పత్రిక ముఖ్యాంశం | బైబిల్ని నిజంగా దేవుడే ఇచ్చాడా?
బైబిల్ని నిజంగా దేవుడే “ప్రేరేపించాడా?”
బైబిలు దేవుని నుండి వచ్చిందని మీరు నమ్ముతారా? లేదా ఇందులో కేవలం మనుషుల ఆలోచనలే ఉన్నాయని మీకు అనిపిస్తుందా?
క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ల మధ్య కూడా ఈ ప్రశ్నల గురించి ఎప్పుడూ బహిరంగంగా చర్చలు జరుగుతుంటాయి. ఉదాహరణకు, అమెరికాలో 2014లో చేసిన గాలప్ సర్వే ప్రకారం చాలామంది నామకార్థ క్రైస్తవులు “బైబిల్‌కు దేవునితో ఏదో ఒక విధంగా సంబంధం ఉందని” ఒప్పుకున్నారు. కానీ ప్రతీ ఐదుగురిలో ఒకరు, బైబిలు “మనుషులు రాసిన పాత నీతి కథలు, పురాణాలు, చరిత్ర, నీతి సూక్తులు” ఉన్న పుస్తకం అని నమ్ముతారు. అందుకే, “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు” అని బైబిల్లో ఉన్నప్పటికీ బైబిలు ఎలా వచ్చింది అనే విషయంలో ప్రజల్లో గందరగోళం ఉంది. కాబట్టి మొదటిగా “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు” అనే మాటలకు అర్థం ఏమిటో తెలుసుకుందాం.—2 తిమోతి 3:16.
“దేవుడు ప్రేరేపించాడు” అంటే ఏమిటి?
అరవై ఆరు చిన్న పుస్తకాలు కలిపితే బైబిలు వచ్చింది, దీన్ని 40 మంది రాశారు, రాయడానికి దాదాపు 1,600 సంవత్సరాలు పట్టింది. మరి బైబిల్ని మనుషులు రాసినప్పుడు, “దేవుడు ప్రేరేపించాడు” అని ఎలా చెప్పవచ్చు? “దేవుడు ప్రేరేపించాడు” అంటే ఆ సమాచారానికి మూలం దేవుడు అని అర్థం. ఈ విషయం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “పవిత్రశక్తి ప్రేరణతో మనుషులు దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.” (2 పేతురు 1:21) మరో మాటలో చెప్పాలంటే కంటికి కనిపించని తన బలమైన శక్తిని అంటే పవిత్రశక్తిని ఉపయోగించి దేవుడు తన సందేశాలను బైబిల్ని రాసిన వాళ్లకు తెలిపాడు. ఇది ఒక వ్యాపారస్థుడు తన సెక్రెటరీతో లెటర్ రాయించడం లాంటిది. ఆ లెటర్‌లో విషయాలు, రాసే వాళ్లవి కాదుగానీ చెప్పే వాళ్లవే.
కొంతమంది బైబిలు రచయితలు దేవుని దూతలు చెప్తుంటే విని బైబిల్లో ఉన్న విషయాలు రాశారు. ఇంకొందరు దేవుని నుండి వచ్చిన దర్శనాలు చూశారు లేదా దేవుడు వాళ్లకు ఆ సమాచారాన్ని కలల్లో చెప్పాడు. అప్పుడప్పుడు దేవుడు తన సందేశాన్ని రచయితల సొంత మాటల్లో రాసేలా అనుమతించాడు, కానీ కొన్నిసార్లు ఏ మాటలు రాయాలో ఆయనే చెప్పాడు. ఎలా రాసినా మనుషులు దేవుని ఆలోచనలే రాశారు కానీ వాళ్ల సొంత ఆలోచనలు రాయలేదు.
బైబిలు రాసినవాళ్లను దేవుడే ప్రేరేపించాడని మనం ఎలా నమ్మవచ్చు? బైబిలు దేవుని నుండే వచ్చింది అని నమ్మడానికి మూడు రుజువులను ఇప్పుడు చూద్దాం.