పురాతన పాత్రపై కనిపించిన బైబిల్లోని ఒక పేరు
పురావస్తు శాస్త్రజ్ఞులకు 2012లో, మూడు వేల సంవత్సరాల క్రితం నాటి పింగాణీ పాత్ర ముక్కలు దొరికాయి. వాటిపై రాసి ఉన్న కొన్ని మాటల్ని చూసినప్పుడు పరిశోధకులు చాలా ఆశ్చర్యపోయారు.
ఆ పాత్ర ముక్కలన్నిటినీ కలిపినప్పుడు వాళ్లకు కనానీయుల భాషలో రాసివున్న ఒక పేరు కనిపించింది. దానిపై “ఎష్బయలు బెన్ బీడా” అని రాసివుంది. అంటే “బీడా కొడుకైన ఎష్బయలు” అని అర్థం. పురాతన వస్తువుపై ఈ పేరు కనిపించడం ఇదే మొదటిసారి అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఎష్బయలు అనే పేరున్న మరో వ్యక్తి గురించి బైబిల్లో ఉంది. అతను రాజైన సౌలు కొడుకుల్లో ఒకడు. (1 దిన. 8:33; 9:39) పురాతన పాత్రను కనుగొన్న వాళ్లలో ఒకరైన ప్రొఫెసర్ యోసెఫ్ గార్ఫింగ్కల్ ఇలా చెప్పాడు, “రాజైన దావీదు పరిపాలనా కాలంలో ఎష్బయలు అనే పేరు ఉన్నట్లు, బైబిల్లో అలాగే ఇప్పుడు పురావస్తుశాస్త్ర నివేదికల్లో ఉండడం ఆసక్తికరమైన విషయం.” బైబిల్లోని విషయాలు నిజమని పురావస్తుశాస్త్రం ఎందుకు సమర్థిస్తుందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ.
బైబిల్లో సౌలు కొడుకైన ఎష్బయలుకు ఇష్బోషెతు అనే మరోపేరు కూడా ఉంది. (2 సమూ. 2:8-10) “బయలు” అనే పేరు స్థానంలో “బోషెతు” అని ఎందుకు పెట్టారు? ఇశ్రాయేలీయులకు బయలు అనే పేరు విన్నప్పుడు కనానీయులు తుఫాను దేవునిగా ఆరాధించిన బయలు గుర్తొస్తాడు. బహుశా అందుకే రెండవ సమూయేలు పుస్తకాన్ని రాసిన రచయిత బయలు అనే పేరు స్థానంలో బోషెతు అని రాసివుండవచ్చని పరిశోధకులు అంటారు. అయినప్పటికీ మొదటి దినవృత్తాంతాల్లో ఎష్బయలు అనే పేరు మనకు ఇప్పటికీ కనిపిస్తుంది.