కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తప్పు చేయాలనే ప్రలోభం

తప్పు చేయాలనే ప్రలోభం

తప్పు చేయాలనే ప్రలోభం

భార్యాభర్తలు విడిపోవడం, ఆరోగ్యం పాడవడం, మనస్సాక్షి బాధించడం—ఇలాంటివన్నీ తప్పు చేయాలనే ప్రలోభానికి లొంగిపోవడం వల్ల వచ్చే పర్యవసానాల్లో కొన్ని మాత్రమే. వీటిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

ప్రలోభం అంటే ఏంటి?

మీరు దేనికైనా, ముఖ్యంగా ఏదైనా చెడు విషయానికి ఆకర్షితులు అవుతుంటే మీరు ప్రలోభానికి గురి అవుతున్నట్లు. ఎలా అంటే, మీరు షాపింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా మంచి వస్తువు చూశారు. మీరు దొరికిపోకుండా ఈజీగా దొంగతనం చేయవచ్చు అనే ఆలోచన వెంటనే మీ మైండ్‌లోకి రావచ్చు. కానీ మీ మనస్సాక్షి ఒద్దు అంటుంది. కాబట్టి మీరు వెంటనే ఆ ఆలోచన మానేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. అక్కడితో మీకు వచ్చిన ప్రలోభం ఆగిపోయింది, మీరు దాని మీద గెలిచారు.

బైబిలు ఏమి చెప్తుంది

 

తప్పు చేయాలనే ఆలోచన వచ్చినంత మాత్రాన మీరు చెడ్డవాళ్లు అయిపోరు. తప్పు చేయాలనే ఆలోచనలు మనందరికీ వస్తాయని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 10:13) కానీ తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనం ఏమి చేస్తాం అనేది ముఖ్యం. కొంతమంది ఆ చెడు ఆలోచన గురించే ఆలోచిస్తూ ఎప్పుడో ఒకప్పుడు దానికి లొంగిపోతారు. ఇంకొంతమంది అది తప్పు అని వెంటనే దాని గురించి ఆలోచించడం మానేస్తారు.

“కానీ ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, ప్రలోభపెట్టి పరీక్షకు గురిచేస్తుంది.”—యాకోబు 1:14.

తప్పు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే స్పందించడం ఎందుకు తెలివైన పని?

తప్పు చేయడానికి నడిపించే వాటిలో ఒకొక్కదాన్ని బైబిలు బయట పెడుతుంది. యాకోబు 1:15⁠లో ఇలా ఉంది: “తర్వాత ఆ కోరిక వృద్ధి చెంది పాపాన్ని కంటుంది.” మనం చెడు కోరిక గురించే ఆలోచించాం అనుకోండి, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించడం తప్పనట్లు మనకు కూడా ఆ చెడు కోరిక ప్రకారం ప్రవర్తించే పరిస్థితి తప్పదు. కానీ మనం ఆ చెడ్డ కోరికలకు లొంగిపోకుండా ఉండవచ్చు. మనం వాటిని ఓడించవచ్చు.

బైబిలు ఎలా సహాయం చేస్తుంది

 

ఎలా అయితే మన మనసు చెడు కోరికలను పెంచగలదో అలాగే వాటిని బయట కూడా పడేయగలదు. ఎలా? వేరే విషయాల మీదకు మనసు మళ్లించడం ద్వారా. అంటే ఏదైన పని చేసుకోవడమో, ఒక ఫ్రెండ్‌తో మాట్లాడడమో లేదా మంచి విషయాల గురించి ఆలోచించడమో చేయవచ్చు. (ఫిలిప్పీయులు 4:8) తప్పు చేయడం వల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించడం కూడా మంచిదే. భావోద్వేగపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏ హాని జరుగుతుందో ఆలోచించాలి. (ద్వితీయోపదేశకాండము 32:29) ప్రార్థన కూడా చాలా సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.”—మత్తయి 26:41.

“మోసపోకండి, దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు.” —గలతీయులు 6:7.

తప్పు చేయకుండా ఉండే శక్తి మీలో ఎలా పెంచుకోవచ్చు?

వాస్తవం

 

ప్రలోభం అంటే ఒక ఎర, ఒక ఉచ్చు లాంటిది. అది తెలివితక్కువ వాళ్లని, మూర్ఖుల్ని లేదా జాగ్రత్తగా లేని వాళ్లని ప్రమాదంలో పడేస్తుంది. (యాకోబు 1:14, అధస్సూచి) ముఖ్యంగా భయంకరమైన పర్యవసానాలు తెచ్చే లైంగిక పాపాలకు సంబంధించిన ప్రలోభాల విషయంలో ఇది చాలా నిజం.—సామెతలు 7:22, 23.

బైబిలు ఎలా సహాయం చేస్తుంది

 

“నీ కుడి కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమౌతుంటే, దాన్ని పీకేసి నీ నుండి దూరంగా పడేయి” అని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 5:29) నిజంగా కన్ను పీకేసుకోమని యేసు చెప్పడం లేదు. కానీ మనం దేవున్ని సంతోషపెడుతూ శాశ్వతంగా జీవించాలని అనుకుంటే మాత్రం తప్పు చేసే విషయంలో మనం మన శరీర అవయవాలను అణచివేయాలి. (కొలొస్సయులు 3:5) అంటే ప్రలోభం నుండి బయట పడాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని ఒక నమ్మకమైన దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు.—కీర్తన 119:37.

నిజమే ఆత్మనిగ్రహం లేదా సెల్ఫ్‌ కంట్రోల్‌ చూపించడం చాలా కష్టం. ఎందుకంటే ‘శరీరం బలహీనం.’ (మత్తయి 26:41) అందుకే మనమందరం తప్పులు చేస్తాం. కానీ మనం నిజంగా తప్పుల విషయంలో బాధపడి, వాటిని అలవాటుగా చేయకుండా ఉండాలని కష్టపడి ప్రయత్నించాలి. అప్పుడు మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మన మీద దయాదాక్షిణ్యాలు చూపిస్తాడు. (కీర్తన 103:8) అది ఎంత ఓదార్పును ఇస్తుందో కదా.

“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” —కీర్తన 130:3.