ఎల్ నీన్యో—అంటే ఏమిటి?
ఎల్ నీన్యో—అంటే ఏమిటి?
పెరూలోని లీమాకు సమీపంగా ఉన్న ఆపరీమక్ నది సాధారణంగా ఎండిపోయివుంటుంది. కానీ ఒకసారి దానికి వరదలు వచ్చి కార్మెన్‌కి ఉన్నదంతా కొట్టుకుపోయినప్పుడు, ఆమె విలపిస్తూ ఇలా అంది: “మాలో ఎంతోమందికి ఇలా జరిగింది, ఎంతోమందికి. నేనొక్కదాన్నే కాదు.” ఇక్కణ్ణుంచి దూరాన ఉత్తరం వైపుకి వెళ్తే, తీరప్రాంతంలో ఉన్న సేచూరా ఎడారి కుండపోతగా వర్షాలు కురవడంతో అది కొంతకాలంపాటు పెరూలోనే రెండవ పెద్ద సరస్సుగా మారిపోయింది. ఆ సరస్సు విస్తీర్ణం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు. భూగోళం అంతటా రికార్డు లెవల్లో వరదలు, భయంకరమైన తుపానులు, తీవ్రమైన అనావృష్టి వంటివి ఏర్పడటంతో కరవులు, మహమ్మారులు, పెద్ద ఎత్తున దావానలాలు సంభవించాయి. పంటలకు, ఆస్తులకు, పర్యావరణానికీ తీరని నష్టాలు జరిగాయి. వీటన్నింటికీ కారణం ఏమిటి? చాలామంది దీనికంతటికీ ఎల్ నీన్యోను నిందిస్తారు. ఇది 1997వ సంవత్సరం చివర్లో, ఉష్ణమండలప్రాంతంలోని అంటే భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహా సముద్రంలో అభివృద్ధిచెంది దాదాపు ఎనిమిది నెలలపాటు కొనసాగింది.
అసలు ఈ ఎల్ నీన్యో అంటే ఏమిటి? అదెలా అభివృద్ధి చెందుతుంది? దాని ప్రభావాలు ఇంత విస్తార పరిధిలో ఎందుకు కనబడుతున్నాయి? అది మళ్ళీ ఎప్పుడు సంభవిస్తుందో కచ్చితంగా చెప్పగలమా, తద్వారా ప్రాణనష్టాన్నీ ఆస్తినష్టాన్నీ తగ్గించగలమా?
జలాల ఉష్ణోగ్రతలో పెరుగుదలతో దీని ప్రారంభం
“కచ్చితంగా చెప్పాలంటే ఎల్ నీన్యో అనేది, రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి పెరూ దేశపు తీరానికి దగ్గర్లోని సముద్రజలాల్లో కన్పించే వెచ్చని నీటి ప్రవాహమే” అని న్యూస్‌వీక్ పత్రిక చెబుతుంది. దాదాపు వంద సంవత్సరాల నుంచి పెరూ తీరప్రాంతంలోని నావికులు సముద్రజలాలు ఈ విధంగా వెచ్చబడటం గమనిస్తూనే ఉన్నారు. ఈ వెచ్చని నీటి ప్రవాహాలు సాధారణంగా క్రిస్మస్ సమయంలో ప్రారంభమౌతుండటం మూలంగా వారు దీన్ని ఎల్ నీన్యో అని నామకరణం చేశారు, స్పానిష్ భాషలో శిశువైన యేసు అని దానర్థం.
పెరూ తీరంలోని జలాలు వెచ్చబడటం అంటే ఆ దేశానికి అధిక వర్షాలనే అర్థం. ఈ వర్షాల మూలంగా ఎడారుల్లో పూలు పూస్తాయి, పశువులు సంఖ్యాపరంగా వర్ధిల్లుతాయి. భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతంలో వరదలు కూడా వస్తాయి. అంతేగాక సముద్రజలాల్లో, పైనున్న వెచ్చని నీళ్ళు క్రింద పోషకాలతో నిండివున్న చల్లని నీళ్ళు పైకి రాకుండా అడ్డుకుంటాయి. దీంతో అనేకమైన జలచరాలూ అలాగే కొన్ని పక్షులు కూడా ఆహారాన్ని వెదుకుతూ వలసపోతుంటాయి. తత్ఫలితంగా ఎల్ నీన్యో ప్రభావాలు పెరూ తీరంలో మాత్రమే కాక ఎంతో దూరప్రాంతాల్లో కూడా కన్పిస్తుంటాయి. *
గాలీ నీరూ కారణాలు
పెరూ తీరానికి దగ్గర్లోని సముద్రజలాల ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదలకు * పశ్చిమాన ఇండోనేషియా ఆస్ట్రేలియాల దగ్గరున్న పైపై సముద్రజలాలు సూర్యరశ్మి మూలంగా వెచ్చబడతాయి, అలా వెచ్చని తేమగాలి వాతావరణంలోకి లేచి నీటి ఉపరితలం దగ్గర అల్పపీడనాన్ని సృష్టిస్తుంది. పైకి లేచిన గాలి నెమ్మదిగా చల్లబడి దాన్లోని చెమ్మని వర్ష రూపంలో విడుస్తుంది. తర్వాత తేమలేని ఈ గాలి పైభాగంలోని గాలులచే తూర్పు దిశలోకి కొట్టుకునిపోతుంది. అది తూర్పుదిశలోకి ప్రయాణిస్తుండగా నెమ్మదిగా చల్లబడి బరువును సంతరించుకుని పెరూ ఈక్వెడార్ దేశాలు చేరుకునేసరికి క్రిందికి దిగనారంభిస్తుంది. దీని మూలంగా సముద్రోపరితలంపై అధిక పీడనం ఏర్పడుతుంది. అలా, సముద్ర మట్టానికి కాస్త దిగువన ఉన్న ప్రాంతాల్లో వ్యాపార పవనాలు అని పిలువబడే గాలులు తిరిగి పడమరకు ఇండోనేషియా వైపుకు ప్రయాణిస్తాయి. ఈ విధంగా ఒక చక్రం పూర్తవుతుంది.
కారణాలేమిటి? దీన్నర్థం చేసుకోవడానికి, ముందు వాకర్ సర్క్యులేషన్ అనే పేరుగల ఒక పెద్ద చక్రప్రవాహాన్ని పరిశీలించండి. ఇది ఉష్ణమండలప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రానికి తూర్పు పడమరల మధ్యనున్న వాతావరణంలో ఏర్పడుతుంది.ఉష్ణమండలప్రాంతంలోని పసిఫిక్ జలాల ఉపరితల ఉష్ణోగ్రతపై వ్యాపార పవనాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి. “సాధారణంగా ఈ గాలులు ఒక చిన్న చెరువు మీద వీచే పిల్లగాలుల్లా ప్రవర్తిస్తాయి. ఇవి నెమ్మదిగా వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్ ప్రాంతానికి తరలిస్తాయి. దీంతో ఈక్వెడార్ వద్దనున్న జలాల కన్నా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని జలాల మట్టం రెండు అడుగుల ఎత్తు ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈక్వెడార్ దగ్గరకన్నా అక్కడి జలాల్లో 8 డిగ్రీల సెల్షియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది” అని న్యూస్‌వీక్ చెబుతుంది. ఇటు తూర్పు పసిఫిక్ ప్రాంతంలో పోషకాలతో నిండివున్న చల్లని జలాలు పైకివచ్చి జలచరాలు వృద్ధయ్యేలా చేస్తాయి. ఆ విధంగా, మామూలు సంవత్సరాల్లో, అంటే ఎల్ నీన్యో లేని సంవత్సరాల్లో సముద్రోపరితల ఉష్ణోగ్రత పశ్చిమ పసిఫిక్‌కన్నా తూర్పున తక్కువగా ఉంటుంది.
అయితే మరి, వాతావరణంలోని ఎటువంటి మార్పుల మూలంగా ఎల్ నీన్యో సంభవిస్తుంది? “ప్రతి కొన్ని సంవత్సరాలకొకసారి వ్యాపార పవనాలు తగ్గిపోతుంటాయి, చివరికి పూర్తిగా లేకుండానే పోతాయి, దీనిక్కారణమేమిటో వైజ్ఞానికులకు ఇప్పటికీ అంతు చిక్కడంలేదు” అని నేషనల్ జియోగ్రఫిక్ తెలియజేస్తుంది. ఈ గాలులు తగ్గుతూవుండగా ఇండోనేషియా దగ్గర్లో చేరిన వెచ్చని నీళ్ళన్నీ తిరిగి తూర్పుకు ప్రవహిస్తాయి. దీనితో తూర్పున ఉన్న పెరూలోను, మరితర ప్రాంతాల్లోను సముద్రోపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ నీటి కదలిక వాతావరణ వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపుతుంది.
“ఉష్ణమండలప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు తూర్పువైపున వేడెక్కడం మూలంగా వాకర్ సర్క్యులేషన్ బలహీనమౌతుంది, దాంతో సంవహన వర్షాలు పశ్చిమం నుండి తూర్పు పసిఫిక్ వైపుకి మరలుతాయి” అని ఒక సమాచార మూలం చెబుతుంది. ఆ విధంగా భూమధ్య రేఖ వద్దనున్న పసిఫిక్ ప్రాంతంలోని వాతావరణ వ్యవస్థలు ప్రభావానికి గురౌతాయి.వాగు మధ్యలో పెద్ద రాయిలా
ఎల్ నీన్యో ఉష్ణమండల పసిఫిక్ జలాలకు ఎంతో దూరాల్లో ఉన్న వాతావరణ వ్యవస్థల్ని కూడా మార్చగలదు. అదెలా? వాతావరణంలోని వాయుమండల చక్రాన్ని ఉపయోగించుకోవడం ద్వారా. వాయుమండలంలో ఒకచోట ఏర్పడిన అలజడి ఎంతో దూరాన కూడా ప్రభావాల్ని చూపిస్తుంది, దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక వాగు మధ్యలోని పెద్ద రాయి, దాని చుట్టూ అలల్ని సృష్టించడంతో పోల్చవచ్చు. అలాగే, వెచ్చని సముద్రజలాల నుండి పెద్ద పెద్ద మేఘాలు పైకి లేస్తూ, వాయుమండలంలో ఆ రాయిలా అడ్డంకిని కలిగిస్తాయి. ఇది వేలాది కిలోమీటర్ల అవతల ఉన్న వాతావరణ వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేస్తుంది.
భూమధ్యరేఖకు బాగా ఎగువన, తూర్పుకు వేగంగా వీస్తున్న గాలులకు ఎల్ నీన్యో బలాన్ని చేకూర్చి వాటికి స్థానభ్రంశాన్ని కలిగిస్తుంది. ఈ గాలుల్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. ఈ ప్రాంతంలో ఏర్పడే దాదాపు అన్ని తుపాను వ్యవస్థల్నీ ఈ జెట్ స్ట్రీమ్స్ నిర్దేశిస్తుంటాయి. జెట్ స్ట్రీమ్స్‌కి బలం చేకూరడం, అవి స్థానభ్రంశం చెందడం మూలంగా రుతువుల తీవ్రతపై కూడా అనుకూల ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లోని ఉత్తర రాష్ట్రాల్లో ఎల్ నీన్యో ఏర్పడిన సంవత్సరాల్లోని శీతాకాలాలు మామూలుకన్నా వెచ్చగా ఉంటాయి, కానీ కొన్ని దక్షిణ రాష్ట్రాల్లో మరీ తడిగా చలిగా ఉంటాయి.
ముందే ఎంతమాత్రం ఊహించగలం?
సాధారణంగా తుపానుల్ని కొద్ది రోజుల ముందు మాత్రమే సూచించడం సాధ్యమౌతుంది. ఎల్ నీన్యో సంభవించినప్పుడు కూడా అదే పరిస్థితా? లేదు. ఎల్ నీన్యో విషయంలో, వాతావరణ వ్యవస్థల్లోని స్వల్పకాలిక మార్పుల్ని కాదు గానీ, ఒకేసారి కొన్ని నెలలపాటు పెద్ద పెద్ద ప్రాంతాల్లో అసాధారణ మార్పులు సంభవించటాన్ని ముందే ఊహించడం ఇమిడివుంటుంది. వాతావరణ పరిశోధకులు ఎల్ నీన్యోకి సంబంధించిన వాతావరణ సూచనలివ్వడంలో మంచి విజయాన్ని సాధించారు.
ఉదాహరణకు, 1997-98 కొరకైన ఎల్ నీన్యో వాతావరణ సూచన 1997 మేలో వెలువడింది—అంటే అది ప్రారంభం కావడానికి ఆరు నెలల ముందేనన్నమాట. నీటి ఉపరితలంపైని స్థితినీ, 500 మీటర్ల లోతున ఉష్ణోగ్రతనూ కొలుస్తూ ఉండేందుకు 70 ఉపకరణాలు ఉష్ణమండలప్రాంతంలోని పసిఫిక్‌లో ఇప్పుడు తేలుతూవున్నాయి. ఇవి పంపించే దత్తాంశాల్ని కంప్యూటర్లలోనికి ఫీడ్ చేసినప్పుడు అవి వాతావరణ సూచనలు చేయగల్గుతాయి.
ఎల్ నీన్యోకు సంబంధించిన హెచ్చరికల్ని చాలా ముందే చేసినట్లైతే రానున్న మార్పులకు అనుగుణంగా సిద్ధపడివుండేందుకు సహాయం లభిస్తుంది. ఇందుకు ఉదాహరణగా, ఎల్ నీన్యో వాతావరణ సూచనల ఆధారంగా పెరూలో 1983 నుంచి, ఎక్కువ వర్షాపాత పరిస్థితులకు అనుకూలంగా ఉండే పశువుల్ని పెంచమనీ పంటల్ని వేయమనీ వ్యవసాయదారులు ప్రోత్సహించబడ్డారు. అలాగే మత్స్యకారులు చేపల్ని పట్టడానికి బదులుగా వెచ్చని జలాల్లో లభించే రొయ్యల్ని పట్టడం ప్రారంభించారు. అవును, కచ్చితమైన వాతావరణ సూచనలు అలాగే సంసిద్ధతల ద్వారా ఎల్ నీన్యో తీసుకువచ్చే ప్రాణ ఆస్తి నష్టాల్ని తగ్గించవచ్చు.
మన భూమి వాతావరణాన్ని నియంత్రించే ప్రక్రియల్ని వైజ్ఞానికంగా పరిశోధిస్తుండగా, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను దాదాపు 3,000 సంవత్సరాల క్రితం వ్రాసిన దైవప్రేరేపిత మాటలు ఎంత కచ్చితమైనవో రూఢి అవుతుంది. ఆయనిలా వ్రాశాడు: “గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.” (ప్రసంగి 1:6) గాలిని, సముద్రజలాల ప్రవాహాలను అధ్యయనం చేయడం ద్వారా ఆధునిక మానవుడు వాతావరణ వ్యవస్థల గురించి ఎంతో తెలుసుకున్నాడు. ఎల్ నీన్యోలాంటి విపత్కర పరిస్థితుల గురించిన హెచ్చరికలకు అవధానం ఇవ్వడం ద్వారా మనమా జ్ఞానం నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు.
[అధస్సూచీలు]
^ దీనికి భిన్నంగా, దక్షిణ అమెరికా ఖండపు పశ్చిమ తీరంలో సముద్రజలాలు అప్పుడప్పుడు చల్లబడటాన్ని లా నీన్యా (దీనికి స్పానిష్‌లో “చిన్న పిల్ల” అని అర్థం) అని పిలుస్తారు. లా నీన్యా కూడా వాతావరణంపై చాలా పెద్ద ప్రభావాల్నే చూపుతుంది.
^ ఈ చక్రానికి, 1920లలో ఈ ప్రక్రియను అధ్యయనం చేసిన బ్రిటీష్ వైజ్ఞానికుడైన సర్ గిల్బర్ట్ వాకర్ పేరు మీదుగా నామకరణం చేయబడింది.
[27వ పేజీలోని బాక్సు]
ఎల్ నీన్యో వినాశకర చరిత్ర
◼ 1525: పెరూలో ఎల్ నీన్యో సంభవించిన తొలి చారిత్రక నివేదిక.
◼ 1789-93: ఇండియాలో 6,00,000కుపైగా మరణాలకూ, దక్షిణ ఆఫ్రికా ఖండంలో తీవ్రమైన కరవుకూ ఎల్ నీన్యో కారణం.
◼ 1982-83: ఈ సంవత్సరాల్లో ఎల్ నీన్యో మూలంగా 2,000 మంది చనిపోయారు, 13 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం, ఎక్కువగా ఉష్ణమండలప్రాంతాల్లోనే.
◼ 1990-95: చరిత్రలో అతి దీర్ఘకాలంపాటు వరుసగా మూడుసార్లు ఎల్ నీన్యో సంభవించింది.
◼ 1997-98: వరదలు, కరవుల రూపంలో ఎల్ నీన్యో సంభవిస్తుందన్న సూచనలు విజయవంతంగా చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,100 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టాలు 33 బిలియన్ డాలర్లని అంచనా వేశారు.
[24, 25వ పేజీలోని డయాగ్రామ్‌లు/మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సాధారణం
వాకర్ సర్క్యులేషన్ విధానం
బలమైన వ్యాపార పవనాలు
వెచ్చని సముద్రజలాలు
చల్లని సముద్రజలాలు
ఎల్ నీన్యో
జెట్ స్ట్రీమ్ మార్గం మారుతుంది
బలహీన వ్యాపార పవనాలు
వెచ్చని సముద్రజలాలు తూర్పుదిశలోకి ప్రయాణిస్తున్నాయి
మామూలుకన్నా ఎక్కువ వేడి లేదా పొడి
మామూలుకన్నా ఎక్కువ చల్లదనం లేదా వర్షాలు
[26వ పేజీలోని డయాగ్రామ్‌లు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఎల్ నీన్యో
పైనున్న భూగోళంపై ఎర్రని రంగు, సముద్రజలాలు మామూలుకన్నా ఎంతో ఎక్కువ వేడిగా ఉండటాన్ని సూచిస్తుంది
సాధారణం
వెచ్చని నీళ్ళు పశ్చిమ పసిఫిక్ ప్రాంతానికి చేరతాయి, అలా పోషకాలతో నిండివున్న చల్లనినీరు తూర్పున పైకివస్తుంది
ఎల్ నీన్యో
బలహీన వ్యాపార పవనాల మూలంగా వెచ్చని నీళ్ళు మళ్ళీ తూర్పుకు చేరతాయి, దాంతో చల్లనినీరు పైకిరాదు
[24, 25వ పేజీలోని చిత్రం]
పెరూ
వరదల్లో మునిగిన సెచూరా ఎడారి
మెక్సికో
లిండా తుపాను
కాలిఫోర్నియా
బురదమట్టి ప్రవాహం
[చిత్రసౌజన్యం]
24-5 పేజీలు ఎడమ నుండి కుడికి: Fotografía por Beatrice Velarde; Image produced by Laboratory for Atmospheres, NASA Goddard Space Flight Center; FEMA photo by Dave Gatley