నా మీద ఆసక్తి చూపించే అమ్మాయితో నేను ఎలా ప్రవర్తించాలి?
యువత ఇలా అడుగుతోంది . . .
నా మీద ఆసక్తి చూపించే అమ్మాయితో నేను ఎలా ప్రవర్తించాలి?
“నా మీద తనకున్న ఆసక్తిని సూసనే మొదట వ్యక్తం చేసింది, దానివల్ల నాకే సమస్యా తలెత్తలేదు. ఆమె అలా వ్యక్తం చేయడంవల్ల నాకు ప్రయోజనమే చేకూరింది.” —జేమ్స్. *
“ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నిజాయితీగా వ్యవహరించకపోతే, అమ్మాయి ఆసక్తి చూపించడం ఘోరమైన పరిణామాలకు దారితీయగలదు.”—రాబర్టొ.
ఇటీవల ఒక అమ్మాయి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది అని మీతో అంది. మీరు ఆమెను స్నేహితుల గుంపులో తరచుగా చూస్తున్నారు, ఆమెతో మాట్లాడడం కలిసి పని చేయడం మీకు ఆనందంగా ఉంటోంది. అయితే ఆమె మాటలు విన్న తర్వాత మీరు అవాక్కయ్యారు. ఆమె మీతో ప్రేమ బంధాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో మీ మీద ఆసక్తి చూపిస్తోంది, ఆమె విషయంలో మీరు కూడా అలాగే భావిస్తున్నారో లేదో తెలుసుకోవాలని కోరుకుంటోంది.
కోర్ట్‌షిప్ విషయంలో పురుషుడే చొరవ తీసుకోవాలనే అభిప్రాయం మీకు ఉంటే ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఈ విషయంలో సాధారణంగా అబ్బాయే చొరవ తీసుకుంటాడు, కానీ ఆమె చొరవ తీసుకోవడం ద్వారా బైబిలు సూత్రాలనేమీ ఉల్లంఘించలేదని గుర్తుంచుకోండి. * ఈ వాస్తవం మీరు సరిగ్గా స్పందించేందుకు దోహదపడవచ్చు.
మీరు ఆ విషయం గురించి ఆలోచించిన తర్వాత, డేటింగ్ చేయడానికి మీది ఇంకా చిన్న వయస్సు అని మీకు అనిపించవచ్చు లేదా ఆమె మీకు ఆ విధంగా ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. మీకు తెలియకుండానే మీరు ఆమెకు తప్పుడు సంకేతాలు ఏమైనా ఇచ్చారేమోననే ఆలోచనతో మీలో అపరాధ భావాలు కూడా కలుగుతుండవచ్చు. అప్పుడు మీరేమి చేయాలి? మొదట మీరు ఆమె మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి.
ఆమె మనోభావాలను పరిగణలోకి తీసుకోండి
ఇలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి ఎలా భావిస్తుందో ఆలోచించండి. ఆమె మీకు సదభిప్రాయం కలిగించాలన్న కోరికతో, ఆమె మీతో చెప్పాలనుకున్న మాటలను కొన్ని రోజులపాటు అభ్యాసం చేసి ఉండవచ్చు. సరైన పదాలను కూర్చుకొని, చక్కని చిరునవ్వు కలగలిపి, మీరు కాదనగల సాధ్యత గురించి కూడా ఆలోచించి, చివరకు ధైర్యాన్ని కూడగట్టుకొని, తన కంగారును అధిగమించి, ఆమె తన మనసులోని మాటను మీకు చెప్పింది.
ఆమె అంత కష్టపడి ఆ మాటలు మీతో ఎందుకు చెప్పాలనుకుంది? బహుశా ఆమె మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతుండవచ్చు. లేకపోతే, మిగతా చాలామందిలా కాకుండా ఆమె మీలోని మంచి లక్షణాలను చూసి ముగ్ధురాలై ఉండవచ్చు. అయితే ఆమె వ్యక్తంచేసిన
మాటల్లో మీరు మీ దైనందిన జీవితంలో అందుకోని అభినందన అంతర్లీనమై ఉండవచ్చు.ఇక్కడ ఈ విషయాలు చెబుతున్నది మీ నిర్ణయాన్ని మార్చడానికి కాదు, సున్నితంగా వ్యవహరించాలని మీకు గుర్తు చేసేందుకే. జూలీ అనే యువతి ఇలా అంటోంది: “ఆయనకు ఆమెపట్ల ఎలాంటి భావాలు లేకపోయినా, ఒక వ్యక్తి తనను గమనించినందుకు ఆయన సంతోషించాలి. కాబట్టి తనకు ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పకుండా ఆయన ఆ విషయాన్ని కొంచెం సున్నితంగా తెలియజేయాలి.” మీరు ఆమెతో “మీరంటే నాకు ఇష్టం లేదు” అని సున్నితంగా చెప్పాలనే ఉద్దేశిస్తున్నారని మనం కాస్సేపు అనుకుందాం.
ఆమెను మీరు ఇదివరకే తిరస్కరించి ఉంటే అప్పుడెలా? ఆమెకు ఇప్పుడు కఠినంగానే చెప్పాలి అని మీకు అనిపిస్తుండవచ్చు. అలాంటి తలంపు రానీయకండి. సామెతలు 12:18 ఇలా చెబుతోంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” మీరు “జ్ఞానుల నాలుక”తో ఎలా మాట్లాడతారు?
ఆమె తన మనోభావాలను మీకు చెప్పినందుకూ మిమ్మల్ని అంత గొప్పగా భావించినందుకూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి. మీకు తెలియకుండానే ఏమైనా తప్పుడు సంకేతాలు ఇచ్చారేమోనని క్షమాపణలు కూడా అడగండి. ఆమెకు కలిగినటువంటి భావాలు మీకు కలుగలేదని స్పష్టంగానే అయినా స్నేహపూర్వకంగా చెప్పండి. ఆమె మీ జవాబును అర్థం చేసుకోకపోవడంతో మీరు మరింత దృఢంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే కూడా మీ స్వరంలో కఠినత్వం ఉండకూడదు, మనసు నొప్పించే మాటలు అనకూడదు. మీరు ఆమె సున్నితమైన మనోభావాలతో వ్యవహరిస్తున్నారు కాబట్టి సహనంతో ఉండండి. ఒకవేళ ప్రేమిస్తున్నానని చెప్పింది మీరే అయితే ఆమె మిమ్మల్ని స్నేహపూర్వకంగా తిరస్కరిస్తే మీరు అందుకు కృతజ్ఞతగా ఉండరా?
అయితే మీరు ఉద్దేశపూర్వకంగానే ఆమెను తప్పుదారి పట్టించారు అని ఆమె గట్టిగా అనవచ్చు. ఆమెలో అలాంటి ప్రేమానుభూతులను కలిగించిన కొన్ని చర్యల గురించి ఆమె పేర్కొనవచ్చు. ‘ఆ రోజు నాకు పువ్విచ్చావు గుర్తుందా’ అని కానీ ‘మనం పోయిన నెల కలిసి వెళ్తున్నప్పుడు నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా’ అని కానీ అనవచ్చు. అప్పుడు మీరు గంభీరంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నిజాన్ని ఒప్పుకోండి
గతంలోని అన్వేషకులు తాము కనుగొన్న ప్రాంతాలను తమ విజయానికి చిహ్నాలుగా తమ సొత్తుగా భావించేవారు. నేడు కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళను ఆ విధంగా చూస్తున్నారు. వాళ్ళు ప్రేమలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు కానీ పెళ్ళి బాధ్యతను వద్దంటారు. వాళ్ళు తాముగా దేనికీ నిబద్ధులు కాకుండానే ఆడవాళ్ళ మనోభావాలతో చెలగాటమాడుతూ వారిని ఆకర్షించాలనుకుంటారు. అలాంటి మగవాడు ఒక ఆడదాని ప్రేమను మోసంతో పొందుతాడు. ఒక క్రైస్తవ పెద్ద ఇలా అంటున్నాడు: “కొందరు యువకులు ఒక అమ్మాయి తర్వాత మరో అమ్మాయిని మారుస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక అమ్మాయి భావోద్వేగాలతో అలా ఆడుకోవడం న్యాయం కాదు.” అలాంటి స్వార్థం ఎటు దారితీస్తుంది?
“మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.” (సామెతలు 26:18, 19, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఒక వ్యక్తి స్వార్థంతో ఒక అమ్మాయితో స్నేహం చేస్తే, చివరకు ఆమెకు అతని అసలు ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు అతడు చేసిన మోసం ఈ క్రింది అనుభవం చూపిస్తున్నట్లు, ఆమె హృదయాన్ని గాయపరుస్తుంది.
ఒక యువకుడు ఒకమ్మాయితో ప్రేమ బంధాన్ని
పెంచుకున్నాడు కానీ ఆమెను పెళ్ళి చేసుకోవాలనే కోరిక లేదు. అతను ఆమెను మంచి మంచి రెస్టారెంట్లకు తీసుకువెళ్ళాడు, ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్ళారు. అతను ఆమె సహవాసాన్ని ఆనందించాడు, అతను తనను పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశంతో తనపట్ల అలాంటి ఆసక్తి చూపిస్తున్నాడనుకుంటూ అతను చూపిస్తున్న శ్రద్ధకు ఆమె ఆనందించింది. అయితే అతను చూపిస్తున్న ఆసక్తి కేవలం సరదా కోసమేనని ఆమెకు తెలిసినప్పుడు ఆమె హృదయం చాలా గాయపడింది.మిమ్మల్ని సమీపించిన అమ్మాయికి, ఒకవేళ మీకు తెలియకుండానే మీరు తప్పుడు సంకేతాలు ఇస్తే అప్పుడు మీరు ఏమి చేయాలి? మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించినా అది ఆమెను మరింత గాయపరుస్తుంది. ఈ బైబిలు సూత్రాన్ని పరిశీలించండి: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామెతలు 28:13) కాబట్టి నిజం చెప్పండి. ఏదైనా అపార్థం తలెత్తితే, దానికి మీరే బాధ్యులని ఒప్పుకోండి. ఒకవేళ మీరు ఉద్దేశపూర్వకంగా ఆమె మనోభావాల నుండి స్వార్థపు ప్రయోజనం పొందివుంటే, మీరు పెద్ద పొరపాటు చేశారని ఒప్పుకోండి. మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి.
అయితే మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన విషయం అంతటితో చల్లారిపోతుంది అని ఆశించకండి. ఆ అమ్మాయి మీ మీద కొంతకాలం వరకు కోపంతోనే ఉండవచ్చు. మీ చర్యల గురించి మీరు ఆమె తల్లిదండ్రులకు వివరించాల్సి రావచ్చు. మీకు ఇతర పరిణామాలు కూడా ఎదురుకావచ్చు. గలతీయులు 6:7 ఇలా చెబుతోంది: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” అయితే క్షమాపణ చెప్పి చేసిన తప్పుకు పరిహారంగా మీరు చేయగలిగింది చేస్తే, ఆమె మళ్ళీ మామూలుగా జీవించేందుకు దోహదపడిన వారవుతారు. ఈ అనుభవం మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాత్రమే కాక, మీ జీవితంలోని అన్ని విషయాల్లోనూ ‘కపటమైన మాటలు పలుకకుండ మీ పెదవులను కాచుకోవడాన్ని’ నేర్పిస్తుంది.—కీర్తన 34:13.
జవాబిచ్చే ముందు బాగా ఆలోచించండి
కానీ మీరు నిజంగానే ఆ అమ్మాయి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అప్పుడెలా? ఒకవేళ విషయం అదే అయితే డేటింగ్, రొమాన్స్ కేవలం సరదాగా గడిపేందుకు మార్గాలు కాదని మీరు గ్రహించాలి. డేటింగ్ చేసే ఇరువురూ ఒకరిపట్ల ఒకరు పెంపొందించుకునే బలమైన మనోభావాలు వారిని పెళ్ళి వైపుకు నడిపిస్తాయి. వారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ మనోభావాలే వారు భార్యాభర్తలుగా ఏకమయ్యేందుకు దోహదపడతాయి. ఇది తెలిసిన మీరు ఇప్పుడు ఎలా భావించాలి?
ఆ అమ్మాయి గురించి ఆలోచించిన తర్వాత, ఆమె పలురీతుల్లో ఆకర్షణీయంగా ఉన్నట్లు మీరు గ్రహించవచ్చు. ఆమె తలుపు తెరిచింది, మీరు దాన్ని తెరిచే ఉంచాలని కోరుకోవచ్చు. అయితే కోర్ట్‌షిప్ కోసం దూసుకుపోకుండా, మీరిద్దరూ తర్వాత తీవ్రమైన బాధకు గురికాకుండా ఉండేలా ఇప్పుడే తగిన చర్యలు తీసుకోండి.
ఒక సందర్భంలో మీరు ఆమె గురించి తెలిసిన, పరిణతి చెందిన కొందరు వ్యక్తులను సంప్రదించాలని అనుకుంటుండవచ్చు. ఆమె కూడా అలాగే మీ గురించి తెలిసినవారిని సంప్రదించమని ఆమెకు సూచించండి. మీరు సంప్రదించిన పరిణతి చెందిన వ్యక్తులను, అవతలి వ్యక్తిలో చూసిన మంచి లక్షణాలు, బలహీనతలు ఏమిటి అని మీరిద్దరూ అడిగి తెలుసుకోండి. క్రైస్తవ పెద్దల అభిప్రాయం కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీరు ప్రేమబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తున్న వ్యక్తికి క్రైస్తవ సంఘంలో మంచి పేరు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది.
కానీ ‘నా వ్యక్తిగత జీవితంలో ఇతరులు అంతగా ఎందుకు జోక్యం చేసుకోవాలి’ అని మీరు అనవచ్చు. వాస్తవమేమిటంటే, ప్రేమ వంటి వ్యక్తిగత విషయంలో కూడా ఇతరుల అభిప్రాయం తెలుసుకోవడం చాలా మంచిది. వాస్తవానికి ఇది లేఖనాధారితం కూడా, ఎందుకంటే సామెతలు 15:22 ఇలా చెబుతోంది: “ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” మీరు సంప్రదించే పెద్దలు మీ కోసం నిర్ణయం తీసుకోరు. కానీ వారి ‘హృదయములో నుండి వచ్చు మాటలు,’ మీరు ఇష్టపడుతున్న వ్యక్తిలోనూ, మీలోనూ మీరు స్వయంగా చూడలేని విషయాలను వ్యక్తం చేస్తుండవచ్చు.—సామెతలు 27:9.
ఆర్టికల్ మొదట్లో పేర్కొన్న జేమ్స్ అలాగే చేశాడు. ఆయన స్వతంత్రంగా జీవిస్తున్నప్పటికీ, సూసన్ గురించి ఆయన తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఆ తర్వాత తమ జోడీ ఎలా ఉంటుందో చెప్పగల, పరిణతి చెందినవారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునేందుకు వారిద్దరూ తమకు తెలిసిన వారి పేర్లను ఒకరికొకరు సూచించుకున్నారు. జేమ్స్, సూసన్‌లు ఒకరి గురించి ఒకరు మంచి నివేదికలు విన్న తర్వాతే తమకు పెళ్ళి చేసుకునే అవకాశం ఉందేమో చూసుకోవడానికి డేటింగ్ ఆరంభించారు. మీరు కూడా భావోద్వేగపూరితమైన సంబంధాలు పూర్తిగా ఏర్పడకముందే అలాంటి పద్ధతిని పాటిస్తే, మీరు చివరకు తీసుకునే నిర్ణయం సురక్షితమైనదేనని మీరు భావిస్తారు.
అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాకు ప్రార్థించండి. డేటింగ్ అంటే పెళ్ళి వైపుకు నడిపించే మొదటి అడుగు కాబట్టి, ఆ అమ్మాయితో మీరు ఏర్పరచుకునే అనుబంధం మిమ్మల్ని ఆ లక్ష్యం వైపుకు నడిపిస్తుందో లేదో తెలుసుకోవడానికి సహాయం చేయమని దేవుణ్ణి కోరండి. మరింత ముఖ్యంగా మీరిద్దరూ దేవునికి సన్నిహితమయ్యే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేయమని దేవుణ్ణి కోరండి. మీ ఇద్దరికీ, ఆయన సాన్నిహిత్యంలోనే నిజమైన సంతోషం లభిస్తుంది. (g05 6/22)
[అధస్సూచీలు]
^ ఈ ఆర్టికల్లోని పేర్లు మార్చబడ్డాయి.
^ అక్టోబరు 22, 2004, డిసెంబరు 22, 2004 తేజరిల్లు! (ఆంగ్లం) సంచికల్లోని “యువత ఇలా అడుగుతోంది” ఆర్టికల్‌లు ఒక అమ్మాయి ప్రేమ బంధాన్ని పెంపొందించుకోవాలనే కోరికను ఒక అబ్బాయికి ఎలా వ్యక్తం చేయవచ్చో వివరిస్తున్నాయి.
[19వ పేజీలోని చిత్రాలు]
మీకు నిజంగా ఆసక్తి లేకపోతే, మీ నుండి ఎలాంటి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోండి