ప్రేమ ఎందుకు అణగారిపోతుంది?
ప్రేమ ఎందుకు అణగారిపోతుంది?
“ప్రేమలో పడడమే ప్రేమలో నిలిచివుండడం కన్నా సులభంగా ఉన్నట్లు కనబడుతుంది.”—డా. కరేన్ కైజర్.
ప్రేమరహిత వివాహాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం బహుశా అంత ఆశ్చర్యాన్ని కలిగించకూడదేమో. వివాహం అనేది ఒక సంక్లిష్టభరితమైన మానవ సంబంధం, చాలామంది అందులోనికి ఎలాంటి సిద్ధపాటు లేకుండానే ప్రవేశిస్తుంటారు. “మనకు డ్రైవర్ లైసెన్స్ కావాలంటే ఆ పనిలో కాస్త నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది, కానీ, వివాహ లైసెన్సులు మాత్రం ఒక సంతకం చేస్తే చాలు వచ్చేస్తాయి” అని డా. డీన్ ఎస్. ఈడెల్ చెబుతున్నాడు.
అందుకని, చాలా వివాహబంధాలు వర్థిల్లుతూ నిజంగానే ఆనందంగా ఉంటున్నప్పటికీ అనేక బంధాలు మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురౌతున్నాయి. బహుశా భార్యాభర్తల్లో ఒకరు లేక ఇద్దరూ ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని వివాహబంధంలోకి ప్రవేశించివుంటారు, కానీ దీర్ఘకాలిక ఈ బంధంలో కొనసాగేందుకు అవసరమయ్యే నైపుణ్యాలు మాత్రం వారిలో కొరవడివుంటాయి. “మొదట ఇద్దరూ సన్నిహితమైనప్పుడు, ఒకరంటే మరొకరికి విపరీతమైన విలువ ఉంటుంది” అని డా. హారీ రైస్ వివరిస్తున్నాడు. “ఈ భూప్రపంచమంతట్లో సరీగ్గా తనకున్నలాంటి దృక్కోణాలు గల వ్యక్తి తన భాగస్వామి మాత్రమేనని వారు భావిస్తుంటారు. ఆ భావం కొన్నిసార్లు అణగారిపోతుంది, అలా జరిగినప్పుడు అది వివాహానికి గొప్ప విపత్తును తీసుకువస్తుంది.”
ఆనందకరమైన విషయం ఏమిటంటే చాలా వివాహాలు ఆ స్థితి వరకు రావు. కానీ కొందరి విషయంలో ప్రేమ అణగారిపోవడానికి దారితీసిన కొన్ని కారణాలేమిటో మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.
భ్రమలు తొలగిపోవడం —“నేనాశించింది ఇది కానేకాదు”
“నేను జిమ్‌ను పెళ్ళి చేసుకున్నప్పుడు మా ప్రాంతంలో మేమిద్దరమూ అతిలోక సుందరి, అందాల రాకుమారుడు పాత్రల్ని పోషిస్తామని నేననుకున్నాను. ఇద్దరమూ ప్రేమానురాగాలు చూపించుకుంటూ ఒకరిపట్ల ఒకరం అవధానాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటామని ఆశించాను” అంటుంది రోజ్. కానీ కొంతకాలం తర్వాత ఆ “రాకుమారుడు” రోజ్‌కు అంత అందమైనవాడిగా కన్పించలేదు. “నేనాయన విషయంలో చివరికి ఘోరమైన రీతిలో భంగపాటును ఎదుర్కొన్నాను” అని ఆమె చెబుతుంది.
అనేక సినిమాలు, పుస్తకాలు, బాగా హిట్టైన పాటలు ప్రేమను గూర్చి చాలా అవాస్తవికమైన చిత్రణను అందిస్తాయి. ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహానికి ముందు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు తమ కలలు నిజమౌతున్నాయన్న భావనలతో గాల్లో తేలిపోతూ ఉంటారు; కానీ వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత తాము నిజంగానే కలల్లోనే విహరిస్తూ వచ్చామని వారికి నిర్ధారణ అయిపోతుంది! పుస్తకాల్లోని ప్రేమ కథల మాదిరిగా తమ వివాహంలో కాకపోయేసరికి ఇక తమ వివాహం విఫలం అయినట్లేనని వారికి అన్పిస్తుంది.
నిజమే, వివాహంలో కొన్ని ఆశలు పెట్టుకోవడం పూర్తిగా సరియైనదే. ఉదాహరణకు తన భాగస్వామి నుండి ప్రేమను, అవధానాన్ని, మద్దతును ఆశించడం యుక్తమే. అయితే ఈ కోరికలు కూడా తీరకుండాపోవచ్చు. “నాకసలు వివాహమైనట్లే అన్పించడం లేదు, నేను ఒంటరిగా ఉన్నట్లు నిర్లక్ష్యానికి గురైనట్లు అనిపిస్తుంది” అని ఇండియాలో కొత్తగా పెళ్ళైన మీనా అనే ఒక యువతి అంటుంది.
పొసగకపోవడం —“మా మధ్య పోలికలే లేవు”
“నేనూ నా భర్తా ప్రతి విషయంలోనూ భిన్న ధృవాల్లా ఉంటాము” అని ఒక స్త్రీ అంటుంది. “నేనాయన్ని చేసుకున్నందుకు పశ్చాత్తాపపడని రోజంటూ లేదు. మా ఇద్దరికీ జోడు సరిగా కుదరలేదంతే.”
వివాహానికి ముందు కలిసి సమయం గడుపుతున్నప్పుడు తామిద్దరి మధ్య ఎన్నో పోలికలు ఉన్నట్లు అన్పించినా, తాము నిజానికి అలా లేమని కనుక్కోవడానికి దంపతులకు సాధారణంగా ఎక్కువ కాలం పట్టదు. “తాము అవివాహితులుగా ఉన్నంత కాలమూ తమలో తామే విజయవంతంగా దాచిపెట్టుకున్న లక్షణాలు సాధారణంగా వివాహమైన తర్వాత బయటపడతాయి” అని డా. నీనా ఎస్. ఫీల్డ్స్ వ్రాస్తుంది.
తత్ఫలితంగా పెళ్ళైన తర్వాత కొందరు దంపతులు తాము ఇక ఎంతమాత్రం ఒకరికొకరు పొసగమని నిర్ధారణ చేసేసుకుంటారు. “అభిరుచుల్లోను, వ్యక్తిత్వాల్లోను కొన్ని పోలికలు ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు విధానాల్లోను, అలవాట్లలోను, వైఖరుల్లోను గొప్ప తేడాలున్నా వివాహంలోకి దూకుతారు” అని డా. ఏరన్ టి. బెక్ అంటున్నాడు. చాలామంది దంపతులకు ఈ తేడాల్ని పరిష్కరించుకోవడం ఎలాగో తెలీదు.
సంఘర్షణ—“మేమెప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటాము”
“మేమెంతగా కీచులాడుకునే వాళ్ళమో గుర్తు చేసుకుని ఆశ్చర్యపోయాము, చివరికి గట్టిగా అరుచుకునే వాళ్ళం కూడా. అంతకన్నా ఘోరమేమిటంటే ఉక్రోషంతో ఉడిగిపోతూ కొన్ని రోజులపాటు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోయి ఒకే ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాళ్ళము” అని తన వివాహమైన తొలినాళ్ళను గుర్తుచేసుకుంటూ సిండీ అంటుంది.
వివాహంలో అభిప్రాయ భేదాలు అనివార్యం. కానీ వాటితో ఎలా వ్యవహరించడం జరుగుతుంది? “ఆరోగ్యకరమైన వివాహంలో, ఫిర్యాదును తెల్పడానికి అటు భార్య ఇటు భర్త ఇద్దరూ సుముఖంగా ఉంటారు. కానీ చాలా తరచుగా ఫిర్యాదులు ఆవేశంలో ఉన్నప్పుడు క్షేమాభివృద్ధికరంగా కాక కూలద్రోసే విధంగా వ్యక్తం చేయబడతాయి, భాగస్వామి వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నట్లుగా ఉంటాయి” అని డా. డేనియల్ గోల్మన్ వ్రాస్తున్నాడు.
ఇలా జరిగినప్పుడు, సంభాషణ అనేది తమతమ అభిప్రాయాల్ని మంకుపట్టుతో సమర్థించుకునే రణరంగమౌతుంది, మాటలు సంభాషణా ఉపకరణాలుగా కాక తూటాలుగా మారతాయి. నిపుణుల బృందం ఒకటి ఇలా చెబుతుంది: “అదుపు తప్పుతున్న వాగ్వివాదాల్లో అతి వినాశనకరమైన విషయం ఏమిటంటే, తమ వైవాహిక బంధంలో అత్యంత కీలకమైన అంశాలకే ముప్పు తెచ్చే మాటలు నోటినుండి అప్పుడే బయటికి వస్తాయి.”
ఉదాసీనత—“మేం చేతులెత్తేశాం”
“మా వైవాహిక బంధం కొనసాగేందుకు ప్రయత్నాలన్నీ చేసి చివరకు నేను చేతులెత్తేశాను” అని ఐదు సంవత్సరాల వివాహానంతరం ఒక స్త్రీ ఒప్పుకుంటుంది. “ఇకపై అది కొనసాగలేదని నాకు తెలుసు. నా చింతల్లా మా పిల్లల గురించే.”
ప్రేమకు నిజమైన వ్యతిరేక పదం ద్వేషం కాదు గానీ ఉదాసీనత అని చెబుతారు. నిజంగానే, వివాహంలో ఉదాసీనత అనేది శత్రుభావాలు కలిగివుండడమంత వినాశనకరంగా ఉండగలదు.
విచారకరమైన విషయం ఏమిటంటే కొందరు దంపతులు ప్రేమరహిత వివాహానికి ఎంతగా అలవాటు పడిపోతారంటే ఏదైనా మార్పు వస్తుందన్న ఆశల్ని పూర్తిగా వదిలేసుకుంటారు. ఉదాహరణకు, ఒక భర్త 23 సంవత్సరాల తన వైవాహిక జీవితాన్ని “ఏమాత్రం ఇష్టంలేని ఉద్యోగంలో ఉండడం”తో పోల్చాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “అలాంటి పరిస్థితిలో ఎవరైనా తనకు సాధ్యమైనది మాత్రమే చేస్తారు.” అదే విధంగా వెండీ అనే పేరుగల ఒక భార్య ఏడు సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసి ప్రయత్నించి చివరికిక చేతులెత్తేసింది. “నేనెన్నోసార్లు ప్రయత్నించాను, ఆయనెప్పుడు చూసినా నన్ను నీరుగార్చేసేవాడు” అంటుందామె. “చివరికి నేను క్రుంగుదలకు లోనయ్యాను. నేను మళ్ళీ అలాంటిది అనుభవించలేను. నాలో ఏమాత్రం ఆశలు రేకెత్తినా అవి అడియాసలే అవుతాయని నాకు తెలుసు. దానికి బదులు ఏమీ ఆశించకుండానే ఉండడం శ్రేయస్కరం—ఇలాగైతే నాకు ఆనందం లభించకపోవచ్చు, కానీ కనీసం క్రుంగుదలకు లోనుకాకుండా ఉంటాను కదా.”
భ్రమలు తొలగిపోవడం, పొసగకపోవడం, సంఘర్షణ, ఉదాసీనత అనేవి ప్రేమరహిత వివాహానికి నడిపించే కారణాల్లో కేవలం కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయన్న విషయం స్పష్టం—5వ పేజీలోని బాక్సులో మరిన్నింటి గురించి ఉంది. కారణాలేవైనా, ప్రేమరహిత వివాహంలో చిక్కుకుపోయినట్లు కన్పిస్తున్న భార్యాభర్తలు భవిష్యత్తు గురించి ఏమైనా ఆశలు పెట్టుకోవడానికి అవకాశముందా?
(g01 1/8)
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
ప్రేమరహిత వివాహాలు—మరితర కారకాలు
•డబ్బు: “సహకారాన్ని అందించుకోవడం, జీవిత ప్రాథమికావసరాల నిమిత్తం వనరుల్ని సమీకరించుకోవడం, తమ శ్రమలకు తగ్గ ఫలితాల్ని అనుభవించడం వంటివాటిలో బడ్జెట్ వేసుకోవడం అనేది తమను ఐక్యపరుస్తుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక జంటను ఒక బంధంలో ఐక్యపర్చగల అంశం వారిని విడదీయడానికి కూడా కారణమౌతుంది.”—డా. ఏరన్ టి. బెక్.
•తల్లిదండ్రులు కావడం: “మొదటి బిడ్డ పుట్టిన తరువాత 67 శాతం దంపతుల్లో వైవాహిక సంతృప్తి బాగా తగ్గినట్లు, సంఘర్షణలు ఎనిమిది రెట్లు పెరిగినట్లు మేము కనుగొన్నాము. దీనికి పాక్షికంగా కారణం ఏమిటంటే తల్లిదండ్రులు ఎక్కువగా అలసిపోవడం, అలాగే భార్యాభర్తలు కలిసి గడిపే సమయం తక్కువ కావడం.”—డా. జాన్ గాట్మన్.
•మోసం: “నమ్మకద్రోహంలో సాధారణంగా మోసం ఇమిడివుంటుంది, మోసం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నమ్మకాన్ని పోగొట్టుకోవడమే. విజయవంతమైన దీర్ఘకాలిక వివాహాల్లో నమ్మకం అనేది కీలకమైన అంశంగా గుర్తించబడింది కాబట్టి, మోసం అనేది వైవాహిక సంబంధంలో తుపానును సృష్టించగలదనడంలో ఏమైనా సందేహం ఉందా?”—డా. నీనా ఎస్. ఫీల్డ్స్.
•సెక్స్: “దంపతులు విడాకుల కోసం అర్జీలు పెట్టుకునే సరికే, అప్పటికి కొన్ని సంవత్సరాలపాటుగా వారి లైంగిక కోరికలు తీర్చబడకుండా ఉంటున్నాయన్నది దిగ్భ్రాంతికరమైన రీతిలో సర్వవ్యాప్తంగా ఉంది. కొన్ని సందర్భాల్లోనైతే లైంగిక సంబంధం అసలెన్నడూ స్థాపించబడలేదు, మరి కొన్నింట్లో లైంగిక సంబంధం అనేది యాంత్రికంగా జరిగిపోతుంది, కేవలం తన భాగస్వామి కోర్కెలను తీర్చే వ్యక్తీకరణగా మాత్రమే ఉంటుంది.”—జూడిత్ ఎస్. వాల్లర్స్టైన్, క్లినికల్ సైకాలజిస్ట్.
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
పిల్లలు ఎలా ప్రభావితులౌతారు?
మీ వివాహబంధం ఎంత పటిష్టంగా ఉందన్నది మీ పిల్లలపై ప్రభావం చూపగలదా? వివాహితుల్ని దాదాపు 20 సంవత్సరాలపాటు పరిశోధించిన డా. జాన్ గాట్మన్ ప్రకారం దానికి జవాబేమిటంటే, తప్పక ప్రభావం చూపిస్తుంది. “పదేండ్లపాటు చేసిన రెండు అధ్యయనాల్లో అసంతోషంతో ఉన్న దంపతుల పిల్లలు ఆటలాడుకుంటున్నప్పుడు వారి గుండె కొట్టుకునే రేటు ఎక్కువగా ఉన్నదని మేము కనుగొన్నాము, వారు తమకు తాము సేదదీర్పును కలిగించుకోలేక పోతున్నారు. కొంతకాలానికి పిల్లల ఐక్యూతో సంబంధం లేకుండా వైవాహిక సంఘర్షణలు, వారు స్కూల్లో సరైన సామర్థ్యాల్ని ప్రదర్శించలేకపోవడానికి నడిపిస్తాయి.” దీనికి భిన్నంగా, సామరస్యంతో జీవిస్తున్న దంపతుల పిల్లలు “స్కూల్లో చక్కని సామర్థ్యాల్ని ప్రదర్శిస్తున్నారు, సామాజికంగానూ బాగున్నారు, ఎందుకంటే ఇతరులకు ఎలా గౌరవం ఇవ్వాలో, భావోద్రేకపరమైన ఒత్తిళ్ళలో ఎలా నిలద్రొక్కుకోవాలో వారి తల్లిదండ్రులు వారికి చూపించారు” అని డా. గాట్మన్ అంటున్నాడు.