ఇంటర్వ్యూ | రాజేష్ కలారియా
బ్రెయిన్ పాథాలజిస్ట్ తన నమ్మకాల గురించి చెప్పారు
ప్రొఫెసర్ రాజేష్ కలారియా, ఇంగ్లండ్‌లో న్యూ క్యాజిల్ యూనివర్సిటీలో మనిషి మెదడు మీద 40 సంవత్సరాల పైనే అధ్యయనం చేశారు. ఆయన పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. కానీ తర్వాత, ఆయన తన అభిప్రాయాల్ని మార్చుకున్నాడు. ఆయన పని గురించి, నమ్మకాల గురించి తేజరిల్లు! అడిగింది.
మీరు పెరిగిన మతం గురించి దయచేసి మాకు చెప్పండి.
మా నాన్న ఇండియాలో పుట్టారు, మా అమ్మకు భారతీయ నేపథ్యం ఉంది కానీ ఆమె యుగాండాలో పుట్టింది. వాళ్ల జీవితం ఎక్కువగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉండేది. ముగ్గురు పిల్లల్లో నేను రెండవ వాడిని. మేము కెన్యాలోని నైరోబిలో ఉండేవాళ్లం. మాకు దగ్గర్లో చాలామంది హిందువులు ఉండేవాళ్లు.
సైన్స్ మీద మీ ఆసక్తి పెరగడానికి కారణం ఏంటి?
నాకు ఎప్పుడూ జంతువులు అంటే ఇష్టం, నేను ఎక్కువగా నా ఫ్రెండ్స్‌తో కలిసి అద్భుతమైన వన్యప్రాణుల్ని చూడడానికి అరణ్య ప్రాంతాలకు వెళ్తూ, అక్కడ క్యాంపింగ్ చేసే వాడిని. నేను మొదట్లో పశువుల డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. కానీ నైరోబిలో ఒక టెక్నికల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాక లండన్ యూనివర్సిటీలో పాథాలజీ చదవడానికి ఇంగ్లండ్ వెళ్లాను. తర్వాత నేను ముఖ్యంగా మనిషి మెదడు మీద పరిశోధన చేయడం మొదలుపెట్టాను.
మీ చదువు మీ మత నమ్మకాలపై ఏమైనా ప్రభావం చూపించిందా?
అవును. నేను సైన్స్ గురించి ఎక్కువ నేర్చుకుంటున్న కొద్దీ, హిందూ పురాణాలను, ఆచారాలను నమ్మడం కష్టంగా అనిపించింది. జంతువుల్ని, విగ్రహాల్ని ఆరాధించడం లాంటి విషయాలను నమ్మడం కష్టంగా అనిపించింది.
పరిణామ సిద్ధాంతాన్ని మీరు ఎందుకు అంగీకరించారు?
నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు దగ్గర్లో ఉన్న ప్రజలందరూ మనిషి పరిణామ ప్రక్రియ ఆఫ్రికాలో మొదలైంది అని నమ్మేవాళ్లు, స్కూల్లో కూడా మేము దీని గురించి ఎక్కువగా చర్చించుకునేవాళ్లం. టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా పెద్దపెద్ద శాస్త్రవేత్తలు అందరూ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారని మా విద్యార్థులందరికీ చెప్పేవాళ్లు.
కొంత కాలానికి జీవం ఎలా ఆరంభం అయ్యిందో మీరు మళ్లీ పరిశీలించారు. ఎందుకు?
నేను కొన్ని సంవత్సరాలుగా జీవశాస్త్రం, శరీర నిర్మాణశాస్త్రం చదువుతూ ఉన్నాను. అప్పుడు నా తోటి విద్యార్థి యెహోవాసాక్షుల
దగ్గర బైబిలు గురించి నేర్చుకుంటున్న విషయాలు నాకు చెప్పాడు. నాకు కూడా తెలుసుకోవాలని అనిపించింది. నైరోబిలో ఉన్న మా కాలేజీ హాలులో యెహోవాసాక్షుల అసెంబ్లీ జరిగినప్పుడు నేను దానికి వెళ్లాను. తర్వాత, ఇద్దరి మిషనరీ సాక్షులు వచ్చి నాకు కొన్ని బైబిలు బోధలను వివరించారు. జీవం గురించిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలిసిన గొప్ప రూపకర్తను వాళ్లు నమ్ముతారు. అది పురాణంలా అనిపించలేదు. దానిలో నిజం ఉందని నాకు అనిపించింది.వైద్యపరంగా మీకున్న జ్ఞానం మీరు సృష్టిని నమ్మకుండా చేసిందా?
నిజం చెప్పాలంటే, నేను శరీర నిర్మాణశాస్త్రం అధ్యయనం చేశాక, ప్రాణులు ఎంత చక్కగా తయారు చేయబడి, ఎంత సంశ్లిష్టంగా ఉన్నాయో గమనించాను. ఇంత గొప్పగా ఉన్నవాటిని కారణం లేకుండా, నిర్దేశం లేకుండా జరిగిన ప్రక్రియల వల్ల వచ్చాయనడం నాకు తెలివితక్కువతనం అనిపించింది.
మాకు ఒక ఉదాహరణ చెప్తారా?
నేను 1971 నుండి మనిషి మెదడు మీద అధ్యయనం చేస్తున్నాను, ఈ అద్భుతమైన అవయవం నన్ను ప్రతిసారి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆలోచనలకు, జ్ఞాపకాలకు ఇదే కేంద్రం. శరీరం చేసే చాలా పనులను ఇదే నియంత్రిస్తుంది. మెదడును గ్రహించే శక్తికి నిలయంగా చెప్పుకోవచ్చు, శరీరం బయట నుండి లోపలి నుండి వచ్చే సమాచారాన్ని గ్రహించేందుకు లేదా అర్థం చేసుకునేందుకు ఇది సహాయం చేస్తుంది.
సంశ్లిష్టమైన మూలపదార్థాల వల్ల, ప్రధానమైన మెదడు కణాలైన న్యూరాన్‌ల పెద్దపెద్ద నెట్‌వర్క్‌ల వల్ల మన బ్రెయిన్ ఇంత చక్కగా పని చేయగలుగుతుంది. మనిషి మెదడులో కొన్ని కోట్ల న్యూరాన్లు ఉంటాయి. అవి ఎక్సాన్లు లేదా అక్షతంతువులు అనే పొడవైన ఫైబర్ల ద్వారా ఒకదానికి ఒకటి సమాచారాన్ని పంపించుకుంటాయి. అయితే ఒక దాని నుండి ఒకటి సమాచారాన్ని తీసుకోవడానికి డైండ్రైట్స్ లేదా తంత్రికాక్షికలు అనే ఫైబర్లను ఉపయోగించుకుంటాయి. ప్రతీ న్యూరాన్ ఇతర న్యూరాన్లతో వేల కనెక్షన్లు ఏర్పర్చుకోవడానికి కొమ్మలు కొమ్మలుగా ఉన్న డైండ్రైట్స్ సహాయం చేస్తాయి. దానివల్ల మన బ్రెయిన్లో ఉన్న కనెక్షన్లు నక్షత్రాల్లా లెక్కపెట్టలేనంత ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, దట్టమైన అడవిలా ఉన్న ఈ న్యూరాన్లు, డెండ్రైట్లు గజిబిజిగా ఉండవు కాని చాలా క్రమపద్ధతిలో ఉంటాయి. ఇది ఎంతో అద్భుతమైన “వైరింగ్.”
దయచేసి వివరించండి.
బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్నప్పుడు, పుట్టిన తర్వాత కూడా ఈ వైరింగ్ ఒక క్రమపద్ధతిలో ఏర్పడుతూ ఉంటుంది. న్యూరాన్లు కొన్ని సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఇతర న్యూరాన్లకు ఫైబర్లను పంపిస్తాయి. అంత చిన్న పరిమాణం ఉన్న కణాలకు అది చాలా దూరం. అంతేకాదు ఆ ఫైబర్, కేవలం ఒక కణాన్ని మాత్రమే కాదు ఆ కణంలో ఒక నిర్దిష్ట భాగాన్ని చేరగలుగుతుంది.
న్యూరాన్ల నుండి ఒక కొత్త ఫైబర్ బయటకు వచ్చినప్పుడు, అది రసాయన సైన్‌పోస్ట్‌లు లేదా గుర్తుల ద్వారా నిర్దేశించబడుతుంది. ఆ గుర్తులు ఫైబర్లకు “ఆగు,” “వెళ్లు,” “పక్కకు తిరుగు” లాంటి సూచనలను ఇస్తాయి. పెరుగుతున్న ఫైబర్లకు స్పష్టమైన సూచనలు లేకపోతే త్వరగా తప్పిపోతాయి. ఈ ప్రక్రియ అంతా చాలా తెలివిగా ఏర్పాటు చేయబడింది. ఎంతో ముందుగానే మన DNAలో ఉన్న స్పష్టమైన నిర్దేశాల్లో ఈ ప్రక్రియ మొదలు అవుతుంది.
కానీ మన బ్రెయిన్ ఎలా ఎదుగుతుందో, ఎలా పనిచేస్తుందో ఇంకా మనకు పూర్తిగా తెలీదు. అంటే విషయాలను మన బ్రెయిన్ ఎలా జ్ఞాపకం ఉంచుకుంటుంది, బ్రెయిన్లో భావాలు-ఆలోచనలు ఎలా పుడతాయి అనేది మనకు పూర్తిగా తెలీదు. మన బ్రెయిన్ పని చేయడమే నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా, బ్రెయిన్ ఎంత బాగా పని చేస్తుంది, ఎంత చక్కగా ఎదుగుతుంది అనే విషయాల గురించి ఆలోచించినప్పుడు, మనకన్నా ఎంతో తెలివైన ఒక మెదడు దీని వెనుక ఉన్నట్లు నాకు అనిపిస్తుంది.
మీరు ఒక యెహోవాసాక్షి ఎందుకు అయ్యారు?
బైబిలు దేవుని వాక్యమని యెహోవాసాక్షులు నాకు రుజువులు చూపించారు. ఉదాహరణకు, బైబిలు ఒక సైన్స్ పుస్తకం కాకపోయినా, సైన్స్ విషయాలు చెప్తున్నప్పుడు అది చాలా ఖచ్చితమైన వివరాలు చెప్పింది. ఇందులో చాలా ఖచ్చితమైన ప్రవచనాలు ఉన్నాయి. బైబిలు బోధలు పాటించిన వాళ్ల జీవితాలు మెరుగుపడతాయి అనడానికి రుజువులు ఇస్తుంది. దీనికి నా జీవితమే ఒక ఉదాహరణ. నేను 1973లో యెహోవాసాక్షిని అయినప్పటి నుండి బైబిలే నా జీవితాన్ని నడిపిస్తుంది. దానివల్ల, నా జీవితం ఇప్పుడు మరింత సంతృప్తిగా, అర్థవంతంగా ఉంది.