కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంటుంది?

మీ భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంటుంది?

అదృష్టం లేదా తలరాత బాగుంటే జీవితం కూడా బాగుంటుందని చాలామంది భావిస్తారు. తమకు అంతా మంచే జరగాలని రకరకాల నమ్మకాలు, ఆచారాలు పాటిస్తారు.

నమ్మకాలు, ఆచారాలు

జ్యోతిష్యం: కొంతమంది రాశుల్ని, నక్షత్రాల్ని నమ్ముతారు. ఏ రాశిలో, ఏ నక్షత్రంలో పుట్టాం అనే దానిమీద జీవితం ఆధారపడి ఉంటుందని వాళ్లు అనుకుంటారు. అందుకే భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవడానికి జ్యోతిష్యుల దగ్గరకు వెళ్తారు, అలాగే రాశిఫలాలు చూసుకుంటారు. దోషాలు పోవడానికి, మంచి జరగడానికి కొన్ని ఆచారాలు చేస్తారు.

వాస్తు: ఇంటిని వాస్తు ప్రకారం కడితే కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయని, అన్ని పనుల్లో లాభం పొందుతారని కొంతమంది నమ్ముతారు. a

పూర్వీకుల్ని ఆరాధించడం: కొంతమంది చనిపోయిన తమ కుటుంబ సభ్యుల్ని పూజిస్తారు. అలాచేస్తే వాళ్లు కాపాడతారనీ, ఆశీర్వదిస్తారనీ నమ్ముతారు. వియత్నాంలో ఉంటున్న వాన్‌ b ఇలా చెప్పింది: “చనిపోయిన నా కుటుంబ సభ్యులకు పూజలు చేస్తే వాళ్లు నన్ను, మా పిల్లల్ని దీవిస్తారని, మా భవిష్యత్తు బాగుంటుందని నమ్మాను.”

పునర్జన్మ: ఒక మనిషి చనిపోయాక, మళ్లీ పుడతాడని చాలామంది నమ్ముతారు. పుట్టడం, చనిపోవడం, మళ్లీ పుట్టడం, మళ్లీ చనిపోవడం ఇలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుందనేది వాళ్ల నమ్మకం. గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తారని వాళ్లు అనుకుంటారు.

అయితే చాలామంది, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్తారు. మళ్లీ వాళ్లే జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి చేయి చూపించి జాతకం చెప్పించుకుంటారు, రాశిఫలాలు చూస్తారు, చిలకజోస్యం లాంటివి చెప్పించుకుంటారు. తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆశతో ఇలాంటివి చేస్తారు.

ఫలితం

ఇలాంటి నమ్మకాలను, ఆచారాలను పాటించినవాళ్లు సంతోషంగా ఉన్నారా? మంచి భవిష్యత్తు పొందారా?

వియత్నాంలో ఉంటున్న హైన్‌ అనే వ్యక్తికి ఏం జరిగిందో చూడండి. ఆయన కుటుంబంలో సుఖశాంతులు ఉండడం కోసం, వ్యాపారంలో లాభం పొందడం కోసం జ్యోతిష్యం చెప్పించుకున్నాడు, ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకున్నాడు, పూర్వీకులకు పూజలు కూడా చేశాడు. ఇన్ని చేసినా ఏం జరిగిందో చెప్తూ హైన్‌ ఇలా అన్నాడు: “నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, అప్పుల్లో కూరుకుపోయాను, కుటుంబ గొడవలతో ప్రశాంతత ఉండేది కాదు, మానసికంగా బాగా కృంగిపోయాను.”

తైవాన్‌లో ఉంటున్న యాజు కూడా జ్యోతిష్యాన్ని, పునర్జన్మను, తలరాతను, వాస్తును నమ్మేవాడు. పూర్వీకుల్ని కూడా పూజించేవాడు. వీటన్నిటి గురించి లోతుగా తెలుసుకున్నాక ఆయనిలా చెప్పాడు: “ఇలాంటి నమ్మకాలు, ఆచారాలు ఒకదానితో ఒకటి పొంతన ఉండవు. ఒక ఆచారం ఇలా చేయమంటే, మరో ఆచారం ఇంకోలా చేయమంటుంది. అది చేయాలో, ఇది చేయాలో అర్థమయ్యేది కాదు. పోనీ జ్యోతిష్యులు చెప్పేవి నిజమా అంటే, చాలాసార్లు వాళ్లు చెప్పేవేవీ జరిగేవి కాదు. ఇక పునర్జన్మ విషయానికొస్తే, గత జన్మ జ్ఞాపకాలేవీ లేనప్పుడు ఆ జన్మలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడం, వచ్చే జన్మలో మంచి జీవితం పొందడం ఎలా సాధ్యమౌతుంది?”

“ఇలాంటి నమ్మకాలు, ఆచారాలు ఒకదానితో ఒకటి పొంతన ఉండవు. ఒక ఆచారం ఇలా చేయమంటే, మరో ఆచారం ఇంకోలా చేయమంటుంది. అది చేయాలో, ఇది చేయాలో అర్థమయ్యేది కాదు.”—యాజు, తైవాన్‌

హైన్‌, యాజులాగే చాలామంది, మన జీవితం తలరాత మీద, నక్షత్రాలు-రాశిఫలాల మీద, పూర్వీకుల మీద, పునర్జన్మ మీద అధారపడి ఉండదని తెలుసుకున్నారు. దానర్థం మంచి భవిష్యత్తు పొందడానికి మనం ఏం చేయలేమా? అది మన చేతుల్లో లేదా?

భవిష్యత్తు బాగుండాలంటే ఎక్కువ చదువుకోవాలని, చేతినిండా డబ్బు సంపాదించాలని చాలామంది అంటారు. మరి చదువును, డబ్బును నమ్ముకున్న వాళ్ల జీవితం ఎలా ఉంది? స్వయంగా వాళ్లే ఏం చెప్తున్నారో తర్వాతి పేజీల్లో చూడండి.

a చైనా అలాగే ఇతర ఆసియా దేశాల్లో కూడా ఇలాంటి ఒక పద్ధతినే నమ్ముతారు. దాన్ని ఫెంగ్‌-షుయ్‌ అని పిలుస్తారు.

b పేర్లు మార్చాం.

c ఈ మాటలు పవిత్ర గ్రంథమైన బైబిల్లో గలతీయులు 6:7 లో ఉన్నాయి. ఇలాంటి అర్థమిచ్చే సామెతనే పెద్దవాళ్లు వాడుతూ ఉంటారు. అదేంటంటే: ‘విత్తనం ఒకటైతే, చెట్టు మరొకటి అవుతుందా?’