కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలంటే ఏం చేయాలి?
పెళ్లి, పిల్లలు మన సృష్టికర్త ఇచ్చిన విలువైన బహుమానాలు. మనం కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే భర్తకు, భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపయోగపడే చక్కని సలహాల్ని తన పవిత్ర గ్రంథంలో ఇచ్చాడు. వాటిని పాటిస్తే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది, కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. మరి, మన సృష్టికర్త ఇచ్చిన ఆ తెలివైన సలహాలు ఏంటో తెలుసుకుందామా.
భర్తలారా, మీ భార్యను ప్రేమించండి
“భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి. తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటున్నాడు. ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.”—ఎఫెసీయులు 5:28, 29.
భర్తే కుటుంబానికి పెద్ద. (ఎఫెసీయులు 5:23) దానర్థం ఆయన తన భార్యతో ఎలాగైనా ప్రవర్తించవచ్చని కాదు. భర్త భార్యతో దురుసుగా ప్రవర్తించకూడదు, తనదే పైచేయి అవ్వాలని అనుకోకూడదు. బదులుగా ఆయన తన భార్యను గౌరవించాలి. ఆమెకు అవసరమైనవి సమకూర్చాలి, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటూ, ఆమె బాధలో ఉన్నప్పుడు ఓదార్చి ధైర్యం చెప్పాలి. ప్రతీదీ తన ఇష్టప్రకారమే జరగాలని పట్టుబట్టకుండా, భార్య ఇష్టాన్ని కూడా పట్టించుకోవాలి. (ఫిలిప్పీయులు 2:4) ఆమె దగ్గర ఏదీ దాచిపెట్టకుండా మనసువిప్పి మాట్లాడాలి, ఆమె ఏదైనా చెప్తున్నప్పుడు ఓపిగ్గా వినాలి. కోపం వచ్చినప్పుడు భార్యను కొట్టడం, తిట్టడం లాంటివి చేసి ఆమె మనసును నొప్పించకూడదు.—కొలొస్సయులు 3:19.
భార్యలారా, మీ భర్తను గౌరవించండి
“భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.”—ఎఫెసీయులు 5:33.
భార్య తన భర్తను గౌరవించాలి, ఆయన తీసుకునే నిర్ణయాలకు మద్దతివ్వాలి. అలా చేస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. భర్త ఏదైనా పొరపాటు చేస్తే ఆయన్ని అవమానిస్తూ మాట్లాడకూడదు, అలాంటి సమయాల్లో కూడా ఆయన్ని గౌరవించాలి. (1 పేతురు 3:4) ఏదైనా సమస్య గురించి ఆయనతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సరైన సమయం చూసి గౌరవంగా మాట్లాడాలి.—ప్రసంగి 3:7.
భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి
‘పురుషుడు తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లు ఒక్క శరీరం అవుతారు.’—ఆదికాండం 2:24.
ఒక స్త్రీ, పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన బంధంలోకి అడుగుపెడతారు. ఆ బంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలంటే వాళ్లు ప్రతీరోజు మనసువిప్పి మాట్లాడుకోవాలి, ప్రేమను తెలిపే చిన్నచిన్న పనులు చేయాలి. అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే, నమ్మకద్రోహం కలిగించే బాధ మాటల్లో వర్ణించలేనిది. దానివల్ల నమ్మకం పోతుంది, కుటుంబం ముక్కలౌతుంది.—హెబ్రీయులు 13:4.
తల్లిదండ్రులారా, మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి
“పిల్లవాడు నడవాల్సిన దారిని అతనికి నేర్పించు; అతను ముసలివాడైనప్పుడు కూడా దాన్నుండి తొలగిపోడు.”—సామెతలు 22:6, అధస్సూచి.
పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని పిల్లలకు చెప్తే సరిపోదు, వాటిని తల్లిదండ్రులు కూడా పాటించాలి. (ద్వితీయోపదేశకాండం 6:6, 7) పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ల మీద కోపంతో మండిపడకూడదు. ఏదైనా అనడానికి ముందు, అసలు వాళ్లేమి చెప్తున్నారో ప్రశాంతంగా వినాలి. (యాకోబు 1:19) వాళ్లను ఖచ్చితంగా సరిదిద్దాలి అనిపిస్తే, ప్రేమతో సరిదిద్దాలే గానీ కోపంతో కాదు.
పిల్లలారా, మీ మమ్మీ-డాడీ మాట వినండి
‘పిల్లలారా, మీ అమ్మానాన్నల మాట వినండి, మీ అమ్మానాన్నల్ని గౌరవించండి.’—ఎఫెసీయులు 6:1, 2.
పిల్లలు వాళ్ల మమ్మీడాడీ మాట వినాలి, వాళ్లను గౌరవించాలి. అలా చేసినప్పుడు ఇంట్లో గొడవలు ఉండవు, అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు పెద్దయ్యాక కూడా, వయసుపైబడిన తమ అమ్మానాన్నల్ని గౌరవించాలి, దాంతోపాటు వాళ్ల అవసరాలు తీర్చాలి. కొన్ని సందర్భాల్లో వాళ్లు అమ్మానాన్నలతో కాకుండా వేరేచోట ఉంటారు. అలాంటప్పుడు, ఇంటికి ఏవైనా రిపేర్లు చేయాల్సి వచ్చినప్పుడు, లేదా డబ్బులు అవసరమైనప్పుడు తమ అమ్మానాన్నలకు సహాయం చేసి వాళ్ల అవసరాలన్నీ తీరేలా చూడాలి.—1 తిమోతి 5:3, 4.