ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
మీ పిల్లలకు చదవడంపట్ల ఇష్టాన్ని పెంచండి
“మంచి చదువరుల పిల్లలు తమ తల్లిదండ్రుల మాదిరిని అనుసరిస్తారని గమనించబడింది” అని న్యూరోలింగ్విస్టిక్స్ నిపుణురాలైన బియట్రిస్ గొన్జాలిజ్ ఆర్టున్యో చెప్పినట్లు రిఫార్మా అనే మెక్సికన్ వార్తాపత్రిక నివేదిస్తోంది. పిల్లలకు నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారు అక్షరాలను గుర్తించగలిగే ముందే వారికి పుస్తకాలు చదవడంపట్ల ఇష్టాన్ని పెంచడానికి మంచిది. ఉదాహరణకు, తమ ఊహాశక్తిని పెంపొందించుకునేందుకు సహాయం చేసే కథలను వారికి చదివి వినిపించవచ్చు. పిల్లలు చదవడాన్ని ఇష్టపడేలా చేయడానికి ఆ వార్తాపత్రిక ఈ సలహాలను ఇచ్చింది: “కలిసి కూర్చోండి. . . . వాళ్ళనే పేజీలు తిప్పనివ్వండి, కావాలనుకున్నప్పుడు ఆగనివ్వండి, ప్రశ్నలు అడగనివ్వండి. . . . కథలోని వస్తువుల గురించి, పాత్రల గురించి మీకు చెప్పమని వారిని అడగండి. వాళ్ళ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇవ్వండి. . . . వాళ్ళు చదువుతున్నదానికి, వాళ్ళ స్వంత అనుభవాలకి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించడానికి సహాయం చేయండి.” (g05 1/8)
ఏనుగులు, మిరప మొక్కలు
ఆఫ్రికాలోని వన్యప్రాణి సంరక్షణా పార్కుల్లో జీవించే ఏనుగులు ఎంతోకాలంగా సంరక్షణావాదులకు, రైతులకు మధ్య తగాదాలకు కారణమవుతున్నాయి. కంచెలు, మంటలు, మద్దెల చప్పుళ్ళు ఇలాంటివేవీ ఏనుగులను పార్కు సరిహద్దుల్లోనే ఉంచలేకపోయాయి. విచ్చలివిడిగా సంచరించే ఏనుగులు పదేపదే పంట పొలాలను నాశనం చేయడమే కాక, ప్రజలను తొక్కి చంపేశాయి. అయితే చివరకు వాటిని పార్కు దాటి బయటకు వెళ్ళకుండా ఆపే శక్తిగలది ఒకటి ఉందని కనుగొనబడింది—అదే మిరప మొక్క. ఏనుగులకు “ఆ మొక్కల వాసన పడట్లేదు” కాబట్టి పార్కు సరిహద్దుల వెంబడి వాటిని పెంచినప్పుడు ఏనుగులు చిరాగ్గా వెనక్కి వచ్చేస్తున్నాయని దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ద విట్నెస్ నివేదించింది. పార్కు ఉద్యోగులు ఇప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు, ఎందుకంటే వారు ఇక “ఏనుగులను పార్కులోకి తోలవలసిన పనిలేదు.” స్థానిక రైతుల పంటలకు నష్టం కూడా తగ్గిపోయింది. మిరప మొక్కలు ఆదాయానికి కూడా చక్కని వనరుగా ఉండవచ్చు. (g05 1/8)
వృద్ధులు భారం కాదు
“వృద్ధుల కోసం ఎంత ఖర్చు అవుతుంది అనే విషయంపై అవధానం నిలిపే బదులు, వారు ఎలాంటి జీతమూ లేకుండానే చేస్తున్న పనులవల్ల కలిగే ప్రయోజనాలను, ఆదా అవుతున్న డబ్బును పరిగణలోకి తీసుకోవడం ప్రాముఖ్యం” అని ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ ద్వారా ప్రచురించబడిన ఒక నివేదిక చెబుతోంది. “వృద్ధులు జీతం లేకుండా చేసే పనుల్లో అధికశాతం, ఇతరులకు జీతమిచ్చి చేయించుకునే పనులు ఇవ్వలేని మద్దతును ఇస్తాయి.” “65 సంవత్సరాలు పైబడిన ఆస్ట్రేలియన్ వృద్ధులు జీతం లేకుండా స్వచ్ఛందంగా చేసే పనులవల్లా చూపించే శ్రద్ధవల్లా ప్రతి సంవత్సరం [సమాజానికి] 3,900 కోట్ల డాలర్ల సహాయం అందుతోంది” అని ఆ అధ్యయనం వెల్లడి చేసింది. వారు స్వచ్ఛందంగా చేసే పనుల్లో పిల్లలను చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న పెద్దవారిని చూసుకోవడమే కాక ఇంటి పనులు చేయడం వంటివి కూడా ఉన్నాయి. జీతం లేకుండా వారు చేసే ఈ పనులు “సమాజాన్ని ఐక్యపరచడానికి సహాయం చేసే సామాజిక ‘జిగురు’గా పనిచేయగలవు” అని ఆ నివేదిక రచయితలు సూచిస్తున్నారు. దాని విలువను మనం డాలర్లలో, సెంట్లలో కొలవలేము. (g05 1/8)
ఎయిడ్స్ రోగులు అత్యధిక సంఖ్యకు చేరుకున్నారు
2003లో యాభై లక్షలమందికి ఎయిడ్స్ వైరస్ సోకింది, “రెండు దశాబ్దాల క్రితం ఆ మహమ్మారి ప్రబలడం ప్రారంభమైన దగ్గరనుండి ఒక సంవత్సరంలో నమోదైన సంఖ్యల్లో అదే పెద్ద సంఖ్య” అని ద వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిస్తోంది. “వర్ధమాన దేశాల్లో HIVతో పోరాడడానికి ప్రపంచమంతా ఏకమై కృషి చేస్తున్నా ఎయిడ్స్ వైరస్ అంతకంతకూ ఎక్కువమందికి సోకి, ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటోంది” అని ఆ పత్రిక నివేదించింది. ఐక్యరాజ్య సమితి మరియు ఇతర సంస్థలు కలిసి ప్రాయోజితం చేసిన యు.ఎన్.ఎయిడ్స్ అనే కార్యక్రమం ప్రచురించిన సమాచారం ప్రకారం, ప్రతీ సంవత్సరం దాదాపు 30 లక్షలమంది ఎయిడ్స్‌తో మరణిస్తున్నారు, 1981లో ఆ రోగ స్వభావాన్ని నిర్ధారించినప్పటి నుండి 2 కోట్లకంటే ఎక్కువమంది చనిపోయారు. ప్రస్తుతం 3.8 కోట్లమందికి HIV వైరస్ ఉందని యు.ఎన్ ఏజెన్సీ అంచనా వేసింది. సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో 2.5 కోట్లమందికి ఎయిడ్స్ ఉంది, ఈ వ్యాధితో అత్యంత ఎక్కువగా బాధపడే ప్రాంతం అదే, దాని తర్వాతి స్థానం దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియాలది, అక్కడ 65 లక్షలమందికి ఈ వ్యాధి సోకింది. “ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఈ వ్యాధి సోకుతున్న వారిలో దాదాపు సగం మంది 15 నుండి 24 సంవత్సరాల్లోపు యౌవనస్థులే” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. (g05 2/22)
చెట్లకు ఎత్తు పరిమితులు
“భూమిపై ప్రాణమున్న వాటన్నింటిలోకి రెడ్‌వుడ్ చెట్లే అత్యంత ఎత్తైనవి, అయితే వాటి ఎత్తుకు కూడా పరిమితి ఉంది, పరిసరాలు, వాతావరణం ఎంత బాగున్నా అవి అంతకంటే ఎత్తు పెరగలేవు” అని లాస్ వెగాస్ రివ్యూ-జర్నల్ వార్తాపత్రిక చెబుతోంది. ప్రస్తుతం బ్రతికివున్న చెట్లలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చెట్టుతోపాటు (110 మీటర్లు, దాదాపు 30 అంతస్తుల భవనం అంత ఎత్తు) అదే జాతికి చెందిన నాలుగు ఇతర చెట్లపై జరిపిన అధ్యయనం, రెడ్‌వుడ్ చెట్టు దాదాపు 130 మీటర్ల ఎత్తు వరకూ పెరగగలదు అని సూచిస్తోంది. ఆకుల నుండి తేమ ఆరిపోతున్న కొద్దీ, వేళ్ళనుండి నీరు చెట్టు అంచు వరకూ వెళ్ళాలి, ఆ నీరు అలా వెళ్ళాలంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రయాణించాలి. అలా అది పైకి చేరడానికి 24 రోజులు పడుతుందని పరిశోధకులు అంచనా వేశారు. దారువు కణజాలం అని పిలువబడే నాళాల ద్వారా నీరు పైకి వెళ్ళే కొద్దీ ఒత్తిడి పెరిగి చివరకు నీటి సరఫరా ఆగిపోతుంది, దానివల్ల చెట్టు ఎత్తు పరిమితమైపోతుంది. ఇప్పటివరకూ అత్యంత పెద్ద చెట్టుగా నమోదైన డగ్లస్ ఫర్ చెట్టు దాదాపు 126 మీటర్ల ఎత్తు వరకూ పెరిగింది. (g05 2/22)
పాండాలు, వెదురు
“చైనాకు, వన్యప్రాణుల సంరక్షణకు చిహ్నమైన పెద్ద పాండా ముందు అనుకున్నట్లుగా ఉనికిలో లేకుండా పోయే ప్రమాదమేమీ లేదు” అని లండన్‌కు చెందిన ద డెయిలీ టెలిగ్రాఫ్ అనే వార్తాపత్రిక చెబుతోంది. ప్రకృతి కోసమైన ప్రపంచవ్యాప్త నిధి, చైనీస్ ప్రభుత్వం కలిసి నిర్వహించిన నాలుగు సంవత్సరాల అధ్యయనం, ముందు అంచనా వేసిన ప్రకారం అడవుల్లో 1,000 నుండి 1,100 పాండాలు కాక 1,590 కంటే ఎక్కువ పాండాలు ఉన్నాయని కనుగొంది. ఈ ఖచ్చితమైన సంఖ్య, పాండాల కోసం అన్వేషించవలసిన ప్రాంతాల చుట్టుగీత గీయడానికి సాటిలైట్ పొజీషనింగ్ సిస్టమ్ వంటి మెరుగైన సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం ద్వారా కనుగొనబడింది. ఆ అధ్యయన ఫలితాలు వన్యప్రాణుల సంరక్షణావాదులకు సంతోషం కలిగించినా, అడవుల నరికివేతవల్ల పాండాల ముఖ్య ఆహారమైన వెదురు మొక్కలకు తీవ్రమైన ప్రమాదం వాటిల్లిందని ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న వరల్డ్ కన్సర్వేషన్ మానిటరింగ్ సెంటర్ (ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ నియంత్రణా కేంద్రం) హెచ్చరించింది. త్వరితగతిన జరుగుతున్న అడవుల నరికివేతవల్ల వెదురు మొక్కలు ఎక్కువగా నష్టపోవడానికిగల కారణం “ప్రతి జాతికి చెందిన మొక్కలు 20 నుండి 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూతపూసి తర్వాత చనిపోవడమే” అని టెలిగ్రాఫ్ నివేదించింది. (g05 3/8)
నాలుకను వేగంగా కదిపే ఊసరవెల్లులు
ఊసరవెల్లి తన ఆహారాన్ని పట్టుకోవడానికి తన నాలుగను మెరుపు వేగంతో ముందుకు ఎలా కదిలిస్తుంది? “వడిసెలకుండే రబ్బరు తాడును లాగి పట్టుకున్నప్పుడు మనం ఉపయోగించే పద్ధతిలాంటి పద్ధతే అది ఉపయోగిస్తుంది” అని న్యూ సైంటిస్ట్ పత్రిక నివేదిస్తోంది. ఊసరవెల్లి నాలుకకు కోశంలాంటి పొరలు ఉంటాయని, వాటి చుట్టూ వేగాన్ని పెంచే సాధనంలా పనిచేసే ఒక కండరం ఉంటుందని శాస్త్రజ్ఞులకు ఇప్పటికే తెలుసు. అయితే ఇప్పుడు దానిని స్లో-మోషన్ వీడియో సహాయంతో చూసిన డచ్ పరిశోధకులు, ఊసరవెల్లి తన నాలుకను బయటకు తీయడానికి కేవలం 200 మిల్లి సెకెండ్ల ముందు “తన నాలుకపై ఉండే కోశం వంటి పొరల్లోకి శక్తిని నింపడానికి, వేగాన్ని పెంచే సాధనంగా పనిచేసే కండరాన్ని ఉపయోగించి ఆ పొరలను ఒకదానిలో ఒకటి ఇమిడిపోయే టెలిస్కోప్ భాగాల్లా కనిపించేటట్లు మారుస్తుంది. ఊసరవెల్లి నోరు తెరిచినప్పుడు అప్పటివరకూ పట్టి ఉంచబడిన శక్తి కేవలం 20 మిల్లి సెకెండ్లలో విడుదల చేయబడుతుంది, అందుకే దాని నాలుక వేగంగా ముందుకు వచ్చి” ఆహారాన్ని పట్టుకుంటుంది అని కనుగొన్నారు. (g05 3/22)