కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఓషధి చికిత్సలు మీకు సహాయం చేయగలవా?

ఓషధి చికిత్సలు మీకు సహాయం చేయగలవా?

ఓషధి చికిత్సలు మీకు సహాయం చేయగలవా?

అనాదిగా వ్యాధులను నయం చేయడానికి ఓషధి చికిత్సా విధానాలు వాడుకలో ఉన్నాయి. దాదాపు సా.శ.పూ. 16వ శతాబ్దంలో ఐగుప్తులో తయారుచేయబడిన ఏబర్స్‌ పాపిరస్‌లో వివిధ రకాల బాధలకు వందల కొలది సంప్రదాయ చికిత్సా విధానాలున్నాయి. అయితే, ఈ ఓషధి చికిత్సా విధానాలు సాధారణంగా ఒక తరంనుండి మరో తరానికి మౌఖికంగా వివరించబడేవి.

పాశ్చాత్య ఓషధి వైద్యం మొదటి శతాబ్దపు గ్రీకు వైద్యుడైన డైస్‌కోరడీస్‌ వ్రాసిన డి మెటీరియ మెడికా గ్రంథంతో మొదలైనట్టు అనిపిస్తోంది. అది ఆ తర్వాత 1,600 సంవత్సరాల వరకు ప్రముఖ ఔషధ పరిజ్ఞాన గ్రంథంగా చెలామణిలో ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, సంప్రదాయ ఓషధి చికిత్సలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. జర్మనీలో, ఓషధి చికిత్సలకయ్యే ఖర్చును ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు తిరిగి చెల్లిస్తాయి కూడా.

కొన్నిసార్లు ఆధునిక మందులకంటే అనువంశిక, సంప్రదాయ ఓషధి చికిత్సే సురక్షితమని కొందరు వాదించినా, వాటివల్ల కూడా ప్రమాదాలున్నాయి. అందువల్ల ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి: ఓషధి చికిత్స గురించి ఆలోచించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, సిఫారసులు పరిగణలోకి తీసుకోవాలి? ఒకే చికిత్సా విధానం మరింత ప్రయోజనకరంగా ఉండగల పరిస్థితులేమైనా ఉన్నాయా? *

ఓషధులు ఎలా సహాయపడవచ్చు

ఓషధులకు చాలా వైద్య గుణాలున్నాయని చెప్పబడుతోంది. కొన్నిరకాల ఓషధులు అంటువ్యాధులు సోకకుండా శరీరాన్ని బలపరుస్తాయనే నమ్మకముంది. మరికొన్ని జీర్ణశక్తికి, మానసిక ప్రశాంతతకు, సుఖ విరోచనానికి, లేదా వివిధ గ్రంథులు సరిగా పనిచేసేలా సహాయం చేస్తాయని చెప్పబడుతోంది.

ఓషధులకు అటు పోషకవిలువలు, ఇటు వైద్య విలువలు రెండూ ఉండవచ్చు. ఉదాహరణకు, డయూరెటిక్స్‌గా పనిచేసే పార్‌స్లీవంటి (కొత్తిమీర జాతికిచెందిన) కొన్ని మొక్కల్లో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. * ఈ మొక్కల్లోని పొటాషియం మూత్రం ద్వారా నష్టపోయే ఈ ఆవశ్యక మూలపదార్థాన్ని పూరిస్తుంది. ఇదే ప్రకారం, దీర్ఘకాలంగా ఉపశమన మందుగా వాడబడుతున్న వలేరియన్‌ (వలేరియానా అఫిసినాలిస్‌) మొక్కలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆ కాల్షియం నాడీ వ్యవస్థపై ఓషధి ఉపశమన ప్రభావాన్ని అధికం చేయవచ్చు.

ఓషధులను ఎలా తీసుకోవచ్చు

ఓషధులను అనేక విధాలుగా అంటే తేనీరులాగ కషాయముగా, ద్రావణముగా తీసుకోవచ్చు, ముద్దగా నూరి కట్టుకట్టవచ్చు. ఓషధిపై మరిగేనీరు పోయడం ద్వారా తేనీరు తయారవుతుంది. తేనీరుగా ఉపయోగించే ఓషధులను సాధారణంగా నీటిలో మరిగించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓషధి మూలికలు, బెరడు వంటివాటి సారం తీయడానికి వాటిని నీటిలో మరిగించి కషాయం తయారుచేస్తారు.

ద్రావణాల సంగతేమిటి? ఇవి “స్వచ్ఛమైన లేదా నీళ్లుకలిపిన సారా లేదా బ్రాందీ లేదా వొడ్కావంటి వాటి సహాయంతో తీయబడిన ఓషధి సారమని” ఒక పుస్తకం చెబుతోంది. ఇక ముద్దగా నూరే ఓషధుల విషయానికొస్తే వీటిని వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. సాధారణంగా వాటిని వ్యాధిసోకిన లేదా నొప్పివున్న శరీరభాగంపై పూతపూస్తారు.

అనేక విటమిన్లు, మందుల్లా కాకుండా ఓషధుల్ని ఎక్కువ మట్టుకు ఆహారపదార్థాలుగా పరిగణిస్తూ, తరచూ పరగడుపునే వాటిని తీసుకుంటారు. మరింత అనువుగా, నోటికి వికారంగా ఉండకుండా వాటిని క్యాప్సుల్స్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు ఓషధి చికిత్సలు చేయించుకోవడానికి నిర్ణయించుకుంటే, వైద్య సలహా తీసుకొని అలా చేయడం మంచిది.

సాధారణ జలుబు, అజీర్తి, మలబద్ధకం, నిద్రలేమి, కడుపులో వికారం మొదలైన వాటికి సంప్రదాయబద్ధంగా ఓషధులు సిఫారసుచేయబడతాయి. అయితే, ఓషధులు కొన్నిసార్లు ప్రమాదకరమైన జబ్బులను నయం చేయడానికే కాదు వాటిని నిరోధించడానికి సైతం ఉపయోగించబడతాయి. ఉదాహరణకు, జర్మనీ ఆస్ట్రియాలలో సా పాల్‌మెట్టో (సెరెనోవ రిపెన్స్‌) ఓషధిని బెనిన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లాసియకు (పౌరుష గ్రంథి వాపుకు) ప్రాథమిక చికిత్సగా వాడతారు. కొన్ని దేశాల్లో ఈ వ్యాధి చివరకు 50 నుండి 60 శాతంమంది పురుషులకు సోకుతుంది. అయితే, ఆ వాపుకు కారణాన్ని వైద్యుని ద్వారా రోగనిర్ధారణ చేయించుకొని, పరిస్థితి కేన్సర్‌ ఉన్న సందర్భాల్లోలా మరింత తీవ్రమైన చికిత్స చేయాల్సిన స్థితికి దిగజారలేదని నిశ్చయపరచుకోవడం ప్రాముఖ్యం.

కొన్ని హెచ్చరికలు

ఫలాని ఓషధి సురక్షితమని విస్తృతంగా పరిగణించబడుతున్నా, జాగ్రత్త పాటించడం మంచిది. ఒక ఉత్పాదన మీద “ప్రకృతి సిద్ధమైనది” అనే లేబుల్‌ ఉన్నా మీ జాగ్రత్తలో మీరుండండి. ఓషధులకు సంబంధించిన ఓ సర్వసంగ్రహ నిఘంటువు ఇలా చెబుతోంది: “కొన్నిరకాల ఓషధులు పూర్తిగా ప్రమాదకరమనే విషయం చేదునిజం [విచారకరంగా] కొందరు ఏ ఓషధినైనా అంటే అది ప్రమాదకరమైనదే అయినా నిరపాయకరమైనదే అయినా దాని వల్ల రాగల పర్యవసానాల గురించి అంతగా పట్టించుకోరు.” ఓషధుల్లోవున్న రసాయన మిశ్రమాలు గుండె కొట్టుకోవడాన్ని, రక్త పీడనాన్ని, గ్లూకోజ్‌ పరిమాణాల్ని మార్చగలవు. కాబట్టి, ప్రత్యేకంగా గుండె జబ్బు, అధిక రక్త పీడనం, లేదా రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువున్న డయబెటిస్‌ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.

అయితే, సాధారణంగా ఓషధుల వల్ల తలనొప్పి, మత్తు, కడుపులో వికారం లేదా శరీరంపై దద్దుర్లు కలిగించే ఎలర్జీవంటి ప్రతిక్రియలు మాత్రమే కలుగుతాయి. ఓషధులు ఫ్లూవంటి లేదా ఇతర రోగలక్షణాలు కలుగజేస్తూ “స్వస్థతా సంక్షోభం” సృష్టిస్తాయని కూడా చెప్పబడుతోంది. ఓషధులు తీసుకొనే వ్యక్తికి రోగం తగ్గే ముందు అది ఇంకా ఎక్కువవుతున్నట్లు కనిపిస్తుంది. ఓషధి చికిత్స ఆరంభంలో శరీరం నుండి విషపూరిత వ్యర్థపదార్థాలు తొలగించబడుతున్న కారణంగా ఈ ప్రతిక్రియ ఉంటుందనేది సాధారణ వాదన.

కొన్నిరకాల ఓషధులు తీసుకున్న కారణంగా అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తున్నాయనే వాస్తవం, జాగ్రత్త వహించవలసిన, సరైన నిర్దేశాన్ని తీసుకోవలసిన అవసరతను నొక్కిచెబుతోంది. ఉదాహరణకు, ఎఫెడ్రా అనే ఓషధిని సాధారణంగా బరువు తగ్గడానికి తీసుకుంటారు, అయితే అది రక్తపీడనం పెరిగేలా కూడా చేయగలదు. అమెరికాలో నివేదించబడిన మరణాల్లో వందకు పైగా మరణాలకు కారణం ఎఫెడ్రా ఉత్పాదనలని తలంచబడుతోంది, అయినప్పటికీ శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన పేథోలజిస్ట్‌ స్టీవెన్‌ కార్చ్‌, “[ఎఫెడ్రా తీసుకుని] చనిపోయిన వారిలో తీవ్ర గుండెపోటుతో లేదా మోతాదుకు మించి తీసుకున్న కేసులు మాత్రమే నాకు తెలుసు” అని చెబుతున్నాడు.

ఓషధికి అనుబంధంగా ఉపయోగించే వాటికి సంబంధించిన ఓ పుస్తక గ్రంథకర్త డాక్టర్‌ లోగెన్‌ ఛాంబెర్లియన్‌ ఇలా హెచ్చరిస్తున్నాడు: “ఓషధుల హానికరమైన ప్రభావాల గురించి ఇటీవలి సంవత్సరాల్లో అందిన ప్రతీ నివేదిక ప్రజలు నిర్దేశాలను పాటించక పోవడానికి సంబంధించినవే. . . . విశ్వసనీయ ఉత్పాదనల మోతాదు సిఫారసులు సురక్షితమైనవి, సంరక్షకమైనవి కూడా. శిక్షణ పొందిన హెర్బలిస్ట్‌ నుండి సరైన సలహా ఉంటే తప్ప ఆ సిఫారసులకు అనుగుణంగా కాకుండా మరో విధంగా వాడకండి.”

హెర్బలిస్ట్‌ లిండా పేజ్‌ హెచ్చరికతో కూడిన ఈ సలహా ఇస్తోంది: “ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితుల్లో సైతం, తగు మోతాదులోనే తప్ప ఎక్కువ మోతాదు తీసుకోకూడదు. ఎక్కువ సమయాన్ని కేటాయించి, సున్నితమైన చికిత్స ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి సమయం పడుతుంది.”

ఓషధి చికిత్సకు సంబంధించిన ఓ పుస్తకం, కొన్ని ఓషధులు వాటంతటవే అధిక మోతాదును నివారించగలిగే ప్రక్రియను కలిగి ఉంటాయని వివరిస్తోంది. ఉదాహరణకు, శరీరానికి ఉపశమనమిచ్చే ఒక ఓషది మోతాదుమించి తీసుకుంటే వాంతులయ్యేలా చేస్తుంది. అయితే, అన్ని ఓషధుల్లో ఉండని ఈ గుణం, సురక్షిత మోతాదుకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని తగ్గించదు.

అయినప్పటికీ, చాలామంది ఒక ఓషధి బాగా పనిచేయాలంటే సరైన పద్ధతిలో చాలినంత మోతాదు తీసుకోవాలని నమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో, అలాచేయడానికి ఒకే ఒక మార్గం ద్రావణం తీసుకోవడం. జ్ఞాపకశక్తిని, రక్తప్రసరణను పెంచడానికి చాలాకాలంగా వాడుకలోవున్న గింగో బిలోబ విషయంలో ఇది వాస్తవం, ఎందుకంటే ప్రభావం చూపే ఒక మోతాదు తయారుచేయడానికి చాలా కిలోల ఆకులు అవసరమవుతాయి.

ప్రమాదకరం కాగల మిశ్రమం

ఓషధులు ఇతర మందులతో వివిధ రీతుల్లో ప్రతిక్రియ జరుపగలవు. ఉదాహరణకు, అవి ఇతర మందుల ప్రభావాన్ని ఎక్కువచేయగలవు లేదా తగ్గించగలవు, మామూలుకంటే వేగంగా అది శరీరం నుండి తొలగిపోయేలా చేయవచ్చు లేదా దుష్పరిణామాల ప్రమాదాన్ని పెంచవచ్చు. మామూలు మానసిక కృంగుదలకు జర్మనీలో తరచూ ఇవ్వబడుతున్న సెయింట్‌ జాన్స్‌ వోర్ట్‌ ఓషధి అనేక ఇతర మందులను మామూలు కంటే రెండింతల వేగంతో తొలగిస్తూ, వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కుటుంబ నియంత్రణ బిళ్లలతో సహా మీరు ఏవైనా లిఖిత మందులు వాడుతుంటే ఓషధులు తీసుకునే ముందు మీ డాక్టరును సంప్రదించండి.

ఓషధుల నివారణా గుణాలకు సంబంధించిన ఓ పుస్తకమిలా చెబుతోంది: “కొన్నిరకాల ఓషధులను మద్యం, గంజాయి, కోకైన్‌, ఇతర మాదక ద్రవ్యాలు, పొగాకు వంటివాటితోపాటు తీసుకుంటే కలిగే ప్రతిక్రియలతో ప్రాణాపాయం ఏర్పడే అవకాశముంది. . . . ప్రత్యేకంగా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరలాంటి [మందులకు] దూరంగా ఉండాలని లోకజ్ఞానం మీకు తెలియజేస్తుంది.” అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా ఆ సలహాను గంభీరంగా తీసుకోవాలి. పొగాకు, వ్యసనకరమైన మందుల విషయానికొస్తే “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అనే బైబిలు ఆజ్ఞకు లోబడడం ద్వారా క్రైస్తవులు కాపాడబడతారు.​—2 కొరింథీయులు 7:1.

ఓషధుల విషయమే తీసుకుంటే, ఒక రెఫరెన్సు గ్రంథం ఈ హెచ్చరిక చేస్తోంది: “మీరు ఓషదులు తీసుకునే సమయంలో గర్భం ధరిస్తే, మీ డాక్టరుకు చెప్పి, ఆయనతో లేదా ఆమెతో విషయాన్ని చర్చించేంతవరకు వాటిని వాడడం మానేయండి. ఆ ఓషధిని ఎంత మోతాదులో, ఎంతకాలం పాటు వాడారో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి.”

“[ఓషధులను] సొంతగా వాడడంలో చాలా ప్రమాదాలున్నాయని” ఓషధుల నిఘంటువు ఒకటి చెబుతోంది. దీనితోపాటు ఇవ్వబడిన “సొంతవైద్యంలోని ప్రమాదాలు” అనే బాక్సులో ఓషధులవల్ల కలిగే అవకాశమున్న ప్రమాదాల పట్టికను మీరు చూడవచ్చు.

అన్ని ఆరోగ్య ఉత్పాదనల విషయంలోలాగే, ఓషధులను కూడా జాగ్రత్తగా, తగిన పరిజ్ఞానంతో సమతుల్యం కలిగి వాడాలి, అలాగే కొన్నింటికి ప్రస్తుతం నివారణ లేదని గుర్తుంచుకోండి. దేవుని రాజ్య దీవెనకర పరిపాలన క్రింద, వ్యాధికీ మరణానికీ కారణమైనది, అంటే మన ఆది తల్లిదండ్రుల నుండి మనకు వారసత్వంగా సంక్రమించిన అపరిపూర్ణత పూర్తిగా తొలగింపబడే కాలం కోసం నిజ క్రైస్తవులు ఎదురుచూస్తారు.​—రోమీయులు 5:12; ప్రకటన 21:3, 4. (g03 12/22)

[అధస్సూచీలు]

^ తేజరిల్లు! వైద్య పత్రిక కాదు, అందువల్ల అది ఎలాంటి ప్రత్యేకమైన చికిత్సను లేదా ఆహారాన్ని అంటే ఓషధి చికిత్సను గానీ ఇతరత్రా చికిత్సను గానీ సిఫారసు చేయదు. ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడినదంతా కేవలం సాధారణ సమాచారమే. ఆరోగ్యం, చికిత్స విషయాల్లో పాఠకులు తామే సొంతగా నిర్ణయించుకోవాలి.

^ డయూరెటిక్స్‌ మూత్ర ధారను పెంచుతాయి.

[18వ పేజీలోని బాక్సు]

సొంత వైద్యంలోని ప్రమాదాలు

యోగ్యతగల డాక్టరు సహాయం లేకుండా ఓషధులు వాడడంలో ఈ క్రింది ప్రమాదాలుంటాయి.

మీ అనారోగ్యానికి కారణమేమిటో మీకు నిజంగా తెలిసి ఉండకపోవచ్చు.

మీరు సరిగానే రోగనిర్ధారణ చేసినా, మీ సొంత వైద్యవిధానం మీ రుగ్మతకు తగినట్టు ఉండకపోవచ్చు.

మీ సొంత వైద్యం మరింత ముఖ్యమైన, అయితే అవసరమైన, సముచితమైన చికిత్సను జాప్యం చేయవచ్చు.

మీ సొంత వైద్యం, ఉదాహరణకు ఎలర్జీ చికిత్స కోసం లేదా రక్తపోటు చికిత్స కోసం డాక్టరిచ్చిన మందులకు సరిపడక​పోవచ్చు.

మీ సొంత వైద్యం మీ స్వల్ప అనారోగ్యాన్ని నయం చేయవచ్చు, అయితే అధిక రక్తపోటువంటి మరో ఆరోగ్య సమస్యను అధికం ​చేయవచ్చు.

[చిత్రసౌజన్యం]

మూలం: Rodale’s Illustrated Encyclopedia of Herbs