కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నర్సులు నిర్వహించే కీలకమైన పాత్ర

నర్సులు నిర్వహించే కీలకమైన పాత్ర

నర్సులు నిర్వహించే కీలకమైన పాత్ర

“నర్సు అంటే పెంపొందించే, ప్రోత్సహించే, సంరక్షించే వ్యక్తి​—రోగుల గురించి, గాయపడిన వారి గురించి, వృద్ధుల గురించి శ్రద్ధవహించడానికి సిద్ధపర్చబడిన వ్యక్తి.”​—నర్సింగ్‌ ఇన్‌ టుడేస్‌ వరల్డ్‌​—ఛాలెంజస్‌, ఇష్యూస్‌, అండ్‌ ట్రెండ్స్‌.

నిస్వార్థత అవసరమే అయినప్పటికీ, సమర్థవంతమైన నర్సుగా ఉండడానికి అది మాత్రమే సరిపోదు. మంచి నర్సులకు విస్తృతమైన తర్ఫీదు, ఎంతో అనుభవం కూడా అవసరమే. ఒక ప్రాముఖ్యమైన అవసరత ఏమిటంటే, ఒకటి నుండి నాలుగు లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాలపాటు నర్సింగ్‌ సంబంధిత విద్యను ఆర్జించి, ఆచరణాత్మకమైన శిక్షణను పొందడమే. అయితే ఒక మంచి నర్సుగా తయారవ్వాలంటే ఏ లక్షణాలు అవసరం? తేజరిల్లు! ఇంటర్వ్యూ చేసిన కొంతమంది అనుభవజ్ఞులైన నర్సులు ఇచ్చిన సమాధానాలు ఇక్కడ పొందుపర్చబడ్డాయి.

“వైద్యుడు రోగిని బాగుచేస్తే, నర్సు అతని పట్ల శ్రద్ధ తీసుకుంటుంది. ఉదాహరణకు, దీర్ఘకాల రోగానికి గురయ్యారనో, త్వరలోనే మరణించబోతున్నారనో తెలియజేయబడినప్పుడు శారీరకంగానూ మానసికంగానూ గాయపర్చబడిన రోగులను ప్రోత్సహించడానికి ఆ శ్రద్ధ తరచూ అవసరమౌతుంది. మీరు రోగికి తల్లిలా ఉండాలి.”​—కార్మెన్‌ గిల్మార్టిన్‌, స్పెయిన్‌.

“రోగి అనుభవించే వేదనా బాధలను గ్రహించగల్గి, అతనికి సహాయం చేయాలని కోరుకోవడం ఆవశ్యకం. దయా దీర్ఘశాంతాలు కూడా అవసరం. నర్సింగ్‌ గురించీ, వైద్యం గురించీ నేర్చుకోవాలని మీరు ఎల్లప్పుడూ కోరుకోవాలి.”​—టాడాషీ హటనో, జపాన్‌.

“ఇటీవలి సంవత్సరాల్లో నర్సులకు వృత్తిపరమైన జ్ఞానం మరింత అవసరమైంది. కాబట్టి, అధ్యయనం చేయాలనే కోరికా, చేస్తున్న అధ్యయనాన్ని అర్థం చేసుకునే సామర్థ్యమూ ఎంతో ఆవశ్యకం. అంతేగాక, నర్సులు చాలా త్వరగా నిర్ణయాలను తీసుకుని, పరిస్థితిని బట్టి అవసరమైనప్పుడు సత్వర చర్యలు తీసుకోవలసి ఉంటుంది.”​—కేకో కావాన్‌, జపాన్‌.

“ఒక నర్సుగా, మీరు వాత్సల్యాన్ని చూపించాలి. సహనంతో ఉండి సహానుభూతిని కనబరచాలి.”​—అర్సెలీ గార్సియా పడిల్లా, మెక్సికో.

“మంచి నర్సు శ్రద్ధగలదిగానూ గమనించేదిగానూ, వృత్తిపరంగా ఎంతో నైపుణ్యంగలదిగానూ ఉండాలి. ఒక నర్సుకి స్వయంత్యాగపూరిత స్ఫూర్తి గనుక లేకపోతే, అంటే స్వార్థపూరిత గుణంగల, లేక వైద్య రంగంలోని ఉన్నత స్థాయివారు ఇచ్చే సలహాను స్వీకరించడానికి విముఖతను చూపించే వ్యక్తి అయితే, ఆ నర్సు రోగులకే కాదు తోటి ఉద్యోగులకు కూడా తగిన వ్యక్తిగా ఉండలేదు.”​—రోసేంజెలా సాన్‌టోస్‌, బ్రెజిల్‌.

“కొన్ని లక్షణాలు ఎంతో ఆవశ్యకం: పరిస్థితులకు అనుగుణంగా మారగల్గే గుణం, సహనం, ఓర్పు. తోటి ఉద్యోగులతోనూ, పై అధికారులతోనూ కలిసి మెలసి ఉండే సామర్థ్యంతో పాటు, విశాలమైన మనస్సు కూడా ఉండాలి. నైపుణ్యం గలవారిగా ఉండడానికిగానూ క్రొత్త సామర్థ్యాలను సత్వరంగా సమకూర్చుకోగలగాలి.”​—మార్క్‌ కోయెలర్‌, ఫ్రాన్స్‌.

“మీరు ప్రజలను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. నర్సింగ్‌ రంగంలో తప్పులకు తావివ్వకూడదు గనుక ఒత్తిడిని తట్టుకునే శక్తిని కల్గివుండాలి. కొన్నిసార్లు తక్కువమంది తోటి పనివారే ఉన్నప్పటికీ, పని నాణ్యతలో ఏవిధంగానూ రాజీపడకుండా అంతే పనిని చేసేలా మీరు పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోయే వారై ఉండాలి.”​—క్లాడియా రిజ్కర్‌-బేకర్‌, నెదర్లాండ్స్‌.

శ్రద్ధ తీసుకునే వ్యక్తిగా నర్సు

నర్సింగ్‌ ఇన్‌ టుడేస్‌ వరల్డ్‌ “వివిధ రకాలైన ఆరోగ్య సంబంధిత పరిస్థితుల్లో ఒక వ్యక్తి పట్ల శ్రద్ధ తీసుకోవడంతో, నర్సింగ్‌ సంబంధాన్ని కల్గివుంది. కాబట్టి, ఒక రోగి కోలుకోవడానికి వైద్యంతో సంబంధం ఉన్నట్లే, ఆ రోగిపట్ల శ్రద్ధ తీసుకోవడానికి నర్సింగ్‌తో సంబంధం ఉందని మనం భావిస్తాం” అని పేర్కొంటుంది.

కాబట్టి నర్సు అంటే శ్రద్ధ తీసుకునే వ్యక్తి. కాబట్టి, నర్సు శ్రద్ధ తీసుకోవాలన్నది స్పష్టమౌతుంది. కొంతకాలం క్రితం 1,200 మంది రిజిస్టర్డ్‌ నర్సులను, “నర్సుగా మీ పనిలో మీకు అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి?” అని అడగటం జరిగింది. వారిలో 98 శాతం మంది, నిజమైన శ్రద్ధను చూపడమేనని తెలియజేశారు.

కొన్నిసార్లు నర్సులు రోగుల దృష్టిలో తమకున్న విలువను తక్కువ అంచనా వేస్తారు. నర్సుగా 12 సంవత్సరాల అనుభవంగల, పైన పేర్కొన్న కార్మెన్‌ గిల్మార్టిన్‌ తేజరిల్లు!తో ఇలా చెప్పింది: “రోగంతో తీవ్రంగా బాధపడుతున్నవారి పట్ల శ్రద్ధ చూపించే విషయంలో నేను పరిమితంగా ఉన్నట్లు భావించానని ఒక సందర్భంలో ఒక స్నేహితురాలి ఎదుట ఒప్పుకున్నాను. నన్ను నేను కేవలం ఒక ‘బాండ్‌ ఎయిడ్‌లా’ దృష్టించుకున్నానని చెప్పాను. దానికి నా స్నేహితురాలు ‘మీరు ఎంతో విలువైన “బాండ్‌ ఎయిడ్‌,” ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు, కావాల్సింది దయాపూర్ణురాలైన నర్సే’నని సమాధానమిచ్చింది.’”

అలాంటి శ్రద్ధనివ్వడం, ప్రతి రోజు పది లేక అంతకన్నా ఎక్కువ గంటలపాటు పనిచేసే నర్సుపై విపరీతమైన ఒత్తిడిని తీసుకొస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు! శ్రద్ధ తీసుకోవడంలో స్వయం త్యాగపూరిత స్ఫూర్తిని చూపించే వీరిని, నర్సులుగా తయారయ్యేందుకు పురికొల్పినదేమిటి?

ఎందుకు నర్సై ఉండాలి?

ప్రపంచంలోని ఆయా ప్రాంతాలకు చెందిన నర్సులను తేజరిల్లు! ఇంటర్వ్యూ చేసి, వారినిలా ప్రశ్నించింది: “నర్సుగా తయారయ్యేందుకు మిమ్మల్ని పురికొల్పినదేమిటి?” వారిచ్చిన సమాధానాల్లో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

టెర్రీ వెథర్‌సన్‌కు 47 సంవత్సరాల నర్సింగ్‌ అనుభవం ఉంది. ఇప్పుడామె ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉన్న ఒక హాస్పిటల్‌లో యూరాలజీ విభాగంలో క్లినికల్‌ నర్సు స్పెషలిస్ట్‌గా పని చేస్తుంది. “నేను ఒక క్యాథలిక్‌గా పెరిగాను, క్యాథలిక్‌ బోర్డింగ్‌ స్కూల్లో చదువుకున్నాను. ఒక అమ్మాయిగా నేను, నన్‌నుగానీ నర్సునుగానీ కావాలని నిర్ణయించుకున్నాను. ఇతరులకు సేవచేయాలనే కోరిక నాకుండేది. మీరు దాన్ని అంతఃకరణ ప్రేరణ అనవచ్చు. మీరిప్పుడు చూస్తున్నట్టుగా చివరికి నర్సింగే నన్ను గెల్చుకుంది” అని ఆమె చెబుతోంది.

జపాన్‌లోని సైతామాకు చెందిన చీవ మాట్సునాగా ఎనిమిది సంవత్సరాలపాటు తన స్వంత క్లినిక్‌ను నడిపించింది. ఆమె ఇలా అంటుంది: “‘మీరు జీవితాంతం పనిచేసేందుకుగాను మిమ్మల్ని యోగ్యులను చేసే నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మంచిది’ అనే మా నాన్నగారి ఆలోచనా విధానాన్ని నేను అనుసరించాను. కాబట్టి నేను నర్సింగ్‌ను ఎన్నుకున్నాను.”

నర్సింగ్‌లో 38 సంవత్సరాల అనుభవం గల, జపాన్‌లోని టోక్యోకు చెందిన ఎట్స్‌కో కోటానీ అనే హెడ్‌ నర్సు ఇలా అన్నది: “నేను పాఠశాలలో చదువుకునేటప్పుడు మా నాన్నగారు స్పృహ తప్పిపోయారు, చాలా రక్తం పోయింది. ఆయనను హాస్పిటల్‌లో అలా చూసినప్పుడు, భవిష్యత్తులో రోగులకు సహాయం చేయగలిగేలా ఒక నర్సునవ్వాలని నేను నిర్ణయించుకున్నాను.”

మరితరులు తాము అనారోగ్యంతో బాధపడినప్పటి తమ అనుభవం నుండే నర్సింగ్‌ చేయాలని ప్రేరేపించబడ్డారు. మెక్సికోలోని ఒక నర్సు అయిన ఎనేడా బెయీరా ఇలా చెప్తుంది: “నాకు ఆరు సంవత్సరాలున్నప్పుడు, శ్వాసకోశవ్యాధి మూలంగా రెండు వారాలపాటు ఆసుపత్రిలో ఉన్నాను, నేను నర్సునవ్వాలని నిర్ణయించుకున్నది అప్పుడే.”

నర్సుగా సేవచేయడానికి ఎంతో స్వయంత్యాగ స్ఫూర్తి అవసరమని స్పష్టమౌతుంది. ఈ ఘనమైన వృత్తిలో ఇమిడివున్న సవాళ్లనూ, ప్రతిఫలాలనూ మనం నిశితంగా పరిశీలిద్దాం.

నర్సింగ్‌లోని ఆనందాలు

నర్సింగ్‌లో ఉన్న ఆనందాలేమిటి? ఆ ప్రశ్నకు సమాధానం, నర్సింగ్‌ కార్యకలాపాల్లో ఒక వ్యక్తి ఎన్నుకునే రంగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, విజయవంతంగా కాన్పు జరిగిన ప్రతిసారి ప్రతిఫలాన్ని పొందినట్లుగా మంత్రసానులు భావిస్తారు. “ఏ గర్భస్థ శిశు పెరుగుదలను మీరు పరీక్షించారో ఆ శిశువు ఆరోగ్యవంతంగా జన్మించేలా డెలివరిచేయడం అద్భుతమైన విషయము” అని నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మంత్రసాని చెప్తుంది. నెదర్లాండ్స్‌కే చెందిన యోలాండ్‌ గీలెన్‌-వన్‌ హూఫ్ట్‌ ఇలా అంటుంది: “ఒక జంటగానీ, ఒక హెల్త్‌ వర్కర్‌గానీ పొందగల అత్యంత అందమైన అనుభవాల్లో కాన్పు ఒకటి. అదొక అద్భుతం!”

ఫ్రాన్స్‌లోని డ్రూయెక్స్‌కు చెందిన రేషిట్‌ అసామ్‌ తన 40వ పడిలో ఉన్న స్టేట్‌ సర్టిఫైడ్‌ నర్సు అనెస్థెటిస్ట్‌. ఆయనకు నర్సింగ్‌ అంటే ఎందుకిష్టం? ఎందుకంటే, “ఒక ఆపరేషన్‌ విజయవంతమయ్యేందుకు దోహదపడడం వల్ల కలిగే సంతృప్తిని పొందేందుకు, ఎంతో అద్భుతమైన, నిరంతరం అభివృద్ధి సాధిస్తూనే ఉండే వృత్తిలో సభ్యుడనై ఉండేందుకు” అని ఆయన చెప్తున్నాడు. ఫ్రాన్సుకే చెందిన ఐసాక్‌ బాంగిలి ఇలా చెప్తున్నాడు: “రోగుల నుండీ, వారి కుటుంబాల నుండీ మేము అందుకునే కృతజ్ఞతాపూర్వక వ్యక్తీకరణలను బట్టి, మరి ప్రాముఖ్యంగా ఇక ఏ ఆశా లేదని మేమనుకున్న రోగి కోలుకునేలా మేము చేయగల్గినదంతా చేసిన అత్యవసర పరిస్థితుల్లో తెలియజేయబడిన కృతజ్ఞతాపూర్వక వ్యక్తీకరణలను బట్టి నేనెంతో కదిలించబడ్డాను.”

అలాంటి ఒక కృతజ్ఞతాపూర్వక వ్యక్తీకరణ మునుపు పేర్కొన్న టెర్రీ వెథర్‌సన్‌కు ఒకసారి పంపబడింది. ఒక విధవరాలు ఆమెకు ఇలా వ్రాసింది: “చార్లెస్‌ అనారోగ్యంతో ఉన్న కాలమంతటిలోనూ మీ ప్రశాంతమైన, అభయహస్తాన్ని అందించే మీ సమక్షంలో మేము పొందిన ఉపశమనాన్ని ఈ సందర్భంలో మరోసారి ప్రస్తావించకుండా ఉండలేను. మీరు చూపిన వాత్సల్యం ప్రకాశమానమైన వెలుగు, అది మాకు ఒక కోటలా ఉండగా మేము దాని నుండి బలాన్ని పొందాము.”

సవాళ్లను ఎదుర్కోవడం

నర్సింగ్‌లో ఆనందాలతోపాటు ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి. నర్సింగ్‌ తప్పులకు ఎంతమాత్రం తావివ్వదు! చికిత్స చేస్తున్నప్పుడైనా లేక రక్తం ఎక్కిస్తున్నప్పుడైనా లేక ఏదైనా నరాల్లోకి ఎక్కిస్తున్నప్పుడైనా లేక కేవలం రోగిని కదిల్చేటప్పుడైనా నర్సు చాలా జాగ్రత్త వహించాలి. ఆమె గానీ అతడు గానీ తప్పు చేయడం క్షమార్హం కాదు, ప్రాముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కోర్టులకు వెళ్లే దేశాల్లో ఇది మరీ నిజం. అయినప్పటికీ, నర్సు కొన్నిసార్లు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పడుతుంది. ఉదాహరణకు, ఒక వైద్యుడు రోగికి తప్పు మందును సూచించాడనో లేదా రోగికి అంతగా మంచివి కాని మందులకు ఆర్డర్స్‌ ఇచ్చాడనో నర్సు భావించిందనుకోండి. ఆ నర్సు ఏమి చేయగలదు? వైద్యుడ్ని ఎదిరించగలదా? అందుకు ధైర్యం, నేర్పు, యుక్తి అవసరం, దానిలో ఎంతో ముప్పు కూడా ఉంటుంది. దుఃఖకరంగా, కొంతమంది వైద్యులు తమ క్రింది ఉద్యోగులని తాము పరిగణించేవారి నుండి సలహాలు స్వీకరించడానికి సుముఖత చూపించరు.

ఈ విషయంలో కొంతమంది నర్సులు ఏమి పేర్కొన్నారు? అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన బార్‌బరా రైనెకా అనే స్త్రీ 34 సంవత్సరాల నుంచి రిజిస్టర్డ్‌ నర్సుగా పనిచేస్తోంది, ఆమె తేజరిల్లు!తో ఇలా చెప్పింది: “నర్సు ధైర్యవంతురాలై ఉండాలి. మొట్టమొదటిగా, ఆమె తాను ఏ చికిత్సలను లేక వైద్యాన్ని చేస్తుందో వాటికీ అలాగే వాటి వల్ల ఎటువంటి హాని వాటిల్లినా దానికీ ఆమె చట్టబద్ధంగా బాధ్యురాలు. తన పరిధిలోకి రానిదనీ లేక తనకు ఇవ్వబడిన ఆజ్ఞ సరైనదికాదనీ తాను భావించినప్పుడు ఆమె తన వైద్యుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నిరాకరించగలిగేలా ఉండాలి. నర్సింగ్‌ అన్నది ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ కాలంలోలాగో లేక చివరికి 50 ఏళ్ల క్రితం ఉన్నట్లుగానో ఇప్పుడు లేదు. వైద్యునికి ఎప్పుడు కాదని చెప్పాలి, చివరికి మధ్యరాత్రి అయినా సరే వైద్యుడు రోగిని చూడవలసిందేనని ఎప్పుడు పట్టుబట్టాలన్నది నర్సు ఇప్పుడు తెలుసుకుని ఉండవలసిన అవసరం ఉంది. మీది తప్పైతే, వైద్యుడు వేసే ఏ నిందలనైనా భరించడానికి సిద్ధంగా ఉండగల్గాలి.”

నర్సులు ఎదుర్కునే మరో సమస్య ఉద్యోగ స్థలంలో దౌర్జన్యం. నర్సింగ్‌ చేసేవారు “పనిస్థలంలో ఎక్కువగా దౌర్జన్యానికి గురయ్యే స్థానంలో ఉన్నట్టు గుర్తించబడుతున్నారు. వాస్తవానికి, పనిస్థలంలో నర్సులు జైలు కాపలాదారులకంటే లేక పోలీస్‌ ఆఫీసర్ల కంటే కూడా ఎక్కువగా దాడికి గురయ్యే స్థితిలో ఉన్నారు, దాడికి గురికాకుండా తాము సురక్షితంగా ఉన్నామని 72 శాతం మంది నర్సులు ఎంతమాత్రమూ భావించడం లేదు” అని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నివేదిక తెలియజేస్తోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కూడా అలాంటి పరిస్థితే నివేదించబడుతుంది, అక్కడ ఇటీవల జరిగిన ఒక సర్వేలో 97 శాతం మందికి గత సంవత్సరంలో శారీరకంగా దాడికి గురైన కనీసం ఒక నర్సు తెలుసు. ఈ దౌర్జన్యానికి కారణమేమిటి? ఈ సమస్య మత్తుమందులు తీసుకునే రోగుల మూలంగా గానీ త్రాగుబోతులైన రోగుల మూలంగా గానీ ఒత్తిడి నెదుర్కుంటున్న రోగుల మూలంగా గానీ వేదనననుభవిస్తున్న రోగుల మూలంగా గానీ తరచుగా తలెత్తుతుంది.

ఒత్తిడి మూలంగా కలిగే నిస్సత్తువను కూడా నర్సులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులు తక్కువమంది ఉండడం దానికి ఒక కారణం. మనస్సాక్షిగల ఒక నర్సు పని ఎక్కువగా ఉండడం మూలంగా, ఒక రోగికి తగినంత శ్రద్ధ చూపించలేకపోయినప్పుడు త్వరలోనే ఆమెలో ఒత్తిడి అధికమౌతుంది. విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువ సేపు పని చేయడం ద్వారా, సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించడం మరింత ఆవేదనకు దారి తీస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా హాస్పిటల్‌లలో సిబ్బంది కొరత ఉంది. “మన ఆసుపత్రులలో నర్సులు తక్కువమంది ఉన్నారు. ఆరోగ్య సదుపాయం అవసరమైన వారు నర్సుల ప్రాముఖ్యతను గ్రహిస్తారు” అని మాడ్రిడ్‌కు చెందిన మూన్డో సానిటోర్యోలోని ఒక నివేదిక చెప్తుంది. సిబ్బంది కొరతకు కారణం ఏమిటని చెప్పబడుతుంది? డబ్బును ఆదా చేయవలసిన అవసరం! మాడ్రిడ్‌ ఆసుపత్రుల్లో 13,000 మంది నర్సుల కొరత ఉందని అదే నివేదిక పేర్కొన్నది!

ఒత్తిడికి లోనవ్వడానికిగల మరో కారణం, సాధారణంగా షిఫ్టు డ్యూటీ వేళలు మరీ సుదీర్ఘమైనవిగా, జీతాలు మరీ తక్కువగా ఉండడమే. ద స్కాట్స్‌మాన్‌ ఇలా పేర్కొన్నది: “బ్రిటన్‌లో ఉన్న ప్రతి ఐదుమంది నర్సుల్లో ఒకరి కన్నా ఎక్కువమంది, నర్సింగ్‌ సహాయకుల్లో నాలుగింట మూడొంతులమంది, జీవనోపాధి కోసం మరో ఉద్యోగాన్ని కూడా చేసుకుంటున్నారని పబ్లిక్‌ సర్వీస్‌ యూనియన్‌ యునిసన్‌ చెప్తున్నది.” ప్రతి నలుగురు నర్సులలో ముగ్గురు తమకు సరైన జీతాలు అందడంలేదని భావిస్తున్నారు. ఫలితంగా, చాలామంది తమ వృత్తిని విడిచిపెట్టడం గురించి ఆలోచిస్తున్నారు.

నర్సులు ఎదుర్కొనే ఒత్తిడికి ఇతర కారకాలు కూడా దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సుల నుండి తేజరిల్లు! సంపాదించిన వ్యాఖ్యానాల ఆధారంగా నిర్ధారిస్తూ, రోగుల మరణం నర్సులపై వేదనకరమైన ప్రభావాన్ని చూపించగలదని చెప్పవచ్చు. ఈజిప్టు దేశానికి చెందిన మాగ్దా స్వాంగ్‌ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో పని చేస్తుంది. ఆమె పనిని కష్టతరం చేస్తున్నదేమిటని ఆమెను అడిగినప్పుడు, “నేను ఎవరి గురించైతే శ్రద్ధ తీసుకున్నానో, మరణకరమైన రోగంగల ఆ వ్యక్తులలో 30 మంది పది సంవత్సరాల కాలంలో నా కళ్లెదుటే చనిపోవడం. అది నిజంగా మిమ్మల్ని పీల్చేస్తుంది” అని ఆమె సమాధానమిచ్చింది. “మరణావస్థలో ఉన్న రోగులపట్ల శ్రద్ధ తీసుకోవడంలో తనను తాను అంకిత భావంతో వెచ్చించుకున్న వ్యక్తికి రోగి మరణం భావోద్వేగ, శారీరక హానిని కలిగించగలదని” ఒక మూలం చెప్తుందంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.

నర్సుల భవితవ్యం

సాంకేతికపరమైన పురోభివృద్ధీ దాని ప్రభావమూ నర్సింగ్‌ రంగంలో ఒత్తిళ్లను అధికం చేస్తుంది. సవాలేమిటంటే, సాంకేతికతను మానవత్వంతో సమన్వయపర్చడమన్నదే అంటే రోగులపట్ల మానవత్వంతో వ్యవహరించడమన్నదే. నర్సు వాత్సల్యపూరితమైన స్పర్శ, చూపించే దయల స్థానాన్ని ఏ వైద్య యంత్రమూ భర్తీ చేయలేదు.

ఒక పత్రిక ఇలా పేర్కొంటుంది: “నర్సింగ్‌ నిరంతరం నిలిచే వృత్తి. . . . మానవత్వం ఉన్నంత వరకూ శ్రద్ధ, దయ, అవగాహనల అవసరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.” నర్సింగ్‌ ఆ అవసరతలను తీరుస్తుంది. ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత ఆశాపూరిత దృక్కోణం కల్గివుండేందుకు గొప్ప అవకాశం ఉంది. “నాకు దేహములో బాగులేదని” ఎవరూ చెప్పని ఒక సమయం వస్తుందని బైబిలు చూపిస్తుంది. (యెషయా 33:24) దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకంలో డాక్టర్ల, నర్సుల, ఆసుపత్రుల అవసరం ఇక ఉండదు.​—యెషయా 65:17; 2 పేతురు 3:13.

“దేవుడు . . . వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి”పోవునని కూడా బైబిలు వాగ్దానం చేస్తుంది. (ప్రకటన 21:3, 4) అయితే ఈ మధ్యలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది నర్సులు చూపిస్తున్న శ్రద్ధను, వారు చేస్తున్న త్యాగాలను బట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి, వారు లేకుండా ఆసుపత్రులలో ఉండడం అహ్లాదకరంగా ఎంతమాత్రమూ ఉండదు, లేదా ఆసుపత్రులలో ఉండడం అసాధ్యమే కావచ్చు! కాబట్టి, “నర్సులు లేకుండా మనమేమి చేయగలం?” అనే ప్రశ్న ఎంత సముచితమైనదో కదా!

(g00 11/8)

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌​—ఆధునిక నర్సింగ్‌కు అగ్రగామి

సంపన్నులైన ఆంగ్లేయ తల్లిదండ్రులకు 1820లో, ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అల్లారు ముద్దుగా పెరిగింది. యౌవనస్థురాలైన ఫ్లోరెన్స్‌ ఎన్నో పెళ్లి సంబంధాలను కాదనుకొని ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, పేదల పట్ల శ్రద్ధ వహించే విషయంలోనూ అధ్యయనాలు చేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, జర్మనీలోని కేసర్‌స్వెర్త్‌లోని నర్సుల శిక్షణా పాఠశాలలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత, ఆమె పారిస్‌లో చదువుకుని, 33 సంవత్సరాల వయస్సులో లండన్‌లోని ఒక స్త్రీల హాస్పిటల్‌లో సూపరిన్‌టెండెంట్‌ అయ్యింది.

అయితే, క్రిమ్యా యుద్ధంలో గాయపడిన సైనికుల గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు అతిపెద్ద సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. అక్కడ ఆమె, ఆమెతో పాటు 38 మంది నర్సులు ఎలుకలతో నిండివున్న హాస్పిటల్‌ను శుభ్రపరచవలసి వచ్చింది. అది అసాధ్యమైన పని, ఎందుకంటే మొదట్లో అక్కడ సబ్బు లేదు, వాష్‌బేసిన్‌లుగానీ టవల్లుగానీ లేవు, తగినన్ని మంచాలు పరుపులుగానీ బ్యాండేజీలుగానీ లేవు. ఫ్లోరెన్స్‌, ఆమె బృందం ఆ సవాలును చేపట్టారు, యుద్ధం ముగిసే సమయానికల్లా నర్సింగ్‌లోనూ, హాస్పిటల్‌ నిర్వహణలోనూ ఆమె ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు తీసుకువచ్చింది. ఆమె 1860లో, లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌లో నర్సుల కోసం నైటింగేల్‌ ట్రైనింగ్‌ పాఠశాలను స్థాపించింది, అది ఏ మతసంబంధమైన పొత్తూలేని మొట్టమొదటి నర్సింగ్‌ పాఠశాల. ఆమె 1910లో మరణించడానికి ముందు ఎన్నో సంవత్సరాలపాటు మంచానికే పరిమితమై పోయింది. అయినప్పటికీ, ఆరోగ్య సంరక్షణా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆమె పుస్తకాలను, కరపత్రాలను వ్రాయడంలో కొనసాగింది.

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌కు లభించిన గొప్ప పేరును బట్టి కొందరు అభ్యంతరం చెప్తూ, నర్సింగ్‌ రంగానికి ఇతరులు అందించిన మద్దతును బట్టి వాళ్లు కొంతైనా ఘనతను పొందడానికి అర్హులని వాదిస్తారు. అంతేగాక ఆమెకున్న పేరుప్రతిష్టల గురించి కూడా తీవ్రమైన వాదోపవాదాలు ఉన్నాయి. ఎ హిస్టరీ ఆఫ్‌ నర్సింగ్‌ అనే పుస్తకం ప్రకారం, ఆమె “చంచల మనస్కురాలనీ, గర్విష్ఠి అనీ, ఏకపక్ష అభిప్రాయంగలదనీ, త్వరగా కోపం తెచ్చుకుంటుందనీ, ఇతరులను బాగా అదుపు చేస్తుందనీ” కొందరంటే, ఆమెకున్న “ప్రజ్ఞ, ఆకర్షణీయత, విశేషమైన శక్తి, ఆమె వ్యక్తిత్వంలోని భిన్నత్వాలను” బట్టి ఇతరులు ఎంతగానో ముగ్ధులౌతారు. ఆమె స్వభావం ఏదైనప్పటికీ, ఒకటి మాత్రం కచ్చితం: నర్సింగ్‌, ఆసుపత్రుల నిర్వహణ వంటి విషయాల్లో ఆమె కౌశలాలు అనేక దేశాలకు వ్యాపించాయి. నేడు మనకు తెలిసినట్లుగా, ఆమె నర్సింగ్‌ వృత్తికి అగ్రగామిగా పరిగణించబడుతుంది.

[చిత్రం]

నైటింగేల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ ఫర్‌ నర్సెస్‌ స్థాపించబడిన తర్వాత, సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌

[చిత్రసౌజన్యం]

Courtesy National Library of Medicine

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

నర్స్‌కు ఉండవలసిన అర్హతలు

నర్స్‌: “నర్సింగ్‌ యొక్క సాంకేతిక ఆధారంపై ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన వ్యక్తి, విద్య, క్లినికల్‌ సామర్థ్యం వంటి వాటికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలకు సరిపడే వ్యక్తి.”

రిజిస్టర్డ్‌ నర్సు: “స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ నర్సు ఎక్సామినర్స్‌ పరీక్ష తర్వాత ప్రాక్టీస్‌ చేయడానికి చట్టబద్ధంగా అధికారం పొందిన (రిజిస్టర్డయిన) పట్టభద్రురాలైన నర్సు. . . . రిజిస్టర్డ్‌ నర్సు అనే బిరుదును ఉపయోగించుకునేందుకు చట్టబద్ధంగా అధికారం పొందిన వ్యక్తి.”

క్లినికల్‌ నర్స్‌ స్పెషలిస్ట్‌: “నర్సింగ్‌లోని ఒక ప్రత్యేక రంగంలో ఎంతో జ్ఞానము, నైపుణ్యము, సామర్థ్యము ఉన్న ఒక రిజిస్టర్డ్‌ నర్సు.”

నర్స్‌-మిడ్‌వైఫ్‌: “నర్సుగా, మంత్రసానిగా విద్యనార్జించిన వ్యక్తి.”

ప్రాక్టికల్‌ నర్సు: “నర్సుగా శ్రద్ధ తీసుకోవడం విషయంలో ఆచరణాత్మకమైన అనుభవం ఉన్నప్పటికీ ఏ నర్సింగ్‌ పాఠశాల నుండీ పట్టా పుచ్చుకోని వ్యక్తి.”

లైసెన్స్‌డ్‌ ప్రాక్టికల్‌ నర్సు: “స్కూల్‌ ఆఫ్‌ ప్రాక్టికల్‌ నర్సింగ్‌ నుండి పట్టా పుచ్చుకున్న వ్యక్తి, . . . లైసెన్స్‌డ్‌ ప్రాక్టికల్‌ లేక ఒకేషనల్‌ నర్సుగా ప్రాక్టీసు చేసేందుకు చట్టబద్ధంగా అధికారం ఉన్న వ్యక్తి.”

[చిత్రసౌజన్యం]

డోర్లాండ్స్‌ ఇలస్ట్రేటెడ్‌ మెడికల్‌ డిక్షనరి అనే అమెరికా ప్రచురణ నుండి.

UN/J. Isaac

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

‘ఆరోగ్య సంరక్షణకు వెన్నెముక’

1999 జూన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ సెన్టెనల్‌ కాన్ఫరెన్స్‌లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అయిన గ్రో హార్లెమ్‌ బ్రుండ్‌లాండ్‌ ఇలా అన్నాడు:

“కీలకమైన ఆరోగ్య సంరక్షకులుగా నర్సులు ఆరోగ్యదాయకమైన గ్రహం కోసం శక్తివంతమైన కారకంగా పనిచేసేందుకు విశేషమైన స్థానంలో ఉన్నారు. . . . అనేక జాతీయ ఆరోగ్య విధానాల్లో నర్సులు, మంత్రసానులు దాదాపు 80 శాతం అర్హులైన ఆరోగ్య సంరక్షక శక్తిగా ఉన్నారు. గనుక, 21వ శతాబ్దంలో అందరికీ ఆరోగ్యం చేకూర్చేందుకు అవసరమయ్యే మార్పులను తీసుకురావడంలో ఎంతో బలమైన శక్తికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి, ఆరోగ్య సేవలకు వారు ఇచ్చే మద్దతు మొత్తం అన్ని ఆరోగ్య సంరక్షణా రంగాలను తాకుతుంది. . . . అనేక ఆరోగ్య సంరక్షక బృందాలకు నర్సులు వెన్నెముకగా ఉన్నారన్నది స్పష్టమౌతుంది.”

మెక్సికో మాజీ అధ్యక్షుడైన ఎర్నెస్టో జెడిల్లో పోన్స్‌ డె లియోన్‌ తన ప్రసంగంలో, మెక్సికోలోని నర్సులను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఇలా అన్నాడు: “దినం తర్వాత దినం మీరందరూ . . . మెక్సికన్‌ల ఆరోగ్యాన్ని కాపాడి దాన్ని పునఃస్థాపించడానికి మీకున్న జ్ఞానములో సర్వ శ్రేష్ఠమైనదాన్ని, మీ ఏకీభావాన్ని, మీ సేవల్నీ మీరు అంకితం చేస్తున్నారు. అవసరమైన వారికి మీరు ప్రతి రోజు మీ వృత్తిపరమైన సహాయాన్నే కాదు మీ దయాపూర్వకమైన సేవాతత్పరమైన వ్యవహారం ద్వారా లభించే ఓదార్పును కూడా అందజేస్తారు, ప్రగాఢమైన మానవత్వపు దృక్పథంతో అలా చేస్తారు. . . . మన ఆరోగ్య సంస్థలలో మీరే అతి పెద్ద భాగం. . . . కాపాడబడిన ప్రతి జీవితంలోనూ, వేసినేషన్‌ చేయబడిన ప్రతి బిడ్డలోనూ, సహాయం అందజేయబడిన ప్రతి కాన్పులోనూ, ప్రతి ఆరోగ్య సంభాషణలోనూ, రోగి రోగాన్నుంచి కోలుకున్న ప్రతి కేసులోనూ, శ్రద్ధ చూపించబడి దృఢమైన మద్దతును పొందిన ప్రతి రోగిలోనూ, మన నర్సుల హస్తం తప్పక ఉంటుంది.”

[చిత్రసౌజన్యం]

UN/DPI Photo by Greg Kinch

UN/DPI Photo by Evan Schneider

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

మెప్పుదల గల ఒక వైద్యుడు

మంచి నర్సుల పట్ల తనకున్న కృతజ్ఞతా భావాన్ని న్యూయార్క్‌లోని ప్రెస్‌బైటేరియన్‌ హాస్పిటల్‌కు చెందిన డా. సందీప్‌ జోహార్‌ వ్యక్తపరిచాడు. మరణించబోతున్న ఒక రోగికి మరింత మార్‌ఫైన్‌ ఇవ్వడం అవసరమని ఒక నర్సు ఆయనను యుక్తిగా ఒప్పించింది. ఆయనిలా వ్రాశాడు: “మంచి నర్సులు డాక్టర్లకు బోధిస్తారు కూడా. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ వంటి ప్రత్యేకమైన వార్డులలో ఉన్న నర్సులు హాస్పిటల్‌లలో ఉన్నవారిలోకెల్లా చక్కని తర్ఫీదు పొందిన వృత్తిపరమైన నిపుణులు. నేను సహాయ వైద్యునిగా ఉన్నప్పుడు, కాథటర్లు ఎలా వేయాలో, వెంటిలేటర్లు ఎలా సరిచేయాలో వారు నాకు నేర్పించారు. ఏ మందులను వాడకూడదో కూడా వారు నాకు చెప్పారు.”

ఆయనింకా ఇలా కొనసాగించాడు: “నర్సులు రోగులకు ఎంతో ఆవశ్యకమైన భావోద్వేగపరమైన మానసికపరమైన మద్దతును ఇస్తారు, ఎందుకంటే రోగులతో ఎక్కువ సమయాన్ని గడిపేది వారే. . . . నేను రోగిని వెంటనే చూడాలని, నేను ఎంతో నమ్మకం ఉంచే నర్సు చెప్పినప్పుడు ప్రతిస్పందించినంత త్వరగా మరెన్నడూ నేను ప్రతిస్పందించను.”

[7వ పేజీలోని చిత్రం]

“ఇతరులకు సేవ చేయాలన్న కోరిక నాకు ఉండేది.”​—టెర్రీ వెథర్‌సన్‌, ఇంగ్లాండ్‌.

[7వ పేజీలోని చిత్రం]

“మా నాన్నగారు హాస్పిటల్‌లో ఉండడాన్ని చూసినప్పుడు, ఒక నర్స్‌నవ్వాలని నేను నిర్ణయించుకున్నాను.”​—ఎట్సుకో కోటాని, జపాన్‌.

[7వ పేజీలోని చిత్రం]

‘ఒక మంత్రసాని ఆనందించగల అత్యంత అద్భుతమైన విషయాల్లో కాన్పు ఒకటి.’​—యోలాండ్‌ గీలెన్‌-వన్‌ హూఫ్ట్‌, నెదర్లాండ్స్‌.

[8వ పేజీలోని చిత్రం]

శిశు జననానికి తోడ్పడడంలో మంత్రసానులకు ఆనందం, సంతృప్తి లభిస్తాయి