కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

‘మెఫీబోషెతు మీద దావీదు రాజు కనికరం చూపించాడు’ కానీ ఆ తర్వాత ఆయన మెఫీబోషెతును చంపించాడు అని 2 సమూయేలు 21:7-9 ఎందుకు చెప్తుంది?

ఈ వచనాల్ని గబగబా చదివినవాళ్లకు ఆ ప్రశ్న వచ్చి ఉంటుంది. కానీ అక్కడ ఇద్దరు మెఫీబోషెతుల గురించి ఉంది. అలాగే ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసుకోవడం ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు.

ఇశ్రాయేలు రాజైన సౌలుకు ఏడుగురు కొడుకులు అలాగే ఇద్దరు కూతుళ్లు. సౌలు పెద్ద కొడుకు పేరు యోనాతాను. తర్వాత సౌలుకు రిస్పా అనే ఉపపత్ని ద్వారా ఒక కొడుకు పుట్టాడు. ఆయన అతనికి మెఫీబోషెతు అని పేరు పెట్టాడు. ఆసక్తికరంగా, యోనాతాను కొడుకు పేరు కూడా మెఫీబోషెతే. కాబట్టి రాజైన సౌలు కొడుకుకి, మనవడికి ఒకటే పేరు ఉంది.

ఒక సమయంలో, ఇశ్రాయేలీయుల మధ్య ఉంటున్న గిబియోనీయుల్ని సౌలు అసహ్యించుకొని, వాళ్లందర్నీ చంపించాలని చూశాడు. దానివల్ల గిబియోనీయుల్లో కొంతమంది చనిపోయారు. అది చాలా తప్పు. ఎందుకంటే యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలీయుల ప్రధానులు గిబియోనీయులతో శాంతి ఒప్పందం చేసుకున్నారు.—యెహో. 9:3-27.

ఆ ఒప్పందం రాజైన సౌలు కాలంలో కూడా అమల్లో ఉంది. అయినా దానికి వ్యతిరేకంగా, గిబియోనీయుల్ని పూర్తిగా లేకుండా చేయాలని సౌలు ప్రయత్నించాడు. దానివల్ల “సౌలుమీద, అతని ఇంటివాళ్లమీద రక్తాపరాధం” వచ్చింది. (2 సమూ. 21:1) చివరికి దావీదు రాజైనప్పుడు, మిగిలిన గిబియోనీయులు వచ్చి జరిగిన ఘోరం గురించి ఆయనకు చెప్పారు. సౌలు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగాలన్నా, యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించాలన్నా ఏం చేయాలని దావీదు వాళ్లను అడిగాడు. గిబియోనీయులు డబ్బులు అడిగే బదులు, వాళ్లను ‘పూర్తిగా నాశనం చేయాలని కుట్ర పన్నిన’ సౌలు కుమారుల్లో ఏడుగురిని అప్పగించాలని దావీదును అడిగారు. ఆ తర్వాత వాళ్లను చంపుతామని చెప్పారు. (సంఖ్యా. 35:30, 31) దావీదు వాళ్లు అడిగినదానికి ఒప్పుకున్నాడు.—2 సమూ. 21:2-6.

అప్పటికే సౌలు, యోనాతాను యుద్ధంలో చనిపోయారు. కానీ యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఇంకా బ్రతికేవున్నాడు. చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల అతను కుంటివాడు అయ్యాడు. అలాగే గిబియోనీయుల మీద తన తాత చేయించిన దాడిలో అతను భాగం వహించలేదు. దావీదు తన స్నేహితుడైన యోనాతానుతో చేసుకున్న ఒప్పందం వల్ల, యోనాతాను సంతానం అంటే మెఫీబోషెతు కూడా ప్రయోజనం పొందుతాడు. (1 సమూ. 18:1; 20:42) దానిగురించి బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా ఎదుట … చేసుకున్న ప్రమాణాన్ని బట్టి సౌలు మనవడూ, యోనాతాను కుమారుడూ అయిన మెఫీబోషెతు మీద దావీదు రాజు కనికరం చూపించాడు.”—2 సమూ. 21:7.

అయినా, దావీదు గిబియోనీయులు అడిగింది చేశాడు. వాళ్లకు సౌలు ఇద్దరు కుమారుల్ని అప్పగించాడు, వాళ్లలో ఒకతని పేరు మెఫీబోషెతు. అలాగే సౌలు ఐదుగురి మనవళ్లను అప్పగించాడు. (2 సమూ. 21:8, 9) దావీదు అలా చేయడంవల్ల అప్పటివరకు ఆ దేశం మీదున్న రక్తాపరాధం పోయింది.

ఇది కేవలం జరిగిపోయిన వృత్తాంతం కాదు, దీనినుండి ఎంతో నేర్చుకోవచ్చు. దేవుని నియమం స్పష్టంగా ఇలా చెప్పింది: “తండ్రుల తప్పుల్ని బట్టి పిల్లలకు మరణశిక్ష విధించకూడదు.” (ద్వితీ. 24:16) సౌలు ఇద్దరు కొడుకులు, ఐదుగురు మనవళ్లు ఏ తప్పూ చేయకపోతే వాళ్లను అలా చంపడాన్ని యెహోవా ఆమోదించేవాడు కాదు. ఆ నియమం ఇంకా ఇలా చెప్పింది: “ఒక వ్యక్తికి కేవలం అతని సొంత పాపాన్ని బట్టే మరణశిక్ష విధించాలి.” దీన్నిబట్టి చనిపోయిన ఈ ఏడుగురు సౌలు వంశస్థులు, గిబియోనీయుల మీద సౌలు చేయించిన దాడిలో ఏదోక విధంగా భాగం వహించారని అనిపిస్తుంది. ఆ తప్పు వల్లే ఆ ఏడుగురు శిక్ష అనుభవించారు.

ఈ వృత్తాంతం నుండి ఏం నేర్చుకోవచ్చు? ఒకవ్యక్తి తప్పు చేసి, తాను కేవలం ఇచ్చిన నిర్దేశాన్ని పాటించానని అనుకోవచ్చు లేదా చెప్పవచ్చు. అయినా అతను శిక్ష తప్పించుకోలేడు. ఎందుకంటే అతని పనులకు అతనే బాధ్యత వహించాలి. అందుకే ఒక సామెత ఇలా చెప్తుంది: “కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తిరగకు. చెడు నుండి పక్కకు తప్పుకో.”—సామె. 4:24-27 అధస్సూచి; ఎఫె. 5:15.