మన భూమికి ఏమౌతుంది?
అడవులు
మనిషికి ఊపిరితిత్తులు ఎలాగో భూపర్యావరణానికి అడవులు అలాగ! ఎందుకంటే చెట్లు, మనిషికి హానిచేసే కార్బన్‌డైయాక్సైడ్‌ని పీల్చుకుని, మనం బ్రతకడానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్‌ను గాల్లోకి వదులుతాయి. భూమ్మీదున్న మొక్కల్లో, జంతువుల్లో 80 శాతం అడవుల్లోనే ఉంటాయి. అడవులే లేకపోతే మనిషి జాతే ప్రమాదంలో పడుతుంది!
అడవులకు పొంచివున్న ముప్పు
ప్రతీ సంవత్సరం, వ్యవసాయ భూములుగా వాడుకోవడానికి కొన్ని కోట్ల చెట్లను నరికేస్తున్నారు. 1940ల నుండి ఇప్పటిదాకా చూస్తే, ప్రపంచంలోని వర్షారణ్యాల్లో (rain forests) సగానికి సగం మాయమైపోయాయి.
అడవుల్ని నాశనం చేస్తున్నామంటే, వాటిలో ఉండే చెట్లను, జంతువుల్ని కూడా నాశనం చేస్తున్నట్టే.
మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది
ఆశ్చర్యం కలిగించే ఓ విషయం ఏంటంటే, నరికేయబడిన కొన్ని అడవులు మళ్లీ దట్టంగా పెరిగి ఇంతకుముందుకన్నా ఎక్కువ స్థలంలో విస్తరించాయి. ఈ మధ్యే కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు, నరికేసిన చెట్లు మానవ ప్రమేయం లేకుండానే చాలా త్వరగా, ఆరోగ్యంగా పెరగడం చూసి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు! ఈ ఉదాహరణలు ఒకసారి గమనించండి:
-
వ్యవసాయ భూములుగా వాడుకోవడం కోసం అడవుల్ని నరికేసి, ఆ తర్వాత ముట్టుకోకుండా వదిలేసిన కొన్ని స్థలాల్ని సైంటిస్టులు గమనిస్తూ వచ్చారు. ఉత్తర-దక్షిణ అమెరికాల్లో, పశ్చిమ ఆఫ్రికాలో అలాంటి 2,200 భూముల్ని అధ్యయనం చేశాక తేలిన విషయమేంటంటే, 10 ఏళ్లు తిరగకముందే అలాంటి స్థలాల్లో మళ్లీ చెట్లు మొలిచి అడవిగా మారడం సాధ్యమేనట!
-
వాటిని అలానే వదిలేస్తే సుమారు 100 ఏళ్లలోపే, అడవి మునుపటిలా పచ్చగా రకరకాల చెట్లతో, జంతువులతో కళకళలాడిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నట్లు సైన్స్ అనే మ్యాగజైన్‌లో వచ్చింది.
-
నరికేసిన అటవీ ప్రాంతాన్ని ముట్టుకోకుండా వదిలేస్తే త్వరగా అడవిగా మారుతుందా లేక, మనుషులు జోక్యం చేసుకుని కొత్త మొక్కల్ని నాటితే త్వరగా అడవిగా మారుతుందా అని బ్రెజిల్‌లోని సైంటిస్టులు పోల్చి చూశారు.
-
ఆ సైంటిస్టుల గురించి మాట్లాడుతూ నేషనల్ జియోగ్రఫిక్ ఇలా చెప్పింది: “మనుషులు జోక్యం చేసుకుని చెట్లు నాటాల్సిన అవసరంలేదని వాళ్లు తెలుసుకున్నారు.” వాళ్లు పరిశోధించిన భూముల్లో మనుషులు ఎవరూ చెట్లు నాటకపోయినా కేవలం ఐదు సంవత్సరాల్లో, “ఆ ప్రాంతంలో సహజంగా పెరిగే చెట్లతో అవి నిండిపోయాయి.”
సంరక్షణ చర్యలు
ఉన్న అడవుల్ని కాపాడడానికి, నరికేసిన అడవుల్ని మళ్లీ ముందులా మార్చడానికి అన్ని దేశాల్లో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫలితం? గత 25 ఏళ్లలో, “ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత 50 కన్నా ఎక్కువ శాతం తగ్గిపోయిందని” ఒక UN రిపోర్ట్ చెప్పింది.
కాకపోతే, అడవుల్ని కాపాడడానికి ఈ ప్రయత్నాలు చాలవు! “గత కొన్నేళ్లుగా, ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవుల్ని (tropical forests) అడ్డూ-అదుపూ లేకుండా నరికేస్తున్నారు” అని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ ప్రచురించిన రిపోర్ట్‌లో వచ్చింది.
కలప అమ్మే కొన్ని కంపెనీలు ప్రభుత్వం కళ్లు కప్పి అక్రమంగా చెట్లను నరికి కోట్లకు పడగలెత్తుతున్నారు. వాళ్ల స్వార్థం కోసం అడవుల్ని అన్యాయంగా నాశనం చేస్తున్నారు.
ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది
“చూడడానికి చక్కగా, తినడానికి మంచిగా ఉండే ప్రతీ చెట్టును యెహోవా a దేవుడు మొలిపించాడు.”—ఆదికాండం 2:9.
సృష్టికర్త అడవుల్ని ఏవిధంగా తయారు చేశాడో తెలుసా? మనుషులు వాళ్ల అవసరాల కోసం వాటిని ఉపయోగించుకునేలా, మళ్లీ అవి వాటంతటవే పెరిగేలా చేశాడు. ఆయన అడవుల్ని, వాటిలో ఉన్న కోటానుకోట్ల ప్రాణుల్ని కాపాడాలని, పోషించాలని అనుకుంటున్నాడు.
మనుషులు వాళ్ల స్వార్థం కోసం ఈ భూమిని, దాని మీదున్న ప్రాణుల్ని నాశనం చేస్తూ పోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడని బైబిలు చెప్తుంది. 15వ పేజీలో “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు” అనే ఆర్టికల్ చూడండి.
a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.