మన భూమికి ఏమౌతుంది?
సముద్రాలు
సముద్రాల వల్ల మనకేంటి ఉపయోగం అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం తినే చాలారకాల ఆహారం, మందుల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు, ప్రపంచంలోని ఆక్సిజన్‌లో 50 కన్నా ఎక్కువ శాతం ఆక్సిజన్ ఇవన్నీ సముద్రాల నుండే వస్తున్నాయి. మనుషులు చేసే రకరకాల పనుల వల్ల ఉత్పత్తి అయ్యే కార్బన్ వాయువుల్ని సముద్రాలే పీల్చుకుంటున్నాయి. పైగా వాతావరణాన్ని కూడా సముద్రాలే నియంత్రిస్తున్నాయి.
సముద్రాలకు పొంచివున్న ముప్పు
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పగడపు దిబ్బలు, చేపలు, అలాగే ఇతర సముద్ర జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. సుమారు 25 శాతం సముద్ర జీవులు ఆహారం కోసం పగడపు దిబ్బలపైనే ఆధారపడతాయి. అయితే, మరో 30 ఏళ్లలో ఈ దిబ్బలన్నీ అంతరించిపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
ఆహారం కోసం సముద్రం మీద ఆధారపడే పక్షుల్లో దాదాపు 90 శాతం పక్షులు ప్లాస్టిక్‌ని తినేసివుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల, ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల సముద్ర జీవుల ప్రాణాలు నీటిలోనే కలిసిపోతున్నాయని కూడా అంటున్నారు.
“మనం సముద్రాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించామని, ఇప్పుడు వాటికి పెనుప్రమాదం పొంచివుందని” 2022లో UN సెక్రెటరీ జనరల్ ఆంటోన్యో గ్యూటేరెష్ అన్నాడు.
మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది
మనుషులు కలుషితం చేయకపోతే సముద్రాలు శుభ్రంగా, అందులోని జీవులు ఆరోగ్యంగా ఉంటాయి; ఎందుకంటే అలా ఉండేలా అవి తయారుచేయబడ్డాయి. “కనీసం ఇప్పుడైనా మనుషులు సముద్రాల్ని కలుషితం చేయడం ఆపగలిగితే, అవి వాటికవే శుభ్రం అయ్యి మళ్లీ జీవులతో కళకళలాడుతూ ఉంటాయి” అని రీజెనరేషన్: ఎండింగ్ ద క్లైమేట్ క్రైసిస్ ఇన్ వన్ జెనరేషన్ అనే పుస్తకం చెప్పింది. అదెలా జరుగుతుంది అనుకుంటున్నారా?
-
సముద్రాల్లో ఉండే ఫైటోప్లాంక్టన్ (ప్లవకాలు) అనే సూక్ష్మజీవులు భూమి ఉష్ణోగ్రత పెరగడానికి ముఖ్య కారణమైన కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుని నిల్వ చేసుకుంటాయి. చెట్లు, గడ్డి, భూమ్మీదున్న ఇతర మొక్కలన్నీ కలిసి ఎంత కార్బన్‌డైయాక్సైడ్‌ని నిల్వ చేస్తాయో దాదాపు అంత కార్బన్‌డైయాక్సైడ్‌ని ఒక్క ఫైటోప్లాంక్టన్‌లే నిల్వ చేస్తాయి.
-
బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు చేపల వ్యర్థాలను తిని సముద్రాలు కలుషితం అవ్వకుండా చేస్తాయి. ఈ సూక్ష్మజీవుల్ని ఇతర సముద్ర జీవులు తింటాయి. “ఈ చక్రం వల్ల సముద్రంలోని నీళ్లు కలుషితం అవ్వకుండా శుభ్రంగా ఉంటాయి” అని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ ఓషన్ పోర్టల్ వెబ్‌సైట్ వివరించింది.
-
చాలా సముద్ర జీవులు వాటి జీర్ణవ్యవస్థ ద్వారా సముద్ర నీటిలోని యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి, క్షార స్థాయిలను (ఆల్కలీన్) పెంచుతాయి. దానివల్ల పగడపు దిబ్బలు, రొయ్యలు, పీతలు, నత్తల్లాంటి జీవులు అలాగే ఇతర సముద్ర జీవులు ఆరోగ్యంగా ఉంటాయి.
సంరక్షణ చర్యలు
సముద్రాల్లోకి వ్యర్థాల్ని వదలకపోతే అసలు అవి కలుషితం అయ్యే పరిస్థితే రాదు. అందుకే, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌కు బదులు మళ్లీమళ్లీ వాడుకునేలాంటి బ్యాగుల్ని, డబ్బాల్ని వాడుకోమని నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.
అయితే అదొక్కటే సరిపోదు. ఈ మధ్య కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే ఒక సంస్థ కేవలం ఒక్క సంవత్సరంలో 112 దేశాల్లోని సముద్ర తీరాల నుండి సుమారు 8,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించింది! సముద్రంలో పేరుకుపోయిన ఆ వ్యర్థాలన్నీ అలల ద్వారా తీరానికి కొట్టుకొచ్చాయి. ప్రతీ సంవత్సరం సముద్రాల్లో కలిసే వ్యర్థాలతో పోలిస్తే ఇది రవ్వంత మాత్రమే!
నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక ఇలా రాసింది: “ఇప్పటిదాకా సముద్ర నీటిలో పెరిగిన యాసిడ్ స్థాయిలను తగ్గించి మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం జరగని పనిలా అనిపిస్తుంది. మనుషులు నూనె, గ్యాసు, బొగ్గు లాంటి ఇంధనాల్ని ఏ స్థాయిలో వాడుతున్నారంటే సముద్రాలు విపరీతంగా కలుషితమైపోయాయి. ఎంతగా అంటే, వాటిని శుభ్రపరిచే సహజ సామర్థ్యమున్న సముద్ర జీవులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి.”
ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది
“నువ్వు చేసినవాటితో భూమి నిండిపోయింది. అదిగో, ఎంతో పెద్దగా, విశాలంగా ఉన్న సముద్రం! అందులో లెక్కలేనన్ని చిన్నా పెద్దా ప్రాణులు తిరుగుతున్నాయి.”—కీర్తన 104:24, 25.
మన సృష్టికర్త సముద్రాల్ని సృష్టించి, అవి వాటికవే శుభ్రమయ్యేలా ఏర్పాటు చేశాడు. సముద్రాల గురించి, అందులో ఉన్న జీవుల గురించి పూర్తిగా తెలిసిన ఆయనకు వాటిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించి మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం తెలీదంటారా? 15వ పేజీలో “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు” అనే ఆర్టికల్ చూడండి.