మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
మిచ్ తుపాను “ప్రాణాంతకమైన తుపాను నుండి రక్షించబడటం !” (జూలై 8, 1999) అనే పురికొల్పునిచ్చే శీర్షికకు కృతజ్ఞతలు. మన సహోదరులు విపత్తులకు గురై పడుతున్న కష్టాలను గురించిన సమాచారం నాకు తరచూ ఇ-మెయిల్ ద్వారా అందుతూ ఉంటుంది. కానీ ఆ సమాచారం ఎంత మేరకు నమ్మదగినది అన్నది నాకు తెలియదు. ఈ శీర్షికలో సమాచారం తెలపబడిన విధానం చాలా ప్రోత్సాహకరంగాను, విశ్వాసాన్ని బలపరచేదిగాను ఉంది. ఇది, మనం జీవిస్తున్న కాలాలు చాలా క్లిష్టమైనవి అన్న విషయాన్ని గురించి ఆలోచింపజేసే జ్ఞాపికగా ఉంది.
సీ.పీ., అమెరికా
ఈ ప్రకృతి వైపరీత్యంలో చాలా మంది తమ ఆస్తులన్నిటినీ కోల్పోయారని నేను గ్రహించాను. అయితే ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం క్రియాశీలంగా ముందుకు వెళ్ళడాన్ని గురించి చదివినప్పుడు నేను చాలా పులకరించిపోయాను. పాడైన తన ఇంటి ముందు నిలబడిన సహోదరుని చిత్రం నన్ను ఆలోచింపజేసింది. నేను దేని గురించైనా ఫిర్యాదు చేసేందుకు నాకు ఏం హక్కుంది అని అనుకున్నాను.
ఆర్.సి.ఎన్., బ్రెజిల్
అనారోగ్యకరమైన జీవన శైలి గత కొన్ని నెలలుగా, నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. మనం మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా ఉంది. “మీ జీవనశైలి మిమ్మల్ని చంపుతోందా?” (ఆగస్టు 8, 1999) అనే శీర్షిక, కొన్ని ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలని, తీసుకునే ఆహారం సమతుల్యమైనదై ఉండాలంటే, మరిన్ని పండ్లనూ శాఖాహారాన్నీ తీసుకోవాలని నేను గ్రహించేలా చేసింది.
ఇ.పి.ఎమ్., బ్రెజిల్
చాలా కాలం తర్వాతి ప్రతిస్పందన “చాలా సంవత్సరాల తర్వాత ఫలించిన విత్తనాలు” (ఆగస్టు 8, 1999) అనే శీర్షిక చదివి నేను చాలా ప్రోత్సాహం పొందాను. నేను పూర్తికాల పరిచారకురాలుగా సేవ చేస్తున్నాను. ఇది మూడవ సంవత్సరం. నేను ఆశించిన ఫలితాలు దొరకనప్పుడు, నిరాశ చెంది, పరిచర్యలో కొనసాగాలన్న కోరికను కోల్పోతుంటాను. ఈ శీర్షికను చదవడం వల్ల, ఇప్పుడు నేను నా శాయశక్తులా చేస్తూ, ఫలితాలను యెహోవాకు వదిలిపెట్టడం నేర్చుకున్నాను.
టి.ఎన్., జపాన్
ఎగతాళి “యువత ఇలా అడుగుతోంది . . . ఎగతాళిని నేనెలా ఎదుర్కోగలను?” (జూలై 8, 1999) శీర్షిక నాకు బాగా నచ్చింది. నేను కిండర్గార్డన్లో ఉన్నప్పుడు మొదలుకొని, నా నమ్మకాలను గురించి తోటి విద్యార్థులు నన్ను ప్రశ్నించేవారు. కొన్నిసార్లు వాళ్ళు ప్రశ్నించే విధానం నా మనస్సును నొప్పించేది. అనేక సార్లు నా సహనాన్ని దాదాపుగా కోల్పోయాను. అవి కేవలం విశ్వాస పరీక్షలని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. అయినా, స్కూల్లో ఇతర విద్యార్థులకు విజయవంతంగా సాక్ష్యమిచ్చాను.
ఎల్. కె., అమెరికా
కొన్ని మతసంబంధ పండుగలను జరుపుకోనందుకు, దేశభక్తిని చూపించే ఆచారాల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు నేను కూడా ఎగతాళికి గురయ్యాను. నేను నిజాయితీగా ఉన్నందుకు, బైబిలు నైతిక ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉన్నందుకు నన్ను వేధించారు కూడా. ఖచ్చితమైన జ్ఞానాన్ని హృదయంలోకి తీసుకోవడం, సముచితమైన సమాధానం చెప్పేందుకు నాకు సహాయపడింది. నా నమ్మకాలను తెలియజేసేందుకుగాను సిగ్గుపడకుండా మాట్లాడేందుకు ఇది నాకు సహాయపడింది.
హెచ్. సి., జాంబియా
నేను కౌమార ప్రాయం దాటి ఎన్నో సంవత్సరాలైంది. నాకు ఇప్పుడు 50 కన్నా ఎక్కువ ఏండ్లు ఉన్నాయ్ ! అయినప్పటికీ నేను ఈ శీర్షికను మెచ్చుకుంటున్నాను. పరిచర్యలో వ్యతిరేకత ఎదురైనప్పుడు వెనుకంజవేసిన సమయాలూ, బదులు తీర్చుకోవాలని అనిపించిన సమయాలూ ఉన్నాయి. “అవమానకరమైనమాటకు బదులివ్వడమనేది—ఎంతో తెలివిగా మాట్లాడినట్లు కనిపించినా కూడా—కేవలం అగ్నికి ఆజ్యం పోసినట్లుంటుందే తప్ప, సాధించగల్గేది మరేమీ లేదు. అది మరింత ఎగతాళిని ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది” అన్న జ్ఞాపికను అందుకే ఎంతో ప్రశంసిస్తున్నాను. బదులు తీర్చుకుంటున్నట్లు అనిపించని రీతిలో ప్రత్యుత్తరమిచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆ విధంగా చేయడంలో కొనసాగవలసిన అవసరముందని ఈ జ్ఞాపిక నన్ను ఒప్పించింది.
ఎ.ఎఫ్., అమెరికా
దీర్ఘకాలం జీవించండి “దీర్ఘకాలం జీవించడమూ, ఆరోగ్యంగా ఉండడమూ ఎలాగంటే” (సెప్టెంబరు 8, 1999) అనే చక్కని పరంపరకు ప్రతిస్పందించకుండా ఉండలేకపోతున్నాను. సగటు జీవిత కాలానికీ, సంభవనీయ జీవితకాలానికి గల తేడాను గురించిన వివరణ నాకు అర్థమయ్యే రీతిలో ఈ శీర్షికలో ఇవ్వబడింది. వార్ధక్యం వల్ల వచ్చే బాధలను ఎలా నియంత్రించవచ్చన్నదానిపై ఇచ్చిన చక్కని సలహాలు మంచి జ్ఞాపికలుగా ఉన్నాయి. తనపై తాను జాలిపడుతున్న 88 ఏండ్ల మా తాతగారికి సహాయపడేందుకు నేను మీ సలహాలను లౌక్యంగా ఉపయోగిస్తాను.
టి.ఎన్., అమెరికా
వినే కుక్క “నా కుక్క నా కోసం వింటుంది !” (ఆగస్టు 8, 1999) అనే శీర్షికకు నా కృతజ్ఞతలు. సరిగా వినబడనివారు ఎదుర్కునే జటిలమైన సమస్యలను తెలుసుకోవడం, వారితో మరింత అవగాహనతో ప్రతిస్పందించేందుకు నాకు సహాయపడింది. నేను కూడా కుక్కలను ప్రేమిస్తాను. కుక్కలు చాలా మందికి ఎలా సహాయపడగలవో తెలుసుకుని సంతోషిస్తున్నాను.
ఎల్. బి., ఇటలీ
సహాయపడే ఒక కుక్క నాకు కూడా ఉంది. నా వెన్నుపూస అరిగిపోయింది కనుకా నాకు ఫైబ్రోమ్యాల్జియా కూడా ఉంది కనుకా నేను ఎక్కువగా వీల్ చెయిర్లోనే ఉంటాను. నా కుక్క నా కోసం చేసి పెట్టే పనులను గురించి చెప్పడానికి మాటలు చాలవు. నేను షాపుకు వెళ్ళినప్పుడూ, నేను ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడూ నా కుక్క నాకు సహాయం చేస్తుంది. నేను క్రైస్తవ పరిచర్యలో ఉన్నప్పుడు నా బ్యాగ్ పట్టుకుంటుంది.
కె. డబ్ల్యు., అమెరికా