భూకంపం తర్వాతి పరిణామాలను తట్టుకోవడం
భూకంపం తర్వాతి పరిణామాలను తట్టుకోవడం
“ఉదయం నుండీ నడుస్తూనే ఉన్నాం. ప్రాణరక్షణకై పరుగులు తీస్తున్నాం. తినటానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్లు లేవు. ఇళ్ళన్నీ కుప్పకూలిపోయాయి.”— హర్జీవన్, ఇండియాలో సంభవించిన 7.9 విస్తీర్ణతగల భూకంపం నుండి బ్రతికి బయటపడిన వ్యక్తి.
భూమి కంపించి చూపించే ఉగ్రతను తట్టుకోవడం మహా భయంకరంగా ఉంటుంది. తైవాన్‌లో 1999లో సంభవించిన భూకంపం నుండి బ్రతికి బయటపడిన ఒక స్త్రీ ఇలా గుర్తు చేసుకుంటోంది: “నా మంచం ప్రక్కనున్న 2.4 మీటర్ల ఎత్తుగల చెక్క అలమరాలో నుండి పుస్తకాలు ఎగురుకుంటూ వచ్చి నా చుట్టూ పడుతున్నాయి.” ఇంకా ఇలా చెబుతోంది: ‘నేను క్రొత్తగా కొనుక్కొన్న మోటర్ సైకిల్ హెల్మెట్ ఆ అలమరా మీది నుండి నా పరుపు మీదకి నా తల ప్రక్కకే వచ్చి పడింది. నన్ను కాపాడవలసిన హెల్మెట్ నా ప్రాణాలను పొట్టనబెట్టుకొని ఉండేదే.’
భూకంపం నుండి బ్రతికి బయటపడిన తర్వాత
భూకంపంలో చిక్కుకుని బ్రతికి బయటపడడమన్నది అతిభయంకరమైన అనుభవం, అయితే అది కేవలం ప్రారంభం మాత్రమే. అది జరిగిన తర్వాతి గంటల్లో గాయపడిన వారిని కనుగొని, వారికి చికిత్స చేయించడానికి పునరావాస కార్యకర్తలు ధైర్యంగా కృషి చేస్తారు. తరచూ, తలెత్తబోయే పరిణామాలకు గురికాగల ప్రమాదంతోనే వారు ఆ పని చేస్తారు. ఇటీవల ఎల్ సాల్వడార్‌లో సంభవించిన భూకంపం తర్వాత పరిసర ప్రాంతాలను కప్పేసిన చెత్తా చెదారాల గుట్టను త్రవ్వాలనుకున్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “అత్యంత జాగ్రత్తతో మెలగవలసి ఉంటుంది. నేల గనుక హఠాత్తుగా మళ్ళీ కదిలిందంటే, మిగిలివున్న ఈ కొండ కూడా విరుచుకుపడుతుంది.”
కొన్నిసార్లు, బాధితులకు సహాయం చేయడానికి కొంతమంది అసామాన్యమైన స్వయంత్యాగ స్ఫూర్తిని చూపిస్తారు. ఉదాహరణకు, 2001 తొలిభాగంలో ఇండియాలో ఒక ఘోర భూకంపం సంభవించినప్పుడు, అమెరికాలో నివసిస్తున్న మను అనే ఒక వృద్ధుడు తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. “నేను నా కుటుంబానికి సహాయం చేయడానికే కాదుగానీ బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి తిరిగి వెళ్ళాలి” అనుకున్నాడు. మను తాను సందర్శించిన ప్రాంతాలు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నట్లు చూశాడు. అయినప్పటికీ, ఆయనిలా పేర్కొన్నాడు: “ప్రజలు చూపించే ధైర్యం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.” ఒక పత్రికా విలేఖరి ఇలా వ్రాశాడు: “నా చుట్టుప్రక్కల ఉన్నవారందరూ తాము ఇవ్వగలిగిందంతా అంటే ఒక రోజు వేతనమే కావచ్చు, ఒక వారం వేతనమే కావచ్చు, ఒక నెల వేతనమే కావచ్చు, తాము దాచుకున్న దానిలో కొంతభాగమే కావచ్చు వారిచ్చారు, సహాయార్థం తాము ఇవ్వగలిగినదంతా ఇచ్చేశారు.”
శిథిలాలను తొలగించి, గాయపడిన వారికి చికిత్స చేయడం సులభమే; కానీ, కేవలం కొద్ది క్షణాల బీభత్సంతో తలక్రిందులైపోయిన జీవితాలను యథాస్థితికి తీసుకురావడం మాత్రం అంత సులభమేమీ కాదు. ఎల్ సాల్వడార్‌లో సంభవించిన భూకంపంలో తన ఇంటిని పోగొట్టుకున్న డెలోరస్
అనే స్త్రీనే తీసుకోండి. “ఇది యుద్ధం కన్నా ఘోరం. అప్పుడైతే మాకు కనీసం తలదాచుకోవడానికి కాస్తంత ఆశ్రయమైనా ఉండేది” అంటోందామె.మా ప్రారంభ ఆర్టికల్‌లో ప్రస్తావించినట్లు, కొన్నిసార్లు వస్తుపరమైన సహాయమే గాక మానసిక మద్దతు కూడా ఎంతో అవసరమవుతుంది. ఉదాహరణకు, 1999లో పశ్చిమ కొలంబియాలోని అర్మేనియా నగరాన్ని భూకంపం ఛిన్నాభిన్నం చేసినప్పుడు, వెయ్యి కంటే ఎక్కువమంది తమ ప్రాణాలను కోల్పోయారు, అనేకానేకులు దిగ్భ్రమకు, నిస్పృహకు లోనయ్యారు. “మీరెక్కడికెళ్ళినా ప్రజలు సహాయం అర్థిస్తూనే ఉంటారు. నేను హోటలుకెళ్ళినా, హలో అని పలకరించినా చాలామంది తమ నిద్రలేమి గురించి, తమ వ్యధ గురించే మాట్లాడతారు” అని మానసిక వైద్యుడైన రోబెర్టో ఎస్టఫాన్ అంటున్నాడు. ఆయన సొంత ఇల్లు కూడా ఆ దుర్ఘటనలో నాశనమైపోయింది.
డా. ఎస్టఫాన్‌కు బాగా తెలిసినట్లుగానే, భూకంపం అనంతరం మానసిక ఒత్తిడి వినాశకరంగా ఉండగలదు. ఉద్యోగస్థులు కొందరు తాము త్వరలోనే మరణిస్తామని నమ్ముతున్నారు, కాబట్టి పనికి వెళ్లడానికి ఉత్సుకత చూపించరని శరణార్థ శిబిరాన్ని నిర్మించడంలో సహాయపడేందుకు స్వచ్ఛందంగా ముందుకువచ్చిన ఒక స్త్రీ అన్నది.
నిరాశ మధ్య నిరీక్షణను ఉజ్వలింపజేయడం
అలాంటి సంక్షోభ సమయాల్లో, బ్రతికి బయటపడిన వారికి యెహోవాసాక్షులు భౌతికంగానే కాదు గానీ ఆధ్యాత్మికంగా,
భావోద్రేకపరంగా కూడా సహాయం చేయడానికి కృషి చేస్తారు. ఉదాహరణకు, ముందు పేర్కొన్న కొలంబియాలోని భూకంపం విషయంలో, అది సంభవించిన వెంటనే అక్కడున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయము ఒక స్థానిక అత్యవసర కమిటీని సంస్థీకరించింది. దేశ నలుమూలల నుండి, వేలసంఖ్యలో సాక్షులైన స్వచ్ఛంద సేవకులు ఆహారాన్నీ, డబ్బునూ విరాళంగా పంపారు. త్వరలోనే, దాదాపు 70 టన్నుల ఆహారం, భూకంపం మూలంగా ప్రభావితమైన ప్రాంతానికి చేరింది.ఆధ్యాత్మిక మద్దతు తరచూ ఎంతో ఆవశ్యకం. కొలంబియాలో భూకంపం సంభవించిన తర్వాత ఒక రోజు ఉదయం, అతలాకుతలమైన అర్మేన్యా నగరంలోని ఒక వీధిలో ఎంతో కృంగుదలతో ఉన్న ఒక స్త్రీ నడిచివెళ్ళడాన్ని ఒక యెహోవాసాక్షి గమనించింది. ఆమె ఆ స్త్రీని సమీపించి మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? * అనే కరపత్రాన్ని ఇచ్చింది.
ఆ స్త్రీ ఆ కరపత్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చదివింది. ఆ తర్వాత ఒకసారి యెహోవాసాక్షులు తన ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తనకు ఏమి జరిగిందో వారికి చెప్పకుండా ఉండలేకపోయింది. భూకంపం ఆ నగరంలో ఆమెకుండిన—ఆమెకు అధిక రాబడి కలుగడానికి కారణమైన—అనేక సొంత ఇళ్ళను నాశనం చేసింది. ఇప్పుడామె బీదరికంలో ఉంది. అంతేకాదు, భూకంపం సంభవించినప్పుడు ఆమె నివసిస్తున్న ఇల్లు కూలడంతో ఆమె 25 ఏళ్ళ కుమారుడు మరణించాడు. ముందు తనకు మతం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదనీ, కాని ఇప్పుడు తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయనీ ఆ స్త్రీ సాక్షికి చెప్పింది. ఆ కరపత్రం ఆమెకు నిజమైన నిరీక్షణను ఇచ్చింది. త్వరలోనే గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది.
భూకంపాలతో సహా ప్రకృతి వైపరీత్యాలు మానవజాతికి ఇక ఎంత మాత్రం ముప్పు తీసుకురాని సమయం వస్తుందని యెహోవాసాక్షులు దృఢనిశ్చయత కలిగివున్నారు. దానికి కారణమేమిటో తర్వాతి ఆర్టికల్ వివరిస్తుంది. (g02 3/22)
[అధస్సూచి]
^ యెహోవాసాక్షులు ప్రచురించినది.
[6వ పేజీలోని బాక్సు]
సిద్ధంగా ఉండండి!
▪ వాటర్ హీటర్లు సీలలతో బిగించబడి ఉండేలా చూడండి, బరువైన వస్తువులు నేలమీదగాని క్రింది అరలలోగాని ఉండేలా చూసుకోండి.
▪ విద్యుత్ సరఫరాను, గ్యాస్‌ను, నీళ్ళను ఎలా ఆపాలో కుటుంబ సభ్యులందరికీ నేర్పించండి.
▪ మీ ఇంట్లో అగ్నిమాపక సాధనాన్ని, ప్రథమ చికిత్సకు అవసరమైన వాటిని ఉంచుకోండి.
▪ ఎక్కడికైనా మీతోపాటు తీసుకువెళ్ళగల రేడియోను, క్రొత్త బ్యాటరీలతో సహా అందుబాటులో ఉంచుకోండి.
▪ కుటుంబ అభ్యాసాలను నిర్వహించండి, వీటి అవసరతను నొక్కి చెప్పండి: (1) ప్రశాంతంగా ఉండడం (2) స్టౌలు, హీటర్లు ఆపు చేయడం (3) గుమ్మంలో నిలబడడం లేదా టేబుల్ క్రిందకుగానీ బల్ల క్రిందకు గానీ వెళ్ళడం (4) కిటికీలకు, అద్దాలకు, చిమ్నీలకు దూరంగా ఉండడం.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఇశ్రాయేలులో భూకంపాలు
ఇశ్రాయేలుకు, “భూమి మీద సంభవించిన భూకంపాల విషయంలో అత్యంత సుదీర్ఘమైన, ఎడతెగని చారిత్రక రికార్డు ఉంది” అని ప్రొఫెసర్ ఆమోస్ నూర్ వ్రాస్తున్నాడు. దానికి కారణమేమిటంటే, మధ్యధరా పలకకు అరేబియన్ పలకకు మధ్యనున్న భూమి పొరల వరుసలో కలిగిన క్రమభంగం, అదే గ్రేట్ రిఫ్ట్ లోయలో ఒక భాగం, అది సరిగ్గా ఇశ్రాయేలు మధ్యగా ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తుంది.
ఆసక్తికరంగా, భూకంపం వల్ల కలిగే వినాశనాన్ని తగ్గించడానికి ప్రాచీన ఇంజనీర్లు ఒక ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతిని ఉపయోగించారని కొంతమంది పురాతత్వశాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. ఇది, సొలొమోను నిర్మాణ కార్యక్రమాన్ని గురించిన బైబిలు వర్ణనకు పొందికగా ఉంది: “గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.” (ఇటాలిక్కులు మావి.) (1 రాజులు 6:36; 7:12) మెగిద్దో వద్దవున్న ఒక సింహద్వారంతో సహా వివిధ స్థలాల్లో కనిపించే, రాతి నిర్మాణంలోకి దూలములను జొప్పించడమనే ఈ సాంకేతిక పద్ధతి, సొలొమోను కాలం నుండి లేదా అంతకన్నా ముందు నుండి ఉందని తలంచబడుతోంది. ఈ దూలములు “భూకంపం వల్ల కలిగే హాని నుండి నిర్మాణాన్ని కాపాడడానికి జొప్పించబడి” ఉంటాయని డేవిడ్ ఎమ్. రోల్ అనే పండితుడు విశ్వసిస్తున్నాడు.
[చిత్రం]
ఇశ్రాయేలులోని బేత్‌షేయాన్‌లో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన శిథిలాలు
[8వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
రెండు నిమిషాలపాటు భయవిహ్వలులమయ్యాము—బ్రతికి బయటపడిన ఒక వ్యక్తి కథనం
భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ఉంటున్న మా కుటుంబం, మా చెల్లి—మా చిన్నాన్న కూతురు—పెళ్ళి ఏర్పాట్లలో ఉంది. నేను 2001, జనవరి 26న అలారమ్ శబ్దానికి కాదుగానీ విపరీతమైన కదలికలకు మేల్కొన్నాను. ఇనుప అల్మారాలు ముందుకు వెనక్కు ఊగిసలాడుతున్న శబ్దం వినిపించింది. ఇక దానితో, ఏదో అనర్థం జరుగుతోందని నాకు అర్థమైపోయింది. “ఇంట్లో నుండి బయటికి రండి!” అని మా చిన్నాన్న అరుస్తున్నాడు. మేము బయటికి వచ్చేసరికి, ఇల్లు ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు కదులుతుండడాన్ని మేము చూడగలిగాము. అదంతా అంతం లేకుండా కొనసాగుతున్నట్లు అనిపించింది. కానీ వాస్తవానికి, ప్రకంపనలు వచ్చింది కేవలం రెండు నిమిషాలే.
అంతా ఎంత త్వరత్వరగా జరిగిపోయిందంటే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మేము, మా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నామని నిశ్చయపరచుకున్నాము. ఫోన్ కనెక్షన్‌లు ఎలక్ట్రిక్ కనెక్షన్‌లు పోయాయి కాబట్టి, చుట్టుప్రక్కల పట్టణాల్లో ఉన్న మా బంధువుల పరిస్థితి ఎలా ఉందో వెంటనే తెలుసుకోలేకపోయాము. ఒక గంట సందిగ్ధావస్థ తర్వాత, వారు క్షేమంగా ఉన్నారని మాకు తెలిసింది. అయితే అందరూ అలా తప్పించుకోలేకపోయారు. ఉదాహరణకు, అహ్మదాబాద్‌లో దాదాపు వందకన్నా ఎక్కువ భవనాలు కూలిపోయాయి, 500 కన్నా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు.
అనేక వారాలపాటు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులతోనే ఉన్నారు. ముందే తెలియజేయబడినట్లుగా, ప్రతి రాత్రి మరో భూకంపం వస్తుందేమోనని భయపడుతూనే ప్రజలు నిద్రలోకి జారుకునేవారు. పునరావాసం చాలా నెమ్మదిగా సాగింది, అనేకులు నిరాశ్రయులయ్యారు. దీనికంతటికీ కారణం కేవలం రెండు నిమిషాలపాటు వచ్చిన భూకంపమే, కానీ అది మా జ్ఞాపకాల్లో నుండి మాత్రం ఎన్నడూ చెరిగిపోదు.—సమీర్ సరయ్యా చెప్పినది.
[6, 7వ పేజీలోని చిత్రం]
భారతదేశంలో 2001 జనవరిలో జరిగిన భూకంపం నుండి బ్రతికి బయటపడిన వ్యక్తి, చనిపోయి దహనసంస్కారం చేయబడుతున్న తన తల్లి ఫోటోను చూపిస్తున్నాడు
[చిత్రసౌజన్యం]
© Randolph Langenbach/UNESCO (www.conservationtech.com)