సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి
సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి.—హెబ్రీ. 13:1.
1, 2. పౌలు హెబ్రీయులకు ఓ ఉత్తరాన్ని ఎందుకు రాశాడు?
సా.శ. 61లో ఇశ్రాయేలులోని సంఘాలన్నిటిలో కొంతవరకు సమాధానం ఉంది. ఆ సమయంలో అపొస్తలుడైన పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పటికీ త్వరలోనే విడుదలవుతాననే నమ్మకంతో ఉన్నాడు. ఆయనతోపాటు ప్రయాణ సేవలో ఉన్న తిమోతి విడుదలై అప్పటికి కొంతకాలమే అయింది, వాళ్లిద్దరూ కలిసి యూదయలో ఉన్న సహోదరులను కలవాలనుకున్నారు. (హెబ్రీ. 13:23) అయితే, మరో ఐదు సంవత్సరాల్లో యూదయలోని క్రైస్తవులు, ముఖ్యంగా యెరూషలేములో ఉంటున్నవాళ్లు వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఎందుకు? ఎందుకంటే యెరూషలేమును సైనికులు చుట్టుముట్టినప్పుడు వాళ్లు అక్కడినుండి పారిపోవాలని యేసు తన శిష్యులను ముందే హెచ్చరించాడు.—లూకా 21:20-24.
2 అయితే ఆయన ఆ హెచ్చరిక ఇచ్చి 28 సంవత్సరాలు గడిచాయి. ఇశ్రాయేలులోని క్రైస్తవులు ఆ సంవత్సరాలన్నిటిలో వాళ్లకు ఎన్ని హింసలు, వ్యతిరేకతలు వచ్చినా నమ్మకంగా ఉన్నారు. (హెబ్రీ. 10:32-34) కానీ వాళ్ల విశ్వాసానికి భవిష్యత్తులో ఓ పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది కాబట్టి పౌలు వాళ్లను సిద్ధం చేయాలనుకున్నాడు. (మత్త. 24:20, 21; హెబ్రీ. 12:4) పారిపొమ్మని యేసు ఇచ్చిన హెచ్చరికను పాటించాలంటే వాళ్లకు ముందెప్పుడూ లేనంత ఓర్పు, విశ్వాసం కావాలి. వాళ్ల ప్రాణాలు ఆ హెచ్చరికను పాటించడం మీదే ఆధారపడి ఉన్నాయి. (హెబ్రీయులు 10:36-39 చదవండి.) అందుకే ఆ క్రైస్తవుల్ని బలపర్చడానికి పౌలు చేత యెహోవా ఓ ఉత్తరం రాయించాడు, ఆ ఉత్తరమే మన బైబిల్లోని ‘హెబ్రీయులకు రాసిన పత్రిక.’
3. ‘హెబ్రీయులకు రాసిన పత్రికలో’ ఉన్న విషయాల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
3 నేడు మనం కూడా ఆ పత్రికలో ఉన్న విషయాల్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే, ఒకప్పుడు యూదయలోని క్రైస్తవులు ఎదుర్కొన్నలాంటి పరిస్థితే మనమూ ఎదుర్కొంటున్నాం. మనం జీవిస్తున్న ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ చాలామంది సహోదరసహోదరీలు తీవ్రమైన హింసను, వ్యతిరేకతను నమ్మకంగా సహించారు. (2 తిమో. 3:1, 12) కానీ మనలో చాలామందిమి నేరుగా హింసలు ఎదుర్కోవట్లేదు. అయినప్పటికీ మనం పౌలు కాలంలోని క్రైస్తవుల్లాగే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అతి త్వరలో మన విశ్వాసానికి చాలా పెద్ద పరీక్ష ఎదురుకానుంది.—లూకా 21:34-36 చదవండి.
4. ఈ సంవత్సరం వార్షిక వచనం ఏమిటి? అది ఎందుకు తగినది?
4 అయితే, భవిష్యత్తులో ఎదురుకాబోతున్న ఆ పరీక్షకు మనమెలా సిద్ధపడవచ్చు? మన విశ్వాసాన్ని బలపర్చే ఎన్నో విషయాల్ని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన విషయం హెబ్రీయులు 13:1 లో ఉంది. అదేంటంటే, ‘సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి.’ ఈ వచనాన్నే 2016 వార్షిక వచనంగా తీసుకున్నాం.
ఈ సంవత్సరం వార్షిక వచనం: సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి.—హెబ్రీయులు 13:1
సహోదర ప్రేమ అంటే ఏమిటి?
5. సహోదర ప్రేమ అంటే ఏమిటి?
5 సహోదర ప్రేమ అంటే ఏమిటి? పౌలు ఉపయోగించిన ఆ పదానికి ఆదిమ గ్రీకు భాషలో “సహోదరుని మీద ఉండే అనురాగం” అని అర్థం. కుటుంబసభ్యుల మధ్య లేదా దగ్గరి స్నేహితుల మధ్య ఉండే బలమైన, ఆప్యాయత భావాలే సహోదర ప్రేమ. (యోహా. 11:36) మనం సహోదరసహోదరీలుగా ఉన్నట్టు నటించం, మనం నిజంగా సహోదరసహోదరీలమే. (మత్త. 23:8) “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని పౌలు చెప్తున్నాడు. (రోమా. 12:10) సహోదరసహోదరీల పట్ల మనకున్న అనురాగం ఎంత ప్రగాఢమైనదో ఆ మాటలు చక్కగా వర్ణిస్తున్నాయి. సహోదర ప్రేమతోపాటు క్రైస్తవ సూత్రాల మీద ఆధారపడిన ప్రేమవల్ల దేవుని ప్రజలు దగ్గరి స్నేహితులుగా, ఐక్యంగా ఉంటారు.
6. “సహోదరులు” అంటే ఎవరు?
6 “సహోదర ప్రేమ” అనే మాట ఎక్కువగా క్రైస్తవ ప్రచురణల్లో కనిపిస్తుంది. ప్రాచీన యూదులు “సహోదరుడు” అనే మాటను బంధువులను, అప్పుడప్పుడు బంధువులు కానివాళ్లను సూచించడానికి కూడా ఉపయోగించేవాళ్లు. కానీ ఆ మాటను యూదులుకాని వాళ్లకు మాత్రం ఉపయోగించేవాళ్లు కాదు. అయితే నిజ క్రైస్తవులైన మనకు, తోటి క్రైస్తవులందరూ “సహోదరులే,” వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లు అయినాసరే. (రోమా. 10:12) ఒకరినొకరం సహోదరుల్లా ప్రేమించుకోవడం మనకు యెహోవా నేర్పించాడు. (1 థెస్స. 4:9) అయితే, సహోదర ప్రేమ చూపిస్తూనే ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
సహోదర ప్రేమ చూపిస్తూ ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
7. (ఎ) సహోదర ప్రేమ చూపించడానికి ముఖ్య కారణం ఏమిటి? (బి) ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను మరింత పెంచుకోవాలనడానికి మరో కారణం ఏమిటి?
7 సహోదర ప్రేమ చూపించడానికి ముఖ్య కారణమేమిటంటే అలా చూపించమని యెహోవా చెప్తున్నాడు. మనం తోటి సహోదరసహోదరీలను ప్రేమించలేకపోతే యెహోవాను ప్రేమించలేం. (1 యోహా. 4:7, 20, 21) మరో కారణమేమిటంటే, మనకు తోటివాళ్ల సహాయం అవసరం, ముఖ్యంగా కష్టసమయాల్లో. హెబ్రీ క్రైస్తవుల్లో కొంతమందికి త్వరలో తమ ఇంటిని, వస్తువులను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం ఆ ఉత్తరం రాస్తున్న పౌలుకు తెలుసు. ఆ సమయం ఎంత కష్టంగా ఉంటుందో యేసు వివరించాడు. (మార్కు 13:14-18; లూకా 21:21-23) అయితే, ఆ సమయం రాకముందే ఆ క్రైస్తవులందరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.—రోమా. 12:9.
8. భవిష్యత్తులో వచ్చే శ్రమల్ని సహించాలంటే మనం ఇప్పుడే ఏమి చేయాలి?
8 మానవ చరిత్రలో ఎప్పుడూ రానంత గొప్ప శ్రమ త్వరలోనే రాబోతుంది. (మార్కు 13:19; ప్రక. 7:1-3) ‘నా జనమా, నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెంసేపు దాగి ఉండుము’ అనే సలహాను ఆ సమయంలో మనం పాటించాలి. (యెష. 26:20, 21) ఆ ‘అంతఃపురాలు’ మన సంఘాలే కావచ్చు. తోటి సహోదరసహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించడానికి మనం కలుసుకునే స్థలం అదే. అయితే, మనం క్రమంగా కలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ‘ప్రేమ చూపించుకుంటూ, సత్కార్యాలు చేసుకుంటూ’ ఉండాలని పౌలు హెబ్రీయులకు చెప్పాడు. (హెబ్రీ. 10:24, 25) అవును, సహోదరసహోదరీల మీద మనకున్న ప్రేమను మరింత పెంచుకోవడానికి సమయం ఇదే. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి శ్రమలొచ్చినా సహించడానికి ఆ ప్రేమే మనకు సహాయం చేస్తుంది.
9. (ఎ) సహోదర ప్రేమ చూపించడానికి నేడు మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? (బి) యెహోవా ప్రజలు సహోదర ప్రేమ చూపించిన ఉదాహరణలు చెప్పండి.
9 మహాశ్రమలు మొదలవ్వకముందు అంటే ఇప్పుడు కూడా సహోదర ప్రేమ చూపించే అవకాశాలు మనకెన్నో ఉన్నాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, సునామీలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల మన సహోదరులు చాలామంది బాధపడుతున్నారు. మరికొంతమంది హింసను ఎదుర్కొంటున్నారు. (మత్త. 24:6-9) ఇవన్నీ చాలవన్నట్లు అవినీతితో నిండిన లోకంలో జీవిస్తున్నందువల్ల ప్రతీరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (ప్రక. 6:5, 6) అయితే మన సహోదరులకు సమస్యలు ఎన్ని ఉన్నాయో, సహోదర ప్రేమ చూపించడానికి మనకు అవకాశాలు కూడా అన్ని ఉన్నాయి. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమ చూపించకపోయినా మనం మాత్రం సహోదర ప్రేమ చూపిస్తూనే ఉండాలి.—మత్త. 24:12. [1]
సహోదర ప్రేమను మనమెలా చూపిస్తూ ఉండవచ్చు?
10. మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం?
10 మనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, సహోదర ప్రేమను ఎలా చూపిస్తూ ఉండవచ్చు? మన సహోదరులపట్ల మనకు అనురాగం ఉందని ఎలా చూపించవచ్చు? అపొస్తలుడైన పౌలు, ‘సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి’ అని చెప్పిన తర్వాత దాన్ని చూపించగల కొన్ని మార్గాల గురించి కూడా చెప్పాడు. వాటిలో ఆరింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
11, 12. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.)
11 ‘ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి.’ (హెబ్రీయులు 13:1 చదవండి.) ‘ఆతిథ్యం’ అంటే ఏమిటి? పౌలు ఉపయోగించిన ఆ మాట “పరిచయంలేని వాళ్లపట్ల దయ చూపించడం” అని అర్థం. బహుశా ఆ మాట విన్నప్పుడు మనకు అబ్రాహాము, లోతు గుర్తుకురావచ్చు. వాళ్లు తమకు పరిచయంలేని ఇద్దరు వ్యక్తులపట్ల దయ చూపించారు. నిజానికి వాళ్లు దేవదూతలని అబ్రాహాముకు, లోతుకు కొద్దిసేపటి తర్వాత అర్థమైంది. (ఆది. 18:2-5; 19:1-3) ఆతిథ్యం ఇస్తూ సహోదర ప్రేమ చూపించేలా ఇలాంటి ఉదాహరణలు హెబ్రీ క్రైస్తవులను ప్రోత్సహించాయి.
12 మనం ఇతరులకు ఎలా ఆతిథ్యం ఇవ్వవచ్చు? సహోదరసహోదరీలను భోజనానికి లేదా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మన ఇంటికి ఆహ్వానించవచ్చు. మన ప్రాంతీయ పర్యవేక్షకునితో, ఆయన భార్యతో మనకు అంత పరిచయం లేకపోయినా వాళ్లు మన సంఘాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు మన ఇంటికి ఆహ్వానించవచ్చు. (3 యోహా. 5-8) ఆతిథ్యం ఇవ్వడం కోసం రకరకాల వంటలు చేయడం లేదా ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం వంటివి చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, మన లక్ష్యం సహోదరులను ప్రోత్సహించడమే కానీ వాళ్లను మెప్పించడం కాదు. అంతేకాకుండా, తిరిగి ఏదోఒకటి ఇవ్వగలిగేవాళ్లను మాత్రమే మనం ఆహ్వానించకూడదు. (లూకా 10:41-42; 14:12-14) మనం ఎంత బిజీగా ఉన్నా ఆతిథ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం.
13, 14. జైల్లో ఉన్నవాళ్లను మనమెలా జ్ఞాపకం చేసుకోవచ్చు?
13 ‘బంధకాల్లో ఉన్నవాళ్లను జ్ఞాపకం చేసుకోండి.’ (హెబ్రీయులు 13:2, 3 చదవండి.) తమ విశ్వాసాన్నిబట్టి జైల్లో ఉన్న సహోదరుల గురించి పౌలు ఈ మాటలు రాశాడు. (ఫిలి. 1:12-14) ‘చెరసాలలో ఉన్న వాళ్లపట్ల సానుభూతి’ చూపించినందుకు హెబ్రీ సంఘంలోని క్రైస్తవులను పౌలు మెచ్చుకున్నాడు. (హెబ్రీ. 10:34, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) పౌలు నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది సహోదరులు ఆయనకు సహాయం చేశారు. అయితే ఇంకొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. మరి వాళ్లు పౌలుకు ఎలా సహాయం చేయగలరు? ఆయన కోసం పట్టుదలగా ప్రార్థన చేయడం ద్వారా వాళ్లు సహాయం చేయగలరు.—హెబ్రీ. 13:18, 19.
14 నేడు చాలామంది సాక్షులు తమ విశ్వాసాన్నిబట్టి జైల్లో ఉన్నారు. వాళ్లకు దగ్గర్లో ఉన్న సహోదరులు వెళ్లి అవసరమైన సహాయం చేస్తారు. కానీ మనలో చాలామందిమి దూర ప్రాంతాల్లో నివసిస్తుండవచ్చు. అయినాసరే మనం వాళ్లను మర్చిపోకుండా, ఎలా సహాయం చేయగలం? వాళ్లకోసం పట్టుదలగా ప్రార్థించడం ద్వారా మనం సహోదర ప్రేమ చూపించవచ్చు. ఉదాహరణకు, ఎరిట్రియ దేశంలోని మన సహోదరులైన పౌలోస్ ఈయాసూ, ఈసాక్ మోగోస్, నెగెడె టెక్లెమార్యామ్ 20 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నారు. వాళ్లలాగే కొంతమంది సహోదరసహోదరీలు, చివరికి పిల్లలు కూడా జైల్లో ఉన్నారు. మనం వాళ్లందరి కోసం ప్రార్థించవచ్చు.
15. వివాహబంధాన్ని గౌరవిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?
15 “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా” ఉండాలి. (హెబ్రీయులు 13:4 చదవండి.) మనం నైతికంగా పవిత్రంగా ఉండడం ద్వారా కూడా సహోదర ప్రేమ చూపించవచ్చు. (1 తిమో. 5:1, 2) ఉదాహరణకు, తోటి సహోదరునితో లేదా సహోదరితో తప్పుచేస్తే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబానికి హాని చేసినవాళ్లమౌతాం. అంతేకాదు మన సహోదరసహోదరీలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినవాళ్లమౌతాం. (1 థెస్స. 4:3-8) ఒకవేళ ఓ భార్యకు, తన భర్త అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని తెలిస్తే ఆమెకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. తన భర్త తనను ప్రేమిస్తున్నాడనీ, తమ వివాహబంధాన్ని గౌరవిస్తున్నాడనీ ఆమె అనుకుంటుందా?—మత్త. 5:28.
16. ఉన్నవాటితో తృప్తిపడితే సహోదర ప్రేమ ఎలా చూపించగలుగుతాం?
16 “మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.” (హెబ్రీయులు 13:5 చదవండి.) యెహోవా మీద నమ్మకం ఉంటే మనకున్న వాటితో తృప్తిగా ఉంటాం. సహోదర ప్రేమ చూపించడానికి ఇది మనకెలా సహాయం చేస్తుంది? ఉన్నవాటితో తృప్తిపడితే మనం డబ్బు లేదా వస్తువుల కన్నా తోటి సహోదరసహోదరీలే ఎక్కువ విలువైనవాళ్లని గుర్తుంచుకుంటాం. (1 తిమోతి 6:6-8) అంతేకాదు ఉన్నవాటితో తృప్తిగా ఉంటే మన సహోదరుల గురించి ఫిర్యాదు చేయం లేదా మన జీవితం గురించి సణుగుకోము, ఇతరులను చూసి ఈర్ష్యపడం లేదా వాళ్లది ఆశించం. బదులుగా ఉన్నవాటితో సంతృప్తిగా ఉంటే ఇతరులకు ఉదారంగా ఇస్తాం.—1 తిమో. 6:17-19.
17. “మంచి ధైర్యముతో” ఉంటే సహోదర ప్రేమ ఎలా చూపించగలుగుతాం?
17 “మంచి ధైర్యముతో” ఉండండి. (హెబ్రీయులు 13:6 చదవండి.) యెహోవా మీద నమ్మకం ఉంటే కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం. ఇలాంటి ధైర్యం మనం సానుకూలంగా ఆలోచించడానికి సహాయం చేస్తుంది. మనం సానుకూలంగా ఉంటే తోటి సహోదరసహోదరీలను ప్రోత్సహిస్తూ, ఓదారుస్తూ సహోదర ప్రేమ చూపించగలుగుతాం. (1 థెస్స. 5:14, 15) మహాశ్రమల సమయంలో కూడా మనం భయపడం. బదులుగా మన విడుదల దగ్గర్లో ఉందనే ధైర్యంతో ఉండగలుగుతాం.—లూకా 21:25-28.
18. సంఘపెద్దలపట్ల మనకున్న సహోదర ప్రేమను ఎలా బలపర్చుకోవచ్చు?
18 ‘మీపై నాయకులుగా ఉన్నవాళ్లను జ్ఞాపకం చేసుకోండి.’ (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) సంఘపెద్దలు ఎలాంటి డబ్బు ఆశించకుండా మనకోసం కష్టపడి పనిచేస్తారు. వాళ్లు మనకోసం చేస్తున్నవాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు వాళ్లమీద మనకున్న ప్రేమ, కృతజ్ఞత మరింత పెరుగుతాయి. వాళ్ల సంతోషాన్ని పోగొట్టే పనుల్ని లేదా వాళ్లకు చిరాకు తెప్పించే దేన్నీ మనం చేయాలనుకోం. బదులుగా వాళ్ల మాటకు ఇష్టంగా లోబడతాం. ఇలా చేయడం ద్వారా, ‘వాళ్ల పనినిబట్టి వాళ్లను ప్రేమతో మిక్కిలి ఘనంగా’ ఎంచుతున్నామని చూపిస్తాం.—1 థెస్స. 5:13.
సహోదర ప్రేమను మరింత ఎక్కువగా చూపిస్తూ ఉండండి
19, 20. సహోదర ప్రేమను మరింత ఎక్కువగా మనమెలా చూపిస్తూ ఉండవచ్చు?
19 యెహోవాసాక్షులు సహోదర ప్రేమకు పెట్టింది పేరు. పౌలు కాలంలోని దేవుని ప్రజలు కూడా అంతే. అయినా సరే పౌలు వాళ్లను, ‘మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉండాలి’ అని ప్రోత్సహించాడు. (1 థెస్స. 4:9-12) అవును, ప్రేమ చూపించే విషయంలో మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది.
20 కాబట్టి మన రాజ్యమందిరంలో ఈ సంవత్సరం వార్షిక వచనాన్ని చూసినప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం, నేను ఆతిథ్యాన్ని ఇంకా ఎక్కువగా ఎలా ఇవ్వవచ్చు? జైల్లో ఉన్న సహోదరులకు నేనెలా సహాయం చేయవచ్చు? దేవుడు చేసిన వివాహ ఏర్పాటుపట్ల నాకు గౌరవం ఉందా? నిజమైన సంతృప్తితో ఉండడానికి నాకేది సహాయం చేస్తుంది? యెహోవా మీద నాకున్న నమ్మకాన్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చు? సంఘపెద్దలకు నేను విధేయత ఇంకా ఎక్కువగా ఎలా చూపించవచ్చు? ఈ ఆరు విషయాల్లో మనం అభివృద్ధి సాధించడానికి కృషిచేస్తే వార్షిక వచనం కేవలం గోడ మీద బోర్డులా ఉండదుగానీ, సహోదర ప్రేమ చూపిస్తూ ఉండమని పౌలు ఇచ్చిన సలహాను పాటించాలని గుర్తుచేస్తుంది.—హెబ్రీ. 13:1.
^ [1] (9వ పేరా) విపత్తులు వచ్చినప్పుడు యెహోవాసాక్షులు సహోదర ప్రేమను చూపించిన ఉదాహరణల గురించి కావలికోట జూలై 15, 2002, 8-9 పేజీలు చూడండి.