కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాచారాన్ని వక్రీకరించడం

సమాచారాన్ని వక్రీకరించడం

సమాచారాన్ని వక్రీకరించడం

“ఎడతెరపి లేకుండా తెలివిగా ప్రచారం చేయడం ద్వారా, ప్రజలు స్వర్గాన్నైనా నరకం అని నమ్మేలా, ఎంతో హీనమైన బ్రతుకునైనా స్వర్గం అని నమ్మేలా చేయవచ్చు.”​—అడాల్ఫ్‌ హిట్లర్‌, మియన్‌ కామ్ఫ్‌.

సమాచార మాధ్యమాలు​—ముద్రణ మొదలుకొని, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, ఇంటర్‌నెట్‌ వరకు​—అభివృద్ధి చెందడంతో ప్రజలను నమ్మించే సమాచార వెల్లువ వేగం పుంజుకుంటోంది. నలువైపుల నుండి ప్రజలకు చేరుతున్న వార్తలకు అవధులు లేకుండా పోతున్నాయి. దీని మూలంగా, ప్రజలు తమకు చేరే సమాచారాన్ని గురించి ఏమాత్రం ప్రశ్నించకుండానే, విశ్లేషించకుండానే అది నిజమని వెంటనే నమ్మేస్తుంటారు.

ప్రజలు అలాంటి సులభ పద్ధతులను అవలంభించాలని ప్రచారం చేసేవాళ్ళు ఇష్టపడతారు. ముఖ్యంగా, తార్కికంగా ఆలోచించకపోతే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ప్రజలు అలా ఆలోచించకుండా నమ్మేయడాన్ని ప్రోత్సహించేందుకు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల భావోద్వేగాలను రేపుతారు, వాళ్ళకున్న అకారణ భయాలను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు, ద్వంద్వార్థాలు గల మాటలను ఉపయోగిస్తారు, తర్క విరుద్ధమైన విషయాలను కూడా ప్రజలు నమ్మేలా మాట్లాడుతారు. ఇలాంటి తంత్రాలు ఎంతో అమోఘంగా పనిచేస్తాయన్న విషయాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది.

ప్రచారపు చరిత్ర

నేడు, “ప్రచారం” అనే మాట నిజాయితీలేని తంత్రాలను సూచిస్తుంది, ప్రతికూల భావాన్ని స్ఫురిస్తుంది. కాని మొదట్లో అలా స్ఫురించేది కాదు. “ప్రచారం” అనే మాటకు ఆంగ్ల పదం ప్రోపగాండా. ఆ పదం, రోమన్‌ క్యాథలిక్‌ కార్డినల్‌ల గుంపుకున్న, కాంగ్రిగేషియో డీ ప్రోపగాండా ఫైడే (విశ్వాస ప్రచారపు సంఘం) అనే లాటిన్‌ పేరు నుండి వచ్చింది. ఈ గుంపును క్లుప్తంగా ప్రోపగాండా అని పిలిచేవారు. మిషనరీలను పర్యవేక్షణ చేసేందుకు ఈ ప్రోపగాండా కమిటీని 1622లో పోప్‌ గ్రెగరీ XV స్థాపించారు. అయితే, “ప్రోపగాండా” (ప్రచారం) అనే మాటకు, ఒక నమ్మకాన్ని వ్యాపింపజేసేందుకు చేసే ప్రయత్నం అన్న అర్థం తర్వాత వచ్చింది.

ప్రచారం చేయాలన్న తలంపు, 17వ శతాబ్దంలో పుట్టింది కాదు. ప్రాచీన కాలాల నుండే, మనుష్యులు తమ తమ సిద్ధాంతాలను వ్యాపింపజేసుకునేందుకు లేదా తమ పేరునూ అధికారాన్నీ పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్నీ ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, ఐగుప్తు ఫరోల కాలం నుండే, కళలు ప్రచారపు లక్ష్యాల కోసం ఉపయోగపడుతున్నాయి. ఆ రాజులు తమ శక్తినీ దీర్ఘకాల ప్రభావాన్నీ చూపేందుకు పిరమిడ్‌లను రూపకల్పన చేశారు. అలాగే, రోమ్‌, తన మహత్త్వాన్ని కనబరచాలన్న రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకునేందుకు తన వాస్తుశిల్ప కళను ఉపయోగించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, మాధ్యమాలు ప్రసారం చేసే సమాచారాన్ని ప్రభుత్వాలు వక్రీకరించి వ్యాపింపజేయడంతో, “ప్రోపగాండా” అనే మాట ప్రతికూల అర్థాన్ని సంతరించుకుంది. అడాల్ఫ్‌ హిట్లర్‌, యోసఫ్‌ గియోబల్స్‌లు తాము నైపుణ్యం గల ప్రచారకులమని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నిరూపించుకున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, దేశపు కార్యాచరణ విధానాన్ని పెంపొందించేందుకు ఎక్కువగా ప్రచారాన్నే ముఖ్య ఉపకరణంగా ఉపయోగించడం ప్రారంభమైంది. తమ పక్షానికి చేరని అసంఖ్యాక ప్రజలను గెలుచుకునేందుకు పాశ్చాత్య మరియు ప్రాచ్య కూటమిలు తీవ్రంగా ప్రచారం చేశాయి. దేశపు కార్యాచరణ విధానంలోని, జనజీవితంలోని ప్రతి పార్శ్వాన్నీ ప్రచార లక్ష్యం కోసం ఉపయోగించుకున్నారు. ప్రచార పద్ధతుల్లో కొనసాగుతూన్న ఆధునికీకరణ, ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లోను, అలాగే, పొగాకు కంపెనీలు చేసిన వాణిజ్య ప్రకటనల్లోను ప్రస్ఫుటమౌతున్నాయి. పొగ త్రాగే అలవాటు నిజానికి ప్రజారోగ్యానికి హానికరమైనప్పటికీ, అది హానికరం కాదని, అందమైన, ఆరోగ్యకరమైన అలవాటని అనిపించేలా దాన్ని చిత్రీకరించేందుకు, నిపుణులని పిలువబడేవాళ్ళనూ మరితర రంగాల్లోని నాయకులనూ వాణిజ్య ప్రకటనదారులు వాణిజ్య ప్రకటనల్లో ఉపయోగిస్తున్నారు.

అబద్ధాలు, అబద్ధాలు!

ప్రచారం చేసేవాళ్ళు ఉపయోగించే అత్యంత సులభమైన తంత్రం, పచ్చి అబద్ధాలు చెప్పడమే. ఉదాహరణకు, 1543లో యూరప్‌లో ఉన్న యూదులను గురించి మార్టిన్‌ లూథర్‌ వ్రాసిన అబద్ధాలనే తీసుకోండి. “వాళ్ళు బావులను విషపూరితం చేశారు, హత్యలు చేశారు, పిల్లలను కిడ్నాప్‌ చేశారు. . . . వాళ్ళు విషపూరితమైనవాళ్ళు, చెడ్డవాళ్ళు, ప్రతీకారవైఖరి గలవాళ్ళు, కుయుక్తిగల సర్పములు, హంతకులు, గాయపరిచే హాని కలిగించే అపవాది పిల్లలు” అని ఆయన వ్రాశాడు. ఆ విధంగా చెబుతూ, క్రైస్తవులని పిలువబడేవారికి ఆయన ఏమి బోధించాడు? “వాళ్ళ సమాజమందిరాలకూ స్కూళ్ళకూ నిప్పంటించండి . . . వాళ్ళ ఇళ్ళను కూడా కూలగొట్టి ధ్వంసం చేయండి” అని బోధించాడు.

పరిపాలక శాస్త్రంలోను, సాంఘిక శాస్త్రంలోను ప్రొఫెసర్‌ అయిన ఒకరు, ఆ శకాన్ని గురించి అధ్యయనం చేశారు. “యూదావ్యతిరేక వాదానికీ యూదుల చర్యలకూ అసలు ఎటువంటి సంబంధమూ లేదు కాబట్టి, యూదుల నిజమైన స్వభావాన్ని గురించి యూదావ్యతిరేకులకు తెలిసిన దానికీ యూదావ్యతిరేక వాదానికీ కూడా ఎటువంటి సంబంధమూ లేదు” అని ఆ ప్రొఫెసర్‌ అంటున్నారు. యూదావ్యతిరేకులు “యూదులను ప్రతి విధమైన కీడుకు ప్రతీకగా ఎంచేవారు. కనుక, ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, సమాజానికి ఏ కీడు సంభవించినా దానికి కారకులు యూదులేనని వాళ్ళు భావించేవారు” అని కూడా ఆయన అన్నారు.

అందరికీ వర్తించేలా చేయడం

ప్రచారంలోని మరింత ఫలప్రదమైన మరొక తంత్రం, విషయాన్ని అందరికీ వర్తించేలా చేయడం. ఈ పద్ధతి, వివాదంలో ఉన్న అసలు విషయాలకు సంబంధించిన ప్రాముఖ్యమైన వాస్తవాలను మరుగు చేసి, నిర్దిష్ట సముదాయాలకు చెందిన ప్రజలనందరినీ చిన్నచూపు చూసేలా చేస్తుంది. ఉదాహరణకు, “జిప్సీలు [లేదా వలస వచ్చినవాళ్ళు] దొంగలు” అన్న మాట యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఎడతెరపి లేకుండా వినిపిస్తూనే ఉంటుంది. కానీ, అది నిజమా?

అలాంటి తలంపులు, ఒక దేశంలో, “విదేశీయులపై భయం కలగడానికీ, వేరే జాతులకు చెందినవారిపై తరచూ కోపావేశం కలగడానికీ” కారణమయ్యాయి అని రీకార్డోస్‌ సోమరీటిస్‌ అనే కాలమిస్ట్‌ అంటున్నారు. అయితే, నేరాల విషయానికి వస్తే, ఆ దేశంలోని నేరస్థుల్లో, విదేశీయులు ఉన్నట్లే అక్కడ పుట్టి పెరిగినవాళ్ళు కూడా ఉన్నారు. గ్రీస్‌లో, “జరిగిన 100 నేరాల్లో 96 నేరాలు [గ్రీకులే] చేసినట్లు” సర్వేలు చూపిస్తున్నాయని సోమరీటిస్‌ అన్నారు. “నేరాలు జరగడానికి కారణాలు ఆర్థికమైనవీ, సామాజికమైనవే కానీ, ‘జాతివాదపు’ కారణాలు మాత్రం కావు” అని ఆయన అంటున్నారు. సమాచార మాధ్యమాలు, జరిగిన నేరాలను వక్రీకరించి చెప్పడం ద్వారా, “ఒక పద్ధతి ప్రకారం” ప్రజల మనస్సుల్లో “జాతివాదపు భావాన్నీ, విదేశీయులంటే భయాన్నీ కలిగించాయని” ఆయన నిందిస్తున్నారు.

పేర్లు పెట్టడం

కొందరు, వాస్తవాల మీద శ్రద్ధ పెట్టే బదులు, తమతో ఏకీభవించని వారి వ్యక్తిత్వాన్ని లేదా ఉద్దేశాలను ప్రశ్నిస్తూ వారిని అవమానిస్తారు. ఒక వ్యక్తికి గానీ, ఒక గుంపుకు గానీ, ఒక ప్రతిపాదనకు గానీ ప్రతికూలమైన పేరు పెట్టబడినప్పుడు, ఆ పేరు సులభంగా గుర్తుండి, అలాగే ఉండిపోతుంది. పేర్లు పెట్టే వ్యక్తి, తాను పెట్టే పేరు అలా శాశ్వతంగా ఉండిపోవాలనే ఆశిస్తాడు. ప్రజలు రుజువులను పరిశీలించకుండా, అలా పెట్టబడిన ప్రతికూలమైన పేరును బట్టి, ఆ వ్యక్తిని గానీ, ప్రతిపాదనను గానీ నిరాకరిస్తే, ఆ పేరు పెట్టిన వ్యక్తి పన్నుగడ ఫలించిందన్నమాటే.

ఉదాహరణకు, ఇటీవలి సంవత్సరాల్లో, యూరోప్‌లోని అనేక దేశాల్లోను మరితర దేశాల్లోను మతతెగల మీద తీవ్రమైన వ్యతిరేకభావం వ్యాపించింది. ఈ వ్యతిరేక భావం భావోద్వేగాలను రేకెత్తించింది, శత్రు భావాన్ని కలిగించింది, అల్పసంఖ్యాక మతాలవారిపై ఉన్న అకారణమైన దురభిప్రాయాలను బలపరచింది. ఈ దేశాల్లో, “మతతెగ” అనే మాట మళ్ళీ మళ్ళీ ఉపయోగించబడుతోంది. “‘చర్చి విరోధి’ అనే మాటకు ప్రత్యామ్నాయం ‘మత తెగ.’ జర్మనీలో గతకాలాల్లో చర్చి విరోధులకు మరణ శిక్ష విధించి, వారిని కాల్చి చంపినట్లు నేడు చేయకపోయినప్పటికీ, . . . ఎవరినైతే విరోధిగా తలుస్తారో ఆ వ్యక్తిపై ప్రజలకు నమ్మకం లేకుండా చేయడం, అతణ్ణి ఒంటరివాడిగా చేయడం, ఆర్థికంగా హీనస్థితికి చేర్చడం వంటివి చేస్తున్నారు” అని జర్మన్‌ ప్రొఫెసర్‌ అయిన మార్టిన్‌ క్రీలా 1993లో అన్నారు.

“ప్రపంచ చరిత్రలోను, అలాగే మన సొంత వ్యక్తిత్వ వికాసంలోను ఇతరులు పెట్టిన చెడ్డ పేర్లు శక్తివంతమైన పాత్రలనే వహించాయి. అవి వ్యక్తులకున్న మంచి కీర్తిని పాడుచేశాయి, . . . వ్యక్తులను జైళ్ళకు పంపించాయి, వ్యక్తులు యుద్ధంలో పాల్గొని తోటివాళ్ళను చంపేంత వెర్రివాళ్ళనుగా చేశాయి” అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రోపగాండా అనాలిసిస్‌ పేర్కొంటోంది.

భావోద్వేగాలతో ఆడుకోవడం

అనుభూతులకు వాస్తవాలతో లేదా ఒక వాదనలోని సహేతుకతతో సంబంధమేమీ లేకపోయినప్పటికీ, ప్రజలను ఒప్పించే విషయంలో అవి ప్రముఖ పాత్రను వహిస్తాయి. వాయిద్యకారులు పియానోను ఎంత నిపుణంగా వాయిస్తారో, అలాగే ఇతరుల అనుభూతులను ఉపయోగించుకోగల అనుభవజ్ఞులైన ప్రకటనదారులు ప్రజల భావోద్వేగాలను రేకెత్తించడానికి అంతే నిపుణతతో ప్రయత్నిస్తారు.

ఉదాహరణకు, యం అనే భావోద్వేగం, విషయాలను సరైన విధంగా ఆచితూచి సరైన నిర్ణయానికి రాగల వివేచనకు అడ్డు తగులుతుంది. అసూయ అనే భావోద్వేగంతో ఆడుకునేటట్లే భయం అనే భావోద్వేగంతో కూడా ఆడుకోవచ్చు. ఫిబ్రవరి 15, 1999 నాటి  గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌  అనే కెనడా దేశపు వార్తాపత్రిక మాస్కోలో జరిగిన సంఘటన గురించి చెబుతూ, “గత వారం మాస్కోలోని ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఈ అమ్మాయిలు యెహోవాసాక్షులను అనుసరించే ఛాందసులని రష్యా మాధ్యమం వెంటనే సూచించింది” అని నివేదించింది. ‘ఛాందసులు’ అనే మాటను గమనించండి. యౌవనస్థులు ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పే మత ఛాందస సంస్థ అన్న మాట వింటేనే ప్రజలకు చాలా భయం కలగడం సహజం. అభాగిణులైన ఈ ముగ్గురు అమ్మాయిలకు నిజానికి యెహోవాసాక్షులతో ఏమైనా సంబంధముందా?

“ఆ అమ్మాయిలకు [యెహోవాసాక్షులతో] ఏ సంబంధమూ లేదని పోలీసులు తర్వాత ఒప్పుకున్నారు. కానీ, అప్పటికే, టెలివిజన్‌ చానల్‌లు యెహోవాసాక్షులపై క్రొత్త దాడి చేయడం మొదలుపెట్టాయి. ఎలాగంటే, నాజీ జర్మనీలో యెహోవాసాక్షులు అడాల్ఫ్‌ హిట్లర్‌తో సహకరించారని చెబుతూ తప్పుడు ప్రచారం చేశాయి. వాస్తవానికి వేలాదిమంది యెహోవాసాక్షులు నాజీ మృత్యు శిబిరాల్లో మరణించారన్న రుజువులున్నప్పటికీ టెలివిజన్‌ చానల్‌లు అలా తప్పుడు ప్రచారం చేశాయి” అని కూడా గ్లోబ్‌ అంటుంది. తప్పుడు సమాచారం అందుకున్న, భయకంపితులైన ప్రజల మనస్సుల్లో, యెహోవాసాక్షులంటే ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పే తెగ లేదా నాజీ సహకారులు అన్న భావం ఏర్పడింది !

ప్రచారం చేసేవాళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకునే మరొక శక్తివంతమైన భావోద్వేగం ద్వేషం. ద్వేషాన్ని రేకెత్తించేందుకు అస్పష్టమైన అనుచితమైన భాష బాగా పని చేస్తుంది. నిర్దిష్ట జాతి మీద, వర్గం మీద లేదా మత గుంపుల మీద ద్వేషాన్ని పెంపొందించి, ఆ ద్వేష భావాన్ని ఉపయోగించేందుకు వాడే చెడ్డమాటలకు అవధుల్లేవనిపిస్తుంది.

ప్రచారం చేసే కొందరు, వ్యక్తులకుండే అహంతో ఆడుకుంటారు. “మీ అంత చదువు ఉన్న ఎవరైనా తప్పక గ్రహిస్తారు,” లేదా “తెలివైన ఏ వ్యక్తికయినా అది తెలుస్తుంది” వంటి నిర్దిష్ట మాటలను ఉపయోగించి అహాన్ని రెచ్చగొట్టడాన్ని మనం గమనించవచ్చు. తెలివిలేని వాళ్ళముగా కనిపిస్తామేమోనని వాళ్ళకుండే భయంతో ఆడుకుంటూ వాళ్ళ అహాన్ని తమ ప్రయోజనానికి ఉపయోగించుకుంటారు. అవును, ఒప్పించడంలో నిపుణులైన వారికి, సాధారణంగా వ్యక్తులకుండేటువంటి భయాన్ని గురించి బాగా తెలుసు.

నినాదాలూ, సంకేతాలూ

దృక్పథాలను లేదా లక్ష్యాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే అస్పష్టమైన వాక్యాలే నినాదాలు. అవి అస్పష్టంగా ఉండడం వల్ల, వాటితో ఏకీభవించడం సులభం.

ఉదాహరణకు, జాతీయ సంక్షోభం లేదా సంఘర్షణ ఉన్న సమయాల్లో, “తప్పైనా ఒప్పైనా నేను నా దేశం పక్షానే ఉంటాను,” “మాతృ దేశం, మతం, కుటుంబం,” “స్వాతంత్ర్యమో, వీర స్వర్గమో” అనే నినాదాలను ప్రజల భావోద్వేగాలను రేకెత్తించగల నాయకులు ఉపయోగించవచ్చు. నిర్దిష్ట సంక్షోభంలో లేదా సంఘర్షణలో ఇమిడి ఉన్న అసలు వివాదాలను అధిక సంఖ్యాకులు జాగ్రత్తగా విశ్లేషిస్తారా? లేక, తమకు ఏది చెబితే దాన్ని అంగీకరించి అలాగే చేస్తారా?

మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించి వ్రాస్తూ, “శాంత స్వభావులుగా ఉండే ఈ రైతుల సమూహాలను కార్మికుల సమూహాలను ఒకళ్ళనొకళ్ళు చీల్చుకునే శక్తివంతమైన సమూహాలుగా మార్చేందుకు ఒక చిన్న సంకేతం చాలు” అని విన్సంట్‌ చర్చిల్‌ అభిప్రాయపడ్డాడు. ఏదైనా చెయ్యమని తమతో చెప్పినప్పుడు చాలామంది ప్రజలు ముందూ వెనకా ఆలోచించకుండానే ప్రతిస్పందిస్తారని కూడా ఆయన పేర్కొన్నాడు.

జాతీయ పతాకం, గౌరవంగా సైనికులు చేసే వందనం, 21-గన్‌ సాల్వో (గౌరవసూచకంగా 21 సార్లు తుపాకి పేల్చడం) వంటి విస్తృతమైన సంకేతాలూ సంజ్ఞలూ ప్రచారం చేసేవాళ్ళకు ఉన్నాయి. తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమను కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. పితృదేశం, మాతృభూమి, లేదా మదర్‌ చర్చి వంటి సంకేతాలు కుయుక్తితో ప్రచారం చేసే వారి చేతుల్లోవున్న విలువైన ఉపకరణాలు.

కుయుక్తితో కూడిన ప్రచారం, ఆలోచనా సామర్థ్యం సరిగా పనిచేయకుండా చేస్తుంది, స్పష్టంగా ఆలోచించుకోవడాన్ని, వివేచించడాన్ని నివారిస్తుంది, ఒక గుంపులోని వాళ్ళు ఎలా చేస్తే అలా చేసేలా వ్యక్తులను మలుచుతుంది. అయితే, ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోగలరు?

[8వ పేజీలోని బ్లర్బ్‌]

కుయుక్తితో కూడిన ప్రచారం, ఆలోచనా సామర్థ్యం సరిగా పవిచేయకుండా చేస్తుంది, స్పష్టంగా ఆలోచించుకోవడాన్ని నివారిస్తుంది

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యెహోవాసాక్షులు చేసేది మత ప్రచారమా?

యెహోవాసాక్షులు యూదా మతాన్ని ప్రచారం చేస్తున్నారని కొందరు వ్యతిరేకులు నిందించారు. యెహోవాసాక్షుల పరిచర్య కమ్యూనిజానికి మద్దతునిస్తుందని మరి కొందరు ఆరోపించారు. యెహోవాసాక్షుల పని “అమెరికా ప్రభుత్వపు” తలంపులకూ ఆసక్తులకూ మద్దతునిస్తుందని మరి కొందరు అన్నారు. యెహోవాసాక్షులు అరాజకవాదులనీ, సాంఘిక ఆర్థిక రాజకీయ శాసనిక క్రమవ్యవస్థను మార్చివేయాలనే ఉద్దేశంతో దానికి భంగం కలిగించడాన్ని ప్రేరేపిస్తున్నారని ఇంకా కొందరు నొక్కి చెబుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ ఆరోపణలన్నీ నిజమై ఉండవన్నది స్పష్టం.

యెహోవాసాక్షులు, పైనచెప్పిన ఏ కోవకూ చెందరన్నది వాస్తవం. “మీరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ఉత్తరువుకు వాళ్ళు నమ్మకంగా విధేయతను చూపిస్తూ సాక్ష్యపు పనిని నిర్వర్తిస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 1:8) యావద్భూమి మీద శాంతిని తీసుకువచ్చేందుకు దేవుడు ఉపయోగించే ఉపకరణం పరలోకరాజ్యం. ఆ పరలోకరాజ్య సువార్త మీదే వాళ్ళ పని పూర్తిగా కేంద్రీకరించబడి ఉంటుంది.​—మత్తయి 6:9, 10; 24:14.

యెహోవాసాక్షులు అని పిలువబడే ఈ క్రైస్తవ సమాజం, ఏ దేశంలోనైనా ఏనాడైనా క్రమవ్యవస్థకు అంతరాయం కలిగేలా ప్రజలను ఉసిగొల్పినట్లు చూపించే ఏ రుజువూ యెహోవాసాక్షులను గమనించేవారికి కనిపించలేదు.

యెహోవాసాక్షులు తాము నివసించే సమాజాలకు చేసిన ప్రయోజనకరమైన తోడ్పాటులను గురించి అనేకమంది పత్రికా విలేఖరులు, జడ్జీలు, మరితరులు వ్యాఖ్యానించారు. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. దక్షిణ యూరప్‌లోని ఒక నివేదికురాలు, యెహోవాసాక్షుల సమావేశానికి ఒకసారి హాజరైన తర్వాత, “ఈ ప్రజలు పటిష్ఠమైన కుటుంబ బంధాలు గల ప్రజలు, వాళ్ళు ఇతరులను ప్రేమించడానికీ, ఇతరులకు హాని కలిగించకుండా తమ మనస్సాక్షి ప్రకారం జీవించేందుకూ నేర్చుకున్నారు” అని వ్యాఖ్యానించారు.

మునుపు యెహోవాసాక్షులపై వ్యతిరేక అభిప్రాయంగల ఒక పత్రికావిలేఖరి, “వాళ్ళు మాదిరికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నైతిక, ధార్మిక ప్రమాణాలను వాళ్ళు ఉల్లంఘించరు” అని పేర్కొన్నారు. ఒక రాజనీతి శాస్త్రవేత్త, యెహోవాసాక్షుల గురించి, “వాళ్ళు ప్రజలతో ఎంతో గౌరవంగా ప్రేమగా మృదువుగా వ్యవహరిస్తారు” అని వ్యాఖ్యానించారు.

అధికారానికి లోబడి ఉండడం సరైనదని యెహోవాసాక్షులు బోధిస్తారు. చట్టాన్ని అనుసరించే పౌరులుగా వాళ్ళు నిజాయితీ, సత్యసంధత, పరిశుభ్రత వంటి బైబిలు ప్రమాణాలను అనుసరిస్తారు. వాళ్ళు తమ కుటుంబ సభ్యుల్లో నైతికతను అలవరుస్తారు, ఇతరులు కూడా అలాగే చేయడాన్ని నేర్చుకోవటానికి సహాయపడతారు. వాళ్ళు, క్రమవ్యవస్థకు అంతరాయాలు కలిగించే ప్రదర్శనల్లో లేక రాజకీయ విప్లవాల్లో పాల్గొనక, అందరితోను శాంతియుతంగా జీవిస్తారు. సర్వోన్నతుడూ, సర్వాధికారంగల ప్రభువూ అయిన యెహోవా ఈ భూమి మీద పరిపూర్ణమైన శాంతినీ, నీతివంతమైన ప్రభుత్వాన్నీ పునఃస్థాపిస్తాడని ఒకవైపు ఎంతో ఓపికతో ఎదురుచూస్తూనే, మరొకవైపు, మానవ ప్రభుత్వాలు పెట్టిన శాసనాలకు విధేయత చూపడంలో మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.

సాక్షుల పని విద్యాసంబంధమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ బైబిలు సూత్రాలను గురించి ఆలోచించుకుంటూ, ప్రవర్తనలోను, నైతిక నడవడిలోను సరైన ప్రమాణాలు కలిగి ఉండేలా వాళ్ళకు సహాయపడేందుకు, సాక్షులు బైబిలును ఆధారంగా చేసుకుని బోధిస్తున్నారు, కుటుంబ జీవితాన్ని మెరుగుపరిచేటటువంటి విలువలను పెంపొందిస్తున్నారు, యౌవనస్థులు తాము ఎదుర్కొనే సవాళ్ళను అధిగమించేందుకు సహాయపడుతున్నారు. చెడు అలవాట్లను అధిగమించటానికి కావలసిన శక్తిని పొందేందుకు, ఇతరులతో స్నేహముగా ఉండగల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా సహాయపడుతున్నారు. అలాంటి పనిని “మత ప్రచారం” అని ఏ మాత్రం అనలేము. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతున్నట్లుగా, తలంపులను అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయగల వాతావరణంలో, “ప్రచారానికీ విద్యాబోధనకూ ఎంతో తేడా ఉంది.”

[చిత్రాలు]

యెహోవాసాక్షుల ప్రచురణలు కుటుంబ విలువలను ఉన్నత నైతిక ప్రమాణాలను పెంపొందిస్తాయి

[5వ పేజీలోని చిత్రాలు]

యుద్ధాన్నీ, పొగత్రాగడాన్నీ ప్రబలం చేసిన ప్రచారం అనేకుల మరణానికి కారణమైంది