కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6 మార్గాలు మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి

6 మార్గాలు మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి

6 మార్గాలు మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి

వర్ధమాన దేశాల్లో అదొక సవాలు

నేడు ఎంతోమంది ప్రజలు, ప్రత్యేకించి సురక్షితమైన నీరు, తగిన పారిశుద్ధ్య వసతుల్లేని దేశాల్లోనివారు పరిశుభ్రంగా ఉండేందుకు చాలా కష్టపడవలసి వస్తోంది. అలా కష్టపడవలసి వచ్చినా, పరిశుభ్రత శ్రమకు తగిన ఫలితమిస్తుంది. చిన్న పిల్లల వ్యాధులు, మరణాల్లో సగం కంటే ఎక్కువశాతం, మురికి చేతులవల్ల నోటిలో ప్రవేశించిన సూక్ష్మక్రిములు లేదా కలుషితాహారం లేదా నీళ్ళ ద్వారానే కలుగుతున్నాయని అంచనా వేయబడింది. ఐక్యరాజ్య సమితి బాలల నిధి ప్రచురించిన ఫ్యాక్ట్స్‌ ఫర్‌ లైఫ్‌ అనే ప్రచురణలో పేర్కొనబడిన ఈ క్రింది సలహాలు పాటిస్తే చాలా వ్యాధులను, ప్రత్యేకించి అతిసార వ్యాధిని అరికట్టవచ్చు.

1 మలం తొలగించే సురక్షిత విధానం

మలంలో అనేక సూక్ష్మక్రిములు ఉంటాయి. వ్యాధులను కలుగజేసే సూక్ష్మక్రిములు ఆహారంలోకి, నీటిలోకి, చేతులపైకి, గిన్నెలపైకి, లేదా వండి వడ్డించే ప్రదేశాలకు చేరినప్పుడు అవి నోటి ద్వారా కడుపులోకిచేరి అనారోగ్యం కలుగజేస్తాయి. అలాంటి సూక్ష్మక్రిములు వ్యాపించకుండా అరికట్టేందుకు అత్యుత్తమ మార్గం మలాన్ని పూర్తిగా తొలగించడమే. మానవ మలవిసర్జనకు టాయిలెట్‌ను లేదా మరుగుదొడ్డిని ఉపయోగించాలి. ఇళ్ళ దగ్గర, త్రోవల్లో, లేదా పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో జంతు మలం లేకుండా చూసుకోండి.

టాయిలెట్‌లు లేదా మరుగుదొడ్లు లేని ప్రాంతాల్లో, మలాన్ని సత్వరమే మట్టితో కప్పివేయండి. శిశువుల మలంతో సహా, అన్నిరకాల మలంలో వ్యాధికారక సూక్ష్మ క్రిములు ఉంటాయని గుర్తుంచుకోండి. పిల్లల మలాన్ని కూడా మరుగుదొడ్లలో పడవేయండి లేక మట్టితో కప్పివేయండి.

మరుగుదొడ్లను, టాయిలెట్‌లను తరచూ శుభ్రం చేయండి. మరుగుదొడ్లను కప్పి ఉంచండి, టాయిలెట్‌లను ఫ్లష్‌ చేయండి.

2 మీ చేతులను కడుక్కోండి

మీరు మీ చేతులను క్రమంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మీ చేతులను సబ్బుతో లేదా బూడిదతో రుద్ది నీళ్ళతో కడుక్కోవడం సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. కేవలం నీళ్ళతో చేతులను కడుక్కుంటే సరిపోదు​—⁠రెండు చేతులను సబ్బుతో లేదా బూడిదతో రుద్ది కడుక్కోవాలి.

మలవిసర్జన చేసిన తర్వాత, మలవిసర్జన చేసిన శిశువును కడిగిన తర్వాత కూడా మీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ప్రాముఖ్యం. అలాగే జంతువులను ముట్టుకున్న తర్వాత, భోజనం చేసేముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు కూడా మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి.

చేతులను కడుక్కోవడం, వ్యాధికారక క్రిముల నుండి ప్రజలను కాపాడేందుకు సహాయం చేస్తుంది. ఈ క్రిములు సూక్ష్మదర్శినితోతప్ప మామూలుగా చూడలేనంత సూక్ష్మంగా ఉంటాయి. అవి మలమూత్రాల్లో, నీటి ఉపరితలంమీద, మట్టిలో అలాగే పచ్చి మాంసంలో లేదా సరిగ్గా ఉడికించని మాంసంలో ఉంటాయి. ఈ క్రిములు మీ శరీరంలోకి ప్రవేశించకుండా అరికట్టడానికి మీ చేతులు కడుక్కోవడమే ఓ ప్రధాన మార్గం. అంతేకాక, మరుగుదొడ్ల దగ్గరకు వెళ్లినప్పుడు చెప్పులు వేసుకోవడం ద్వారా అక్కడ ఉండే క్రిములు మీ కాళ్ళ చర్మం నుండి మీ శరీరంలోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు.

చిన్నపిల్లలు తరచూ నోట్లో వేళ్లు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ చేతులను తరచూ కడగండి, ప్రత్యేకించి వారి మలవిసర్జన తర్వాత, ఆహారం తినే ముందు వాళ్ళ చేతులు కడగండి. సొంతగా చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్డి లేదా టాయిలెట్‌ లేదా మలవిసర్జన చేసే ప్రాంతాల్లో ఆడకుండా ఉండడం వాళ్ళకు నేర్పించండి.

3 ప్రతిరోజు మీ ముఖం కడుక్కోండి

కంటి వ్యాధులను అరికట్టేందుకు సహాయకంగా, ప్రతిరోజు మీ ముఖం సబ్బుతో కడుక్కోండి. చిన్నపిల్లల ముఖాలు కూడా కడగండి. మురికి ముఖం, సూక్ష్మక్రిములను మోసుకువచ్చే ఈగలను ఆకర్షిస్తుంది. ఈ సూక్ష్మక్రిములు కంటి వ్యాధులను, అంధత్వాన్ని కూడా కలుగజేయవచ్చు.

మీ పిల్లల కళ్ళను క్రమంగా పరీక్షించండి. ఆరోగ్యదాయకమైన కళ్ళు తేమగా, మెరుస్తూ ఉంటాయి. కళ్ళు పొడిబారినట్లు, ఎర్రగా లేదా వాచినట్లు ఉంటే లేదా కళ్ళలోంచి నీళ్ళు కారుతుంటే పిల్లలను ఆరోగ్య కేంద్ర సిబ్బందికి లేదా డాక్టర్‌కు చూపించాలి.

4 పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడండి

కుటుంబాలు పరిశుభ్రమైన నీటిని వాడుతూ, ఆ నీటిలో సూక్ష్మక్రిములు లేకుండా జాగ్రత్తపడినప్పుడు అస్వస్థతలు తక్కువౌతాయి. మీరు ఉపయోగించే నీరు, సరిగ్గా నిర్మించబడి మంచి నిర్వహణగల పైపుల్లోంచి లేదా కలుషితంకాని బావులు లేదా ఊటలనుండి వచ్చేదైతే అది శుభ్రంగానే ఉండవచ్చు. అయితే చెరువులు, నదులు లేదా కప్పివుంచని ట్యాంకులు లేదా బావుల నుండి వచ్చే నీరు శుభ్రంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ, కాని ఆ నీటిని మరిగించి సురక్షిత త్రాగే నీరుగా చేసుకోవచ్చు.

బావులను కప్పివుంచాలి. నీళ్ళు చేదడానికి ఉపయోగించే బక్కెట్లను, తాళ్ళను, నీళ్ళను నిలువచేసుకోవడానికి ఉపయోగించే బిందెలను తరచూ శుభ్రం చేయాలి, వాటిని పరిశుభ్రమైన స్థలంలో ఉంచాలి, నేలపై ఉంచకూడదు. జంతువులను త్రాగు నీటి పరిసరాలకు దూరంగా, ఇళ్ళకు వెలుపల ఉంచాలి. నీటి దాపుల్లో క్రిమిసంహారకాలను లేదా రసాయనాలను ఉపయోగించకండి.

ఇంటిలో పరిశుభ్రమైన, మూత పెట్టిన పాత్రలో నీటిని ఉంచాలి. కుళాయి ఉన్న నీటి పాత్రను ఉపయోగించడం అత్యుత్తమం. ఒకవేళ నీటిపాత్రకు కుళాయి లేకపోతే దానిలోనుండి నీటిని తీసుకోవడానికి శుభ్రమైన కాడ గరిటెను లేదా కప్పును ఉపయోగించాలి. త్రాగే నీటిని మురికి చేతులతో అస్సలు ముట్టుకోకూడదు.

5 ఆహారాన్ని సూక్ష్మక్రిముల నుండి కాపాడండి

ఆహారాన్ని చక్కగా ఉడికించడం ద్వారా మీరు సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చు. ఆహారం, ప్రత్యేకించి మాంసం, పెంపుడు పక్షుల మాంసం బాగా ఉడికించాలి. మామూలు వేడిగల ఆహారంలో సూక్ష్మక్రిములు తర్వగా వృద్ధవుతాయి. కాబట్టి ఆహారాన్ని వండిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినాలి. ఆహారాన్ని రెండు గంటలకంటే ఎక్కువసేపు ఉంచవలసి వస్తే, దాన్ని వేడిగా ఉండే స్థలంలోనైనా లేదా చల్లగా ఉండే స్థలంలోనైనా పెట్టండి. అలాగే వండిన ఆహారాన్ని తర్వాతి భోజనం వరకు ఉంచాలనుకుంటే దానిపై మూత పెట్టండి. అలా చేయడం, ఆహారాన్ని ఈగలనుండి కీటకాల నుండి కాపాడుతుంది. ఆ ఆహారాన్ని తినే ముందు మళ్ళీ వేడి చేసుకోండి.

శిశువులకు తల్లి పాలే అత్యుత్తమమైన, అతి సురక్షితమైన ఆహారం. పశువుల పాలయితే మరిగించని వాటికన్నా అప్పుడే మరిగించిన లేదా పాశ్చరైజ్‌ చేసినవి మరింత సురక్షితమైనవి. పిల్లలకు పాలు త్రాగించే పాల సీసాను ప్రతిసారి మరిగిన నీళ్లతో శుభ్రంచేయకుండా ఉపయోగించకండి. పాల సీసాల్లో తరచూ అతిసార వ్యాధి కలుగజేసే సూక్ష్మక్రిములు ఉంటాయి. పిల్లలకు తల్లిపాలు పట్టడం లేదా పాలపీకలేని పరిశుభ్రమైన కప్పుతో పాలు పట్టడం మంచిది.

పళ్ళను, కాయగూరలను శుభ్రమైన నీళ్ళతో కడగండి. చిన్నపిల్లలకు పచ్చివి ఇచ్చినప్పుడు ఇలా కడగడం మరింత ప్రాముఖ్యం.

6 ఇంటిలో చెత్తంతా తొలగించడం

ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, చిట్టెలుకలు సూక్ష్మక్రిములను మోసుకెళతాయి. ఇవి చెత్తాచెదారంలో ఎక్కువగా పెరుగుతుంటాయి. మీరు నివసించే ప్రాంతంలో చెత్తను తొలగించడానికి ఏర్పాటు లేకపోతే, మీ ఇంటి పెరట్లో గొయ్యి తీసి ప్రతిరోజు దాంట్లోవేయడమో లేదా కాల్చివేయడమో చేయండి. మీ ఇంటిలో చెత్తాచెదారం, వ్యర్థమైన నీరు లేకుండా చూసుకోండి.

మీరు ఈ సలహాలను క్రమం తప్పకుండా పాటిస్తే, ఎక్కువకాలం గడవకుండానే అవి మీ దినచర్యలో భాగంగా తయారవుతాయి. వాటిని అమలుచేయడం కష్టం కాదు, దానికి డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాదు. అయితే ఆ సూచనలు మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడతాయి. (g03 9/22)

[11వ పేజీలోని చిత్రం]

టాయిలెట్‌లు, మరుగుదొడ్లు లేని ప్రాంతాల్లో, మలాన్ని వెంటనే మట్టితో కప్పివేయండి

[11వ పేజీలోని చిత్రం]

క్రమంగా మీ చేతులను కడుక్కోండి

[12, 13వ పేజీలోని చిత్రం]

కుటుంబాలు పరిశుభ్రమైన నీటిని ఉపయోగిస్తూ, నీటిలో సూక్ష్మక్రిములు లేకుండా చూసుకుంటే అస్వస్థతలు తక్కువౌతాయి

[12వ పేజీలోని చిత్రాలు]

మీ ముఖాన్ని ప్రతిరోజు సబ్బుతో కడుక్కోండి

[13వ పేజీలోని చిత్రం]

వండిన ఆహారాన్ని మీరు తర్వాతి భోజనం వరకూ నిల్వచేయాలనుకుంటే దానిపై మూత పెట్టండి

[13వ పేజీలోని చిత్రం]

ఇంటిలోని చెత్తను ప్రతిరోజు పాతిపెట్టాలి లేదా కాల్చివేయాలి