ప్రస్తుతం ఏ సినిమాలు ఆడుతున్నాయి?
ప్రస్తుతం ఏ సినిమాలు ఆడుతున్నాయి?
వేసవిలో మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు? వాతావరణం వేడెక్కినప్పుడు ఆహ్లాదపరిచే పరిసరాలు మిమ్మల్ని ఆకర్షించవచ్చు, బహుశా సముద్రతీరానికో పార్కుకో వాహ్యాళికి వెళ్ళి ఆనందించాలని మీరు ఇష్టపడుతుండవచ్చు.
అయితే అమెరికాలోని సినీ పరిశ్రమకు చెందినవారు మాత్రం కోట్లాదిమంది వేసవి సమయాన్ని సినిమా హాలు లోపల గడపాలని ఆశిస్తున్నారు. ఒక్క అమెరికాలోనే దాదాపు 35,000 సినిమా హాళ్ళు ఉన్నాయి, ఇటీవలి సంవత్సరాల్లో ఆ దేశంలో దాదాపు 40 శాతం వరకు బాక్సాఫీసు లాభాలు వేసవిలోనే గడించాయి. * “క్రిస్మస్ సమయం వ్యాపారస్థులకు ఎలా ఉంటుందో వేసవికాలం సినీ పరిశ్రమకు అలా ఉంటుంది” అని మూవీలైన్ పత్రికకు చెందిన హైడీ పార్కర్ చెప్పింది.
ఇంతకుముందు సినీ పరిశ్రమ ఇన్ని లాభాలను గడించేది కాదు. అమెరికాలో వేసవిలో సినిమాలు చూడడానికి సినిమా హాళ్ళకు ఎక్కువమంది వచ్చేవారు కాదు, ఆ కారణంగా చాలా సినిమా హాళ్ళవారు తక్కువ ఆటలు ఆడించేవారు లేదా ఆ కాలంలో సినిమా హాళ్ళను మూసేసేవారు. కానీ 1970ల మధ్య కాలంలో ఎయిర్ కండిషన్డ్ థియేటర్లు వేడి వాతావరణాన్ని తప్పించుకోవాలని అనుకొనే చాలామందిని ఆకర్షించాయి. పిల్లలకు స్కూలు సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా సినిమాలకు వచ్చే అవకాశం ఉంది, ఈ విషయం సినీ నిర్మాతల దృష్టికి రాకుండా పోలేదు. కొంతకాలంలోనే వేసవి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. * మనం చూడబోతున్నట్లుగా, అవి సినిమా నిర్మాణ పద్ధతినీ మార్కెటింగ్ చేసే పద్ధతినీ మార్చేశాయి. (g05 5/8)
[అధస్సూచీలు]
^ అమెరికాలో వేసవికాలంలోని సినిమా సీజన్ మే నెలతో ప్రారంభమై సెప్టెంబరు వరకూ ఉంటుంది.
^ సాధారణంగా, “బ్లాక్‌బస్టర్లు” అనే పదం 450 కోట్ల రూపాయలు లేక అంతకన్నా ఎక్కువ సంపాదించి పెట్టే సినిమాలను సూచించేందుకు ఉపయోగించేవారు. అయితే బాక్సాఫీసు వద్ద ఎంత డబ్బు సంపాదించిపెడుతుందనేది పరిగణలోకి తీసుకోకుండా ఎలాంటి హిట్ సినిమానైనా వర్ణించడానికి ఆ పదం కొన్నిసార్లు విస్తృతంగా ఉపయోగించబడుతోంది.