పాతబడిపోయిందా లేదా భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉందా?
సైన్స్
బైబిలు ఒక సైన్స్ టెక్స్‌ట్ బుక్ కాదు, కానీ అందులో ఉన్న విషయాలు ఆ కాలంలో ఉన్న జ్ఞానానికి మించి ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూడండి.
• సృష్టికి ఆరంభం ఉందా?
పెద్దపెద్ద సైన్‌టిస్టులు ఒకప్పుడు సృష్టికి ఆరంభం లేదని బలంగా అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సృష్టికి ఆరంభం ఉంది అనేది వాళ్లు మామూలుగా నమ్మే విషయం అయిపోయింది. బైబిలు దాన్ని ఎప్పుడో స్పష్టంగా చెప్పింది.—ఆదికాండము 1:1.
భూమి ఏ ఆకారంలో ఉంది?
పూర్వకాలంలో చాలామంది భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉందని నమ్మేవాళ్లు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు సైన్‌టిస్టులు భూమి గోళంగా లేదా గుండ్రంగా ఉందని సూచించారు. కానీ అంతకు ఎంతో ముందే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో బైబిలు రచయితల్లో ఒకరైన యెషయా “భూమండలముమీద” అని రాశాడు. అక్కడ వాడిన పదాన్ని గోళం అని కూడా అనవచ్చు.—యెషయా 40:22.
ఆకాశానికి లేదా అంతరిక్షానికి పాడు అయ్యే గుణం ఉందా?
గ్రీకు సైన్‌టిస్టు అయిన అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో భూమి మీద మాత్రమే పాడైపోయే గుణం కనపడుతుంది కానీ నక్షత్రాలున్న ఆకాశంలో మార్పు ఉండదు లేదా పాడు అవ్వడం ఉండదు అని నేర్పించాడు. ఆ అభిప్రాయం చాలా శతాబ్దాల వరకు ఉంది. కానీ 19వ శతాబ్దంలో సైన్‌టిస్టులు ఎంట్రోపీ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. దాని ప్రకారం ఏ పదార్థం అయినా, ఆకాశంలోదైనా భూమి మీదదైనా పాడవుతుంది. ఈ విషయంలో అభివృద్ధికి సహాయపడిన ఒక సైన్‌టిస్టు లార్డ్ కెల్విన్ ఇలా అన్నారు: భూమి, ఆకాశం గురించి బైబిలు చెప్తున్నట్లు, “అవియన్నియు వస్త్రమువలె పాతగిలును.” (కీర్తన 102:25, 26) బైబిల్లో ఉన్నట్లు దేవుడు తలచుకుంటే తాను సృష్టించిన వాటిని నాశనం చేయడం ద్వారా సృష్టిని పాడు అవ్వకుండా ఆపగలడు అనే విషయాన్ని కెల్విన్ నమ్మాడు.—ప్రసంగి 1:4.
భూమి లాంటి గ్రహాలను ఏది పట్టుకుంది?
ఆకాశంలో ఉన్నవన్నీ స్పటికంలా ఉన్న మండలాల మధ్య ఒకదానికొకటి పక్కపక్కన గూడులా ఉన్నాయని, భూమి వాటన్నిటికీ మధ్యలో ఉందని అరిస్టాటిల్ నేర్పించాడు. క్రీస్తు శకం 18వ శతాబ్దానికల్లా సైన్‌టిస్టులు నక్షత్రాలు, గ్రహాలు దేని పైన వేలాడి లేవు అనే విషయాన్ని నమ్మడం మొదలుపెట్టారు. కానీ క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం కల్లా రాసిన యోబు పుస్తకంలో సృష్టికర్త “శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను” అనే విషయాన్ని మనం చదువుతాము.—యోబు 26:7.
మెడిసిన్ లేదా వైద్యం
బైబిలు వైద్యానికి సంబంధించిన టెక్స్‌ట్ బుక్ కాకపోయినా అందులో ఉన్న వైద్య సూత్రాలు ఆరోగ్యానికి సంబంధించిన ఆధునిక విషయాలను చూపిస్తాయి.
జబ్బులతో ఉన్నవాళ్లకు దూరంగా ఉండడం.
మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కుష్టువ్యాధితో ఉన్నవాళ్లను దూరంగా ఉంచాలి అనే విషయాన్ని చెప్పారు. మధ్య శతాబ్దాల్లో ప్లేగు వ్యాధులు వచ్చేవరకు డాక్టర్లు ఈ సూత్రాన్ని నేర్చుకోలేదు. అది ఇప్పటికీ ఎంతో ముఖ్యంగానే పరిగణించబడుతుంది.—లేవీయకాండము 13, 14 అధ్యాయాలు.
శవాన్ని ముట్టుకున్న తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవడం.
19వ శతాబ్దం చివరి వరకు, డాక్టర్లు శవాలతో పని చేసేవాళ్లు, ఆ తర్వాత మధ్యలో చేతులు కడుగుకోకుండానే బ్రతికున్న రోగులకు వైద్యం చేసేవాళ్లు. ఇలా చేయడం వల్ల చాలామంది చనిపోయారు. కానీ మోషే ధర్మశాస్త్రంలో ఎవరైనా శవాన్ని ముట్టుకుంటే వాళ్లు సంప్రదాయంగా అపవిత్రంగా ఉన్నట్లే. అలాంటి సందర్భాల్లో సాంప్రదాయకంగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలని సూచించబడేవారు. అలాంటి మతపరమైన ఆచారాలకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.—నిర్గమకాండము 19:11, 19.
చెత్తను పడేయడం.
ప్రతీ సంవత్సరం, దాదాపు 50 లక్షల పైనే పిల్లలు విరేచనాలతో చనిపోతున్నారు. ముఖ్యంగా మానవ వ్యర్థాలను సరిగ్గా తొలగించకపోవడం వల్లే అలా జరుగుతుంది. మోషే ధర్మశాస్త్రంలో మనుషులు మలవిసర్జన తర్వాత మట్టితో కప్పిపెట్టేయాలని, ఆ వ్యర్థాలను మనుషులుండే చోటుకు దూరంగా పడేయాలని చెప్పారు.—ద్వితీయోపదేశకాండము 23:13.
సున్నతి చేసే సమయం.
దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పుట్టిన 8వ రోజున మగ పిల్లవాడికి సున్నతి చేయాలి. (లేవీయకాండము 12:3) అప్పుడే పుట్టిన పిల్లలకు రక్తం గడ్డకట్టే సామర్థ్యం పుట్టిన వారం రోజులకు మామూలు స్థితికి వస్తుందని తర్వాత తెలుసుకున్నారు. బైబిలు కాలాల్లో, ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి రాకముందే పుట్టిన వారం రోజుల తర్వాత సున్నతిని చేయడం నిజంగా మంచి రక్షణ.
మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి ఉన్న సంబంధం.
వైద్య పరిశోధకులు, సైన్‌టిస్టులు చెప్తున్నట్లు ఆనందం, నిరీక్షణ, కృతజ్ఞత, క్షమాగుణం లాంటి మంచి లక్షణాలు ఆరోగ్యానికి ప్రయోజనాలు తెస్తాయి. బైబిలు ఇలా అంటుంది: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.”—సామెతలు 17:22.