1 సమస్యలు రాకుండ చేసుకోవడానికి సహాయం
బైబిల్లో ఉన్న సలహాలు దేవుని ప్రేరణతో రాయబడ్డాయి. ఆ సలహాలు “బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి . . . ప్రయోజనకరంగా ఉంటాయి.” (2 తిమోతి 3:16) ఈ మాటలు నిజమేనా? జీవితంలో పెద్దపెద్ద సమస్యల్లో కూరుకుపోకముందే, అవి రాకుండా చేయడానికి బైబిలు జ్ఞానం కొంతమందికి ఎలా సహాయం చేసిందో పరిశీలించండి.
త్రాగుబోతుతనం
ముందు ఆర్టికల్‌లో మాట్లాడుకున్న దియాకు కష్టాల వల్ల అతిగా మద్యం తాగాలని అనిపించేది. మద్యాన్ని కొద్దిగా తీసుకోవడాన్ని బైబిలు తప్పు అని చెప్పట్లేదు కానీ, “ద్రాక్షారసము త్రాగువారితో . . . సహవాసము చేయకుము” అని చెప్తుంది. (సామెతలు 23:20) అనవసరంగా మద్యం తాగితే, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, సంబంధాలు పాడైపోతాయి. ప్రతి సంవత్సరం మద్యం దుర్వినియోగం వల్ల లక్షలమంది ప్రజలు అకాల మరణానికి గురి అవుతున్నారు. ప్రజలు బైబిల్లో ఉన్న తెలివైన సలహాను పాటిస్తే, ఇలాంటి ఎన్నో సమస్యలను రాకుండా చేసుకోవచ్చు.
దియా అలానే చేసింది. ఆమె ఇప్పుడు ఇలా అంటోంది: “మద్యం నా కష్టాలను తీసివేయడం లేదని నేను గ్రహించాను. ఫిలిప్పీయులు 4:6,7లో ఉన్న సలహాను నేను పాటించాను. అక్కడ ఇలా ఉంది: ‘ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ . . . మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.’ రోజూ రాత్రి నా ఆలోచనలు ఎక్కువైపోయి, నా బాధ పెరిగిపోయినప్పుడు నేను యెహోవాను వేడుకున్నాను. కోపం, బాధ, నిరాశతోపాటు నా ఆలోచనలన్నీ ఆయనకు వివరంగా చెప్పాను. నేను సానుకూలంగా ఆలోచించడానికి సహాయం చేయమని ఆయనను అడిగాను. ఉదయానికి ఆ ఆలోచనలను తీసేసుకునేలా జాగ్రత్తపడ్డాను. అలా ప్రార్థన చేసే అలవాటు లేనివాటిమీద మనసు పెట్టకుండా ఉన్నవాటిమీద మనసు పెట్టేలా నాకు సహాయం చేసింది. నేను మళ్లీ మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నాకు దొరికిన శాంతి చాలా విలువైనది, దాన్ని పోగొట్టుకునే సాహసం నేను చేయలేను.”
నీతి లేని జీవితం
కొన్ని సమస్యలు ఎంతో హృదయ వేదనను, దుఃఖాన్ని తీసుకువస్తాయి. వాటిలో ముఖ్యమైనది అనైతిక జీవితం. కానీ ఆ సమస్యలు ఎందుకు వస్తాయో వాటికి కారణాలు తెలుసుకుని అవి రాకుండా ఆపడానికి బైబిలు ఇచ్చే సలహాలు సహాయం చేస్తాయి. ఆ కారణాల్లో కొన్ని సరసాలడడం లేదా ఫ్లర్టింగ్, పోర్నోగ్రఫీ లాంటివి. “ఫ్లర్టింగ్ చాలా ఈజీ,” అని సామ్యల్ అనే అబ్బాయి అన్నాడు. “కొన్నిసార్లు నాకు అవతలి వాళ్ల మీద ఇష్టం లేకపోయినా, వాళ్లకు నా మీద ఇష్టం ఉంటే తెలిసిపోయేది, అప్పుడు ఫ్లర్టింగ్ చేయడం సరదాగా అనిపించేది.” సామ్యల్‌కు ఫ్లర్టింగ్ చేయాలనే ఉద్దేశం లేకపోయినా అతను ఫ్లర్టింగ్ చేస్తున్నాడని నిందలు ఎక్కువ వేసేవాళ్లు. అందరూ అంటున్నారు కాబట్టి తను నిజంగా ఫ్లర్టింగ్ చేయాలని చివరికి నిర్ణయించుకునేవాడు. కానీ ఆ అలవాటు అతన్ని బాగా బాధపెట్టేది. “ఫ్లర్టింగ్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఫ్లర్టింగ్ స్వార్థపూరితంగా ఆలోచించేలా చేస్తుంది” అని అతను ఇప్పుడు అంటున్నాడు.
సామ్యల్ యౌవనుల కోసం jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఒక ఆర్టికల్‌ని చదివాడు. తర్వాత సామెతలు 20:11 గురించి ఆలోచించాడు. అక్కడ ఇలా ఉంది: “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.” ఇది అతనికి ఎలా సహాయం చేసింది? సామ్యల్ ఫ్లర్టింగ్ సరైనది కాదు, మంచిది కాదు అని గ్రహించాడు. ఇప్పుడు ఇలా అంటున్నాడు: “ఫ్లర్టింగ్ చేసే యౌవనులు వాళ్లను చెడ్డ భార్యగా లేదా భర్తగా తయారు చేసే లక్షణాలను పెంచుకుంటున్నారని కూడా నేను అర్థం చేసుకున్నాను. రేపు నేను పెళ్లి చేసుకున్నాక నా భార్య నేను వేరే అమ్మాయితో ఫ్లర్టింగ్ చేయడం చూస్తే ఎంత బాధ పడుతుందో ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ అలవాటు ప్రమాదకరమైనదని నేను అర్థం చేసుకున్నాను. ఒక అలవాటు ఈజీ అయినంత మాత్రాన అది సరైనది అయిపోదు.” సామ్యల్ మారాడు. ఫ్లర్టింగ్‌కి దూరంగా ఉండడం వల్ల అతను నీతి లేని జీవితానికి దూరంగా ఉండగలిగాడు.
ఆంటోన్యొ నైతికంగా చాలా ప్రమాదంలో ఉన్నాడు. అతను పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయాడు. అతను ఎంతో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నప్పటికీ, అతను మళ్లీమళ్లీ ఈ అలవాటులో పడిపోతూ ఉన్నాడు. 1 పేతురు 5:8 గురించి ఆలోచించడం అతనికి నిజంగా సహాయం చేసింది. అక్కడ ఇలా ఉంది: “మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి! మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.” ఆంటోన్యొ ఇలా చెప్తున్నాడు: “ఈ లోకంలో అశ్లీలమైన బొమ్మలు మన చుట్టూ ఉన్నాయి, అవి మన మెదడులో అతుక్కుపోగలవు. నా శోధనకు కారణాన్ని తెలుసుకోవడానికి ఆ సలహా నాకు నిజంగా సహాయం చేసింది. ఈ అశ్లీలమైన బొమ్మలు సాతాను నుండి వచ్చాయని వెంటనే గుర్తు చేసుకోవడం నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు తెలుసు, యెహోవా మాత్రమే ‘నా ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి, అప్రమత్తంగా ఉండడానికి’ సహాయం చేస్తాడు, అప్పుడు నేను హృదయంపై, మనసుపై, నా వివాహ జీవితంపై జరిగే దాడులతో పోరాడగలను.” ఆంటోన్యొ తనకు కావాల్సిన సహాయాన్ని తీసుకున్నాడు, చివరికి ఆ అలవాటు నుండి బయటపడగలిగాడు. అది ఇంకా పెద్ద సమస్యలతో పోరాడడానికి అతనికి సహాయం చేసింది.
పెద్దపెద్ద సమస్యలు రాకుండా సహాయం చేసే సలహాలను బైబిలు ఇస్తుందనేది నిజం. కానీ ఇప్పటికే మనల్ని వదలకుండా పట్టిపీడిస్తున్న సమస్యల విషయం ఏమిటి? ఇలాంటి కష్టమైన వాటిని పరిష్కరించుకోవడానికి దేవుని వాక్యం ఎలా సహాయం చేస్తుందో చూద్దాం.
బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు కొన్ని సమస్యలు రాకుండా చేస్తాయి