తప్పుడు ప్రచారానికి ఎర కాకండి!
తప్పుడు ప్రచారానికి ఎర కాకండి!
“జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును.”—సామెతలు 14:15.
విద్యకూ ప్రచారానికీ తేడా ఉంది, చాలా పెద్ద తేడానే ఉంది. విద్య, మీరు ఎలా ఆలోచించాలో చూపిస్తుంది. ప్రచారం, మీరు ఏమి ఆలోచించాలో చెబుతుంది. మంచి విద్యాబోధకులు ఒక అంశం యొక్క అన్ని పార్శ్వాలను తెలియజేసి, చర్చించడాన్ని ప్రోత్సహిస్తారు. ప్రచారం చేసేవాళ్ళు, ఒక విషయాన్ని గురించిన తమ దృక్కోణాన్ని గురించి తాము చెబుతున్నప్పుడు వినమని మిమ్మల్ని నిరంతరం బలవంతపెడుతుంటారు, చర్చించడాన్ని నిరుత్సాహపరుస్తుంటారు. వాళ్ళ అసలు లక్ష్యం ఏమిటో మనకు అర్థంకాదు. వాళ్ళు వాస్తవాలను చెప్పకుండా దాటేస్తారు, ఉపయోగకరమైన సమాచారాన్ని తమ స్వార్థం నిమిత్తం తెలియజేస్తూ, మిగతా సమాచారాన్ని దాచేస్తారు. వాళ్ళు, అబద్ధాలనూ అర్ధ సత్యాలనూ చెప్పే ప్రయత్నంలో వాస్తవాలను వక్రీకరించి చెబుతారు. వాళ్ళ గురి మీ భావోద్వేగాల మీదే గానీ, మీ తార్కిక ఆలోచనా సామర్థ్యం మీద కాదు.
ప్రచారం చేసే వ్యక్తి, తన సమాచారం సరైనదిగా, నైతికతగలదిగా కనిపించేలా నిశ్చయపరచుకుంటాడు, మీరు దాన్ని అనుసరిస్తే, మీరు ప్రముఖులన్న భావనా, అతడు మీ వాడేనన్న భావనా మీలో కలిగేలా చూస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు చేస్తే, తెలివైనవారిలో మీరూ ఒకరనీ, మీరు ఒంటరివారు కారనీ, మీరు సుఖంగా ఉంటారనీ, భద్రతను అనుభవిస్తారనీ అంటాడు.
“వదరబోతులును మోసపుచ్చువారు”ను అని బైబిలు పిలుస్తున్న ఈ రకమైన ప్రజల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోగలరు? (తీతు 1:10) వాళ్ళు ఉపయోగించే కొన్ని తంత్రాలను గురించి మీకు ఒకసారి తెలిసిందంటే, ఇక మీ దగ్గరికి వచ్చే ఏ సందేశాన్నైనా సమాచారాన్నైనా మీరిట్టే మదింపు చేసుకోగలిగే స్థితిలో ఉంటారు. అలా మదింపు చేసుకునేందుకు ఈ క్రింద కొన్ని మార్గాలు ఇవ్వబడ్డాయి.
ఎంపిక చేసుకునేవారై ఉండండి: ఏ సమాచారాన్నైనా సేకరించే మనస్సును, దేన్నైనా, చివరికి మురికి నీళ్ళనైనా తనలో ప్రవహించేందుకు అనుమతించే గొట్టంతో పోల్చవచ్చు. తమ మనస్సు విషపూరితమవ్వాలని ఎవరూ కోరుకోరు. “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని ప్రాచీన కాలంనాటి రాజూ విద్యాబోధకుడూ అయిన సొలొమోను హెచ్చరించాడు. (సామెతలు 14:15) కనుక, మనం మన మెదడులోకి సేకరించుకునే సమాచారం విషయంలో ఎంపిక చేసుకునేవారమై ఉండాలి. మనకు అందే ఏ సమాచారాన్నైనా పరిశీలించి, దేన్ని తీసుకోవాలో, దేన్ని నిరాకరించాలో నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది.
అయితే, మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరచగల వాస్తవాలను పరిశీలించడాన్ని నిరాకరించేంత సంకుచితంగా మన మనస్సు ఉండాలని మనం కోరుకోము. మరైతే సమాచారాన్ని సేకరించడంలో సరైన సమతుల్యత ఏమిటో మనమెలా తెలుసుకోగలం? విషయాన్ని నిర్ధారించగల ఒక ప్రమాణాన్ని పెట్టుకొని, క్రొత్త సమాచారాన్ని దానితో పోల్చి చూడడం ద్వారా అది సమతుల్యమైనదేనా కాదా అన్నది తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడానికి క్రైస్తవుడికి ఒక వివేకపు భాండాగారం ప్రమాణంగా ఉంది. అది బైబిలు. అది, తన ఆలోచనలకు సరైన మార్గదర్శినిగా ఉంది. ఒకవైపు, క్రొత్త సమాచారాన్ని తీసుకోవడానికి ఆయన మనస్సు విశాలమైనదే. ఆయన ఆ క్రొత్త సమాచారాన్ని
బైబిలు ప్రమాణంతో పోల్చి చూసి మదింపు చేస్తాడు, నిజమైన సమాచారాన్ని తన ఆలోచనా సరళిలోకి చేర్చుకుంటాడు. మరొకవైపు, బైబిలు ఆధారమైన విలువలతో ఏ మాత్రం పొందికలేని సమాచారం వల్ల కలిగే ప్రమాదాన్ని ఆయన పసిగడతాడు.వివేచనను ఉపయోగించండి: వివేచన అంటే “సరిగ్గా అంచనావేయగల మేథాశక్తి.” అది, “ఒక విషయానికి మరో విషయానికి మధ్యనున్న తేడాను గ్రహించేందుకు మనస్సుకున్న సామర్థ్యం లేక శక్తి.” వివేచనగల వ్యక్తి తనకు తెలియజేయబడే తలంపుల్లోని లేదా కార్యాల్లోని అతి సూక్ష్మమైన తేడాలను కూడా పసిగడతాడు, సరైన నిర్ధారణకు వచ్చే మేథాశక్తి ఆయనకుంటుంది.
“నిష్కపటుల మనస్సులను మోసపుచ్చు”టకు ‘ఇంపైన మాటలను ఇచ్ఛకములను’ చెప్పేవారెవరో వివేచనను ఉపయోగించడం ద్వారా మనం గుర్తించగలుగుతాం. (రోమీయులు 16:18) ఒకదానితో ఒకటి పొసగని సమాచారాన్ని గానీ తప్పుదోవ పట్టించే సమాచారాలను గానీ వదిలిపెట్టేందుకూ, ఒక సమాచారంలోని అసలు సారాన్ని గుర్తించేందుకూ వివేచన మీకు సహాయపడుతుంది. అయితే, ఒక సమాచారం తప్పుదోవ పట్టించేదని మీరెలా గ్రహించగలరు?
సమాచారాన్ని పరీక్షించండి: “ప్రియులారా, . . . ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి” అని మొదటి శతాబ్దపు క్రైస్తవ బోధకుడైన యోహాను అన్నాడు. (1 యోహాను 4:1) నేడు కొందరు ప్రజలు స్పాంజీల్లా ఉంటారు; తమకు ఏ సమాచారం దొరికినా వంటబట్టించుకుంటారు. అవును, మన చుట్టూ ఏది ఉంటే దాన్ని వంటబట్టించుకోవడం కష్టమేమీ కాదు.
ఎలాంటి విషయాలతో ఎలాంటి సమాచారంతో మనస్సును నింపుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడమే మంచిది. మనం ఎలా ఉంటామన్నది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుందని ఒక లోకోక్తి. ఈ లోకోక్తి, శారీరక ఆహారానికీ మనస్సుకిచ్చే ఆహారానికీ కూడా వర్తిస్తుంది. మీరు ఏది చదువుతున్నా చూస్తున్నా వింటున్నా అందులో తప్పుడు ప్రచారపు లక్షణాలు కనిపిస్తున్నాయా లేక అది నిజమైనదేనా అన్నది పరీక్షించి చూడండి.
అంతేకాక, మన మనస్సులో ఎవరి గురించీ దేని గురించీ అకారణమైన తప్పుడు అభిప్రాయాలు లేకుండా ఉండాలంటే, మనం క్రొత్త సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడల్లా, మనం ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నామన్నది పరీక్షించుకుంటూ ఉండడానికి మనం సుముఖత చూపడం తప్పనిసరి. ఎంతకాదన్నా, అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలు మాత్రమేనన్న విషయాన్ని గుర్తించడం తప్పనిసరి. మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు విశ్వసనీయమైనవేనా కాదా అన్నది, మనకు తెలిసిన విషయాలు ఎంత వాస్తవమైనవి, మనకున్న తార్కికశక్తి ఎలాంటిది, మనం అన్వయించుకునే ప్రమాణాలు లేదా విలువలు ఎలాంటివి అనేవాటిని బట్టి ఉంటుంది.
ప్రశ్నలు వేయండి: మనం ఇంతవరకు చూసినట్లు, ‘మనలను చక్కని మాటలచేత మోసం చేయాలని’ చూసేవారు నేడు అనేకులు ఉన్నారు. (కొలొస్సయులు 2:4) కనుక, మనల్ని నమ్మింపజేసే వాదనలను వాళ్ళు మనముందు ఉంచినప్పుడు, మనం వాళ్ళను ప్రశ్నలు వేయాలి.
మొదటిగా, ఆ సందేశంలో లేదా ఆ సమాచారంలో దేన్ని గురించైనా ఎవరి గురించైనా నిర్హేతుకమైన దురభిప్రాయాలేమైనా ఉన్నాయా? ఆ సందేశం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఆ సందేశంలో, నిందించే మాటలూ, బరువైన మాటలూ ఉపయోగించినట్లయితే, అలాంటి మాటలను ఎందుకు ఉపయోగించినట్లు? అందులో ఉపయోగించబడిన బరువైన భాషను ప్రక్కన పెడితే, ఆ సందేశం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అన్నది పరిశీలించండి. సాధ్యమైతే, ఆ విషయాలను గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారనేది గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ విషయాలను గురించి మాట్లాడుతున్న వాళ్ళకు నిజం పలికేవాళ్ళన్న పేరుందా? అందిన సమాచారం సత్యమేనని “అధికారిక” వ్యక్తి గానీ సంస్థగానీ, ప్రచురణగానీ ప్రమాణీకరిస్తున్నట్లైతే, ఆ వ్యక్తి ఎవరు, అది ఏ సంస్థ, ఏ ప్రచురణ? వివాద విషయం సంబంధంగా, ఆ వ్యక్తికి అపారమైన జ్ఞానం ఉందని, లేదా ఆ సంస్థ దగ్గర లేదా ఆ ప్రచురణలో నమ్మదగిన సమాచారం ఉందని ఎందుకు ఎంచాలి? సమాచారం, భావోద్వేగాలను రేకెత్తించే విధంగా ఉన్నట్లు మీరు గ్రహించినట్లయితే, ‘భావోద్వేగాలను ప్రక్కన పెట్టి చూస్తే, ఆ సందేశం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి?’ అని కూడా ప్రశ్నించుకోండి.
గుడ్డిగా గుంపును అనుసరించకండి: అందరూ తలంచేదే సరైనదై ఉండాలనేమీ లేదని మీరు గ్రహిస్తే, ఇతరులకు భిన్నంగా ఆలోచించే ధైర్యం మీకు వస్తుంది. మిగతావాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తున్నట్లున్నంత మాత్రాన, మీరూ వారిలాగే ఆలోచించాలని ఉందా? ఒక విషయం నిజమని నిర్ధారించేందుకు జనాదరణ పొందిన అభిప్రాయమే కొలమానం కాదు. అనేక శతాబ్దాలుగా, అనేక రకాల తలంపులను అందరూ అంగీకరించినప్పటికీ, అవన్నీ తప్పని తర్వాత తేలాయి. అయినప్పటికీ, గుంపుతోపాటు పోవాలన్న ధోరణి బలంగా ఉండవచ్చు. “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు” అని నిర్గమకాండము 23:2 లో ఇవ్వబడిన ఆజ్ఞ ఒక మంచి సూత్రంగా ఉపకరిస్తుంది.
నిజమైన జ్ఞానమూ - తప్పుడు ప్రచారమూ
ముందు పేర్కొన్నట్లుగా, సహేతుకంగా ఆలోచించేందుకు ఖచ్చితమైన సరైన మార్గదర్శిని బైబిలు. “నీ వాక్యమే సత్యము” అని దేవునితో యేసు అన్న మాటలతో యెహోవాసాక్షులు ఏకీభవిస్తారు, అలాగని నమ్ముతారు కూడా. (యోహాను 17:17) బైబిలు రచయితయైన దేవుడు ‘సత్య దేవుడు’ కనుక వాళ్ళు అలా నమ్ముతారు.—కీర్తన 31:5.
అవును, కుయుక్తిగా ప్రచారాలు జరుగుతున్న ఈ యుగంలో, సత్యపు ఊటయైన యెహోవా వాక్యం వైపుకు మనం నమ్మకంగా చూడవచ్చు. మీరు అలా చూడడం వల్ల, ‘కల్పనావాక్యములు చెబుతూ, మీవలన లాభము సంపాదించుకోవాలని’ చూసేవారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు.—2 పేతురు 2:3.
[9వ పేజీలోని చిత్రం]
ఒకదానితో ఒకటి పొసగని సమాచారాన్ని గానీ తప్పుదోవ పట్టించే సమాచారాన్ని గానీ వదిలిపెట్టేందుకు వివేచన మీకు సహాయపడుతుంది
[10వ పేజీలోని చిత్రాలు]
మీరు ఏది చదివినా, చూసినా అది సత్యసంధమైనదేనా అని పరీక్షించి చూడండి
[11వ పేజీలోని చిత్రం]
ప్రజాదరణ పొందిన అభిప్రాయాలు అన్నివేళలా నమ్మదగినవే అయ్యుంటాయని చెప్పలేము
[11వ పేజీలోని చిత్రం]
సత్యపు ఊటయైన దేవుని వాక్యాన్ని మనం నమ్మకంగా చూడవచ్చు