపూర్ణ మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని అనుభవిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెషయా 35:5, 6; కీర్తన 103:2, 3. (g 4/06)
తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
◼ మీ పిల్లవాని మానసిక వైకల్యం గురించి తెలుసుకోండి.
◼ ఆశావహ దృక్పథంతో ఉండడానికి ప్రయత్నించండి.
◼ మీ పిల్లవాడు సాధ్యమైనంతమేరకు ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు సహాయం చేయండి.
◼ ధైర్యం, నిరీక్షణ, బలం కోసం దేవుణ్ణి అడగండి.
ఇతరులు ఏమి చేయవచ్చు?
◼ చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్లు కాకుండా, పిల్లవాని వయసుకు తగినట్లుగా, మనస్ఫూర్తిగా మాట్లాడండి.
◼ తల్లిదండ్రులతో వారి పిల్లవాని గురించి మాట్లాడి, వారిని మెచ్చుకోండి.
◼ పిల్లవాడి తల్లిదండ్రుల భావాలకు సున్నితంగా ప్రతిస్పందిస్తూ, దయతో వ్యవహరించండి.
◼ ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులతో, కుటుంబాలతో కలిసి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనండి.
(తరువాయి 19వ పేజీలో)
[18వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
మారథాన్ పందెంలో పరుగెత్తే వ్యక్తుల సహనాన్ని చూసి, వీక్షించేవారు ఎలాగైతే ప్రశంసిస్తారో, అలాగే మానసిక వైకల్యంగల పిల్లలను రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు చూసుకునే తల్లిదండ్రుల సహనశక్తిని చూసి మీరూ ప్రశంసించవచ్చు. మారథాన్ మార్గంలో ఉన్న ప్రేక్షకులు సాధారణంగా, పరుగు పందెంలో పాల్గొనేవారికి దానిలో కొనసాగేందుకు నీళ్ల బాటిళ్లు అందిస్తారు. అలాగే, ప్రత్యేక అవసరమున్న పిల్లవాణ్ణి జీవితాంతం చూసుకునే బాధ్యత నిర్వర్తిస్తున్న తల్లిదండ్రులను మీరు ప్రోత్సహించగలరా?
మీరు సహాయం చేయగల మార్గాల్లో ఒకటి, వారి అబ్బాయితో లేక అమ్మాయితో మాట్లాడడమే. పిల్లవాడు చాలా కొద్దిగా ప్రతిస్పందించవచ్చు లేక అసలే ప్రతిస్పందించకపోవచ్చు కాబట్టి, ప్రారంభంలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే అలాంటి అనేకమంది పిల్లలు వినడానికి ఇష్టపడతారని, మీరు చెబుతున్న విషయాల గురించి లోతుగా ఆలోచిస్తారని గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో వారి మనసులు నీటి ఉపరితలం క్రింద ఉండే మంచుకొండల్లా ఉంటాయి, వారి ముఖాలు తమకున్న లోతైన భావాలను వ్యక్తం చేయకపోవచ్చు. *
బాల్యదశ నాడీవ్యవస్థ నిపుణురాలు, డాక్టర్ ఆన్నిక్కీ కోయిస్టినెన్ మీరు వారితో సులభంగా ఎలా మాట్లాడవచ్చనే విషయంలో ఇలా సలహా ఇస్తోంది: “ప్రారంభంలో మీరు వారి కుటుంబం గురించి లేక వారి హాబీల గురించి మాట్లాడవచ్చు. వారి తోటివయస్కులతో ఎలాగైతే మాట్లాడతారో అలాగే వారితో కూడా మాట్లాడండి, మీరు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్లు వారితో మాట్లాడకూడదు. చిన్న వాక్యాలు ఉపయోగిస్తూ, ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం గురించే మాట్లాడండి. మీరు చెబుతున్నవాటి గురించి ఆలోచించడానికి వారికి సమయం ఇవ్వండి.”
తల్లిదండ్రులకు కూడా మీ మాటలు అవసరం. వారు ఎదుర్కొంటున్న భావోద్రేక సవాళ్ల గురించి మీరు మరింత తెలుసుకున్నప్పుడు వారిపట్ల మీకున్న సానుభూతి అధికమవుతుంది. ఉదాహరణకు, మార్కూస్ తల్లి ఆన్ని తన ప్రియ కుమారుని గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటుంది. తన కుమారుడు తనతో మాట్లాడి తన మనసులోని విషయం వివరించలేడని ఆమె బాధపడుతుంది. తన కుమారుని కన్నా ముందు తాను చనిపోతానేమోనని, అప్పుడు తన కుమారుడు తల్లి లేనివాడవుతాడని కూడా ఆమె కలవరపడుతుంది.
బుద్ధి మాంద్యంగల పిల్లవాణ్ణి చూసుకోవడంలో తల్లిదండ్రులు ఎంత చేసినా తాము చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని వారు సాధారణంగా అనుకుంటారు. బ్రయాన్ తల్లి లారీ, తన కుమారుణ్ణి చూసుకోవడంలో తాను చేసే ప్రతీ చిన్న తప్పుకు తనను తాను నిందించుకుంటుంది. తన ఇతర పిల్లలమీద అధిక శ్రద్ధ చూపించలేకపోతున్నందుకు కూడా ఆమెలో అపరాధ భావాలు కలుగుతాయి. అలాంటి తల్లిదండ్రులపట్ల మీకున్న శ్రద్ధ, వారి భావాలపట్ల మీకున్న గౌరవం వారి విలువను, వారి పిల్లల విలువను పెంచుతాయి, వారికి మద్దతునిస్తాయి. ఈ విషయంలో ఇర్మ్‌గార్డ్ ఇలా చెబుతోంది: “మా అమ్మాయి గురించి మాటలు వినడం నాకిష్టం. యునికేతో నేను గడుపుతున్న జీవితంలోని కష్టసుఖాలను పంచుకోవడానికి సుముఖంగా ఉన్నవారంటే నాకెంతో ఇష్టం.”
మీరు సహాయం చేయగల ఇతర చిన్నాపెద్ద మార్గాలు అనేకం ఉన్నాయి. మీరు తల్లిదండ్రులను, వారి పిల్లవాణ్ణి మీ ఇంటికి ఆహ్వానించవచ్చు లేక మీ కుటుంబ కార్యకలాపాల్లో పాల్గొనమని వారికి చెప్పవచ్చు. తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పిల్లవానితో కొన్ని గంటలు గడపడం కూడా మీకు వీలుకావచ్చు.
[అధస్సూచి]
^ తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 2000 సంచికలోని “నిశ్శబ్దాన్ని ఛేదించుకుని లాయిడా పయనం” అనే శీర్షికను చూడండి.
[18వ పేజీలోని చిత్రం]
నిజమైన శ్రద్ధ చూపించడం తల్లిదండ్రుల, పిల్లల విలువను పెంచుతుంది
[19వ పేజీలోని చిత్రం]
యునికేలాగే, మానసిక వైకల్యంగల పిల్లలు ఎదుగుతున్నప్పుడు, వారికి ఆప్యాయత చూపిస్తూ ఉండడం అవసరం
[20వ పేజీలోని చిత్రం]
తన కుమారుడు బ్రయాన్ టైప్ నేర్చుకునేందుకు లారీ సహాయం చేసింది, ఇతరులపై ఆధారపడకుండా పనులు చేసుకునేందుకు ప్రోత్సహించింది