అధ్యయన ఆర్టికల్ 1
పాట 2 యెహోవా నీ పేరు
యెహోవాను మహిమపర్చండి
2025 వార్షిక వచనం: “యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి.”—కీర్త. 96:8.
ముఖ్యాంశం
యెహోవాకు చెందాల్సిన మహిమను మనం ఆయనకు ఎలా ఇవ్వవచ్చో తెలుసుకుంటాం.
1. నేడు చాలామంది ఎలా ఉన్నారు?
ప్రపంచంలో నేనే అందరికన్నా ప్రాముఖ్యం అనుకునేవాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? మన చుట్టూ చాలామంది ఇలానే ఉన్నారు. ఉదాహరణకు, సోషల్ మీడియాలో అందరూ తమనే చూడాలని, వాళ్లు సాధించిన వాటిగురించి గొప్పలు చెప్పుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఇప్పుడున్న లోకంలో యెహోవాకు మహిమ ఇవ్వాలని అనుకునేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. అసలు యెహోవాను మహిమపర్చడం అంటే ఏంటో, మనం ఎందుకు అలా మహిమపర్చాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం యెహోవాకు తగిన మహిమను ఎలా ఇవ్వవచ్చో అలాగే భవిష్యత్తులో యెహోవాయే తన పేరును ఎలా మహిమపర్చుకుంటాడో తెలుసుకుంటాం.
యెహోవాను మహిమపర్చడం అంటే ఏంటి?
2. సీనాయి పర్వతం దగ్గర యెహోవా తన మహిమను ఎలా చూపించాడు? ( చిత్రం కూడా చూడండి.)
2 మహిమ అంటే ఏంటి? ఒక వ్యక్తిని గొప్ప చేసే దేని గురించైనా చెప్పడానికి బైబిల్లో “మహిమ” అనే పదాన్ని ఉపయోగించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన కొన్ని రోజులకే ఆయన ఎంత మహిమగల దేవుడో చూపించాడు. ఒక్కసారి ఊహించుకోండి! చుట్టూ లక్షలమంది జనం, మధ్యలో సీనాయి పర్వతం. ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడు చెప్పేది వినడానికి వచ్చారు. ఆ పర్వతం మీద దట్టమైన మేఘం కనిపించింది, ఉన్నట్టుండి ఆ పర్వతాన్ని పొగ కమ్మేసింది, భూమి దద్దరిల్లింది. ఉరుములతో మెరుపులతో పెద్ద బాకా శబ్దం కూడా వినిపించింది. (నిర్గ. 19:16-18; 24:17; కీర్త. 68:8) యెహోవా మహిమను కళ్లారా చూసిన ఆ ఇశ్రాయేలీయులకు ఒళ్లు గగ్గురు పుట్టివుంటుంది.
3. యెహోవాను మనం ఎలా మహిమపర్చవచ్చు?
3 మరి మనుషులంగా మనం యెహోవాను మహిమపర్చగలమా? ఖచ్చితంగా మహిమపర్చగలం. ఒక విధానం ఏంటంటే, యెహోవాకున్న గొప్ప శక్తి గురించి, ఆయనకున్న ఎన్నో మంచిమంచి లక్షణాల గురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన్ని మహిమపరుస్తాం. నిజానికి, మనం చేసే ప్రతీది యెహోవా సహాయంతోనే చేస్తున్నామని గుర్తించినప్పుడు కూడా ఆయన్ని మహిమపరుస్తాం. (యెష. 26:12) యెహోవాను మహిమపర్చే విషయంలో రాజైన దావీదు తిరుగులేని ఆదర్శాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయుల ముందు దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా అన్నాడు: “యెహోవా, గొప్పతనం, బలం, తేజస్సు, వైభవం, ఘనత నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే.” దావీదు ప్రార్థన చేయడం ముగించాక, ‘సమాజంలోని వాళ్లందరూ యెహోవాను స్తుతించారు.’—1 దిన. 29:11, 20.
4. యేసు యెహోవాను ఎలా మహిమపర్చాడు?
4 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తన తండ్రి సహాయంతోనే అద్భుతాలు చేశానని చెప్పడం ద్వారా యెహోవాను మహిమపర్చాడు. (మార్కు 5:18-20) అంతేకాదు, యేసు ప్రజలకు తన తండ్రి గురించి చెప్పిన విషయాల్ని బట్టి, చేసిన పనుల్ని బట్టి కూడా యెహోవాకు మహిమ తీసుకొచ్చాడు. ఒక సందర్భంలో, యేసు సమాజమందిరంలో బోధిస్తున్నాడు. అప్పుడు 18 సంవత్సరాలుగా చెడ్డదూత పట్టిన ఒక స్త్రీ ఆయన చెప్పే విషయాల్ని వింటుంది. ఆ చెడ్డదూత వల్ల ఆమె శరీరం సగానికి వంగిపోయి, నిటారుగా నిలబడలేకపోతుంది. ఆమె పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉంది! యేసు కనికరంతో ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ప్రేమగా ఇలా అన్నాడు: “అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు.” తర్వాత యేసు “ఆమె మీద చేతులు ఉంచాడు. వెంటనే ఆమె నిటారుగా నిలబడింది, దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టింది.” (లూకా 13:10-13) ఇప్పుడు ఆమె బలంగా, ఆరోగ్యంగా తయారైంది కాబట్టి యెహోవాను మహిమపర్చడానికి ఆమెకు పెద్ద కారణం దొరికింది! మనం కూడా ఆమెలాగే చేయవచ్చు.
మనం ఎందుకు యెహోవాను మహిమపర్చాలని అనుకుంటాం?
5. యెహోవాను గౌరవించడానికి మనకు ఎలాంటి కారణాలున్నాయి?
5 మనకు యెహోవా మీద బాగా గౌరవం ఉంది కాబట్టి ఆయన్ని మహిమపరుస్తాం. యెహోవాను గౌరవించడానికి మనకు చాలా కారణాలున్నాయి. యెహోవా సర్వశక్తిమంతుడు, ఆయనకు అంతులేని శక్తి ఉంది. (కీర్త. 96:4-7) ఆయన చేసినవాటిలో ఆయన తెలివి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జీవానికి మూలం యెహోవాయే. బ్రతకడానికి కావాల్సిన ప్రతీది ఆయన మనకు ఇచ్చాడు. (ప్రక. 4:11) ఆయన విశ్వసనీయుడు. (ప్రక. 15:4) ఆయన చేసిన ప్రతీది సఫలమౌతుంది. అలాగే మాటిస్తే అది జరగక తప్పదు. (యెహో. 23:14) అందుకే యిర్మీయా ప్రవక్త యెహోవా గురించి ఇలా అన్నాడు: “దేశాల్లోని తెలివిగల వాళ్లందరిలో, వాళ్ల రాజ్యాలన్నిట్లో నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.” (యిర్మీ. 10:6, 7) నిజంగా మన పరలోక తండ్రియైన యెహోవాను గౌరవించడానికి మనకు చాలా కారణాలున్నాయి. కానీ ఆయన మన గౌరవాన్ని మాత్రమే కాదు, మన ప్రేమను కూడా సంపాదించుకున్నాడు.
6. మనం యెహోవాను ఎందుకు ప్రేమిస్తాం?
6 యెహోవాను మనం ప్రాణంగా ప్రేమిస్తాం కాబట్టి ఆయన్ని మహిమపరుస్తాం. యెహోవాకున్న మంచి లక్షణాల గురించి ఆలోచిస్తే ఆయన మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఉదాహరణకు ఆయన కనికరం, కరుణ గల దేవుడు. (కీర్త. 103:13; యెష. 49:15) యెహోవా మన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాడు. మనం బాధపడితే ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. (జెక. 2:8) తనకు ఫ్రెండ్ అవ్వడానికి, తన గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ఆయనే సహాయం చేస్తున్నాడు. (కీర్త. 25:14; అపొ. 17:27) అలాగే ఆయన వినయంగలవాడు. “భూమ్యాకాశాల్ని వంగి చూస్తాడు. దీనుల్ని మట్టిలో నుండి పైకి ఎత్తుతాడు.” (కీర్త. 113:6, 7) ఇంతగొప్ప దేవుణ్ణి మహిమపర్చాలని ఎవరికి ఉండదు చెప్పండి!—కీర్త. 86:12.
7. మనకు ఎలాంటి అవకాశం ఉంది?
7 ఇతరులు యెహోవా గురించి తెలుసుకోవాలనే కోరికతో మనం ఆయన్ని మహిమపరుస్తాం. చాలామందికి యెహోవా నిజంగా ఎవరో తెలీదు. ఎందుకంటే సాతాను యెహోవా గురించి పచ్చి అబద్ధాలు చెప్తూ, ప్రజల మనసులకు గుడ్డితనం కలుగజేశాడు. (2 కొరిం. 4:4) యెహోవాకు చాలా కోపం అని, మనమంటే అసలు పట్టింపు లేదని, లోకం ఇలా అవ్వడానికి కారణం ఆయనే అని సాతాను మనుషుల్ని నమ్మించాడు. కానీ యెహోవా గురించి నిజమేంటో మనకు తెలుసు. అబద్ధాల్ని వ్యాప్తిచేసే నోళ్లను మూయించే అవకాశం మనకుంది. అలా చేసినప్పుడు యెహోవాకు మహిమ తీసుకొస్తాం. (యెష. 43:10) 96వ కీర్తన అంతా యెహోవాను మహిమపర్చడం గురించే మాట్లాడుతుంది. అందులోని లేఖనాల్ని చర్చిస్తుండగా యెహోవాకు తగిన మహిమను మీరెలా ఇవ్వవచ్చో ఆలోచించండి.
యెహోవాకు తగిన మహిమను మనం ఎలా ఇవ్వవచ్చు?
8. యెహోవాను మహిమపర్చే ఒక విధానం ఏంటి? (కీర్తన 96:1-3)
8 కీర్తన 96:1-3 చదవండి. మన మాటల ద్వారా యెహోవాను మహిమపర్చవచ్చు. ఈ లేఖనాల్లో ఉన్న కొన్ని మాటల్ని గమనించండి: “యెహోవాకు పాట పాడండి; ఆయన పేరును స్తుతించండి,” “ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి,” “దేశాల మధ్య ఆయన మహిమను . . . చాటించండి.” ఇవన్నీ మన పరలోక తండ్రైన యెహోవాను మహిమపర్చే విధానాలు. నమ్మకమైన యూదులు అలాగే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యెహోవా నిజంగా ఎలాంటి దేవుడో, ఆయన వాళ్లకోసం ఎలాంటి మంచి పనులు చేశాడో ఇతరులకు చెప్పడానికి వెనకాడలేదు. (దాని. 3:16-18; అపొ. 4:29) వాళ్లలా మనం ఎలా ఉండవచ్చు?
9-10. ఏంజెలినా ఉదాహరణ నుండి మీరేం నేర్చుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)
9 అమెరికాలో ఉంటున్న ఏంజెలినా a అనే సిస్టర్ ఉదాహరణ గమనించండి. ఆమె పనిచేస్తున్న కంపెనీలో యెహోవా గురించి ధైర్యంగా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే, కొత్తగా చేరినవాళ్లందరికీ కంపెనీవాళ్లు ఒక మీటింగ్ పెట్టారు. అందులో కొత్తవాళ్లందరూ తమను తాము పరిచయం చేసుకుంటూ రెండు మాటలు చెప్పాలి. ఏంజెలినా కూడా అప్పుడే ఉద్యోగంలో చేరింది కాబట్టి ఒక యెహోవాసాక్షిగా ఆమె ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి ఒక స్లైడ్ షో ప్లాన్ చేసుకుంది. అయితే, ఆమె వంతు రాకముందు, ఒకతను లేచి తననుతాను అందరికీ పరిచయం చేసుకుంటూ తను యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగానని చెప్పాడు. అతను మన నమ్మకాల గురించి అందరి ముందు ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. తనకు ఎలా అనిపించిందో ఏంజెలినా ఇలా చెప్తుంది: “భయంతో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కానీ నేనిలా అనుకున్నాను: ‘యెహోవా గురించి అబద్ధాలు చెప్తుంటే నేను ఊరికే ఎలా కూర్చోగలను. ఖచ్చితంగా ఏదోకటి మాట్లాడాలి.’”
10 అతను మాట్లాడడం అయిపోగానే ఏంజెలినా మనసులో చిన్న ప్రార్థన చేసుకుంది. ఆమె అతనితో మృదువుగా ఇలా అంది: “నేను కూడా మీలాగే యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగాను. ఇప్పటికీ యెహోవాసాక్షినే.” పరిస్థితి చాలా వాడీవేడీగా ఉన్నా, ఏంజెలినా ప్రశాంతంగా ఉంది. ఆమె సంతోషంగా తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోల్ని తోటి ఉద్యోగులకు చూపించింది. అలాగే తన నమ్మకాల గురించి గౌరవపూర్వకంగా వివరించింది. (1 పేతు. 3:15) తర్వాత ఏం జరిగింది? ఏంజెలినా మాట్లాడడం ముగించేసరికి ఆ వ్యక్తి మనసు కాస్త కరిగింది. యెహోవాసాక్షిగా పెరిగినప్పుడు తనకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఏంజెలినా ఇలా అంటుంది: “యెహోవా పేరును నిలబెట్టాలి, దానికి ఆయన అర్హుడు. యెహోవా పేరు గురించి మాట్లాడడం నాకు గొప్ప గౌరవం.” ప్రజలు యెహోవాను అగౌరవపర్చినా మనకు మాత్రం ఆయన్ని స్తుతించే, మహిమపర్చే గొప్ప అవకాశం ఉంది.
11. కీర్తన 96:8 లో ఉన్న సూత్రాన్ని యెహోవా ఆరాధకులు ఎలా పాటిస్తూ వచ్చారు?
11 కీర్తన 96:8 చదవండి. మనకున్న డబ్బు, వస్తువులతో యెహోవాను మహిమపర్చవచ్చు. యెహోవా ఆరాధకులు ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. (సామె. 3:9) ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఆలయాన్ని కట్టడానికి, దాన్ని సరైన స్థితిలో ఉంచడానికి విరాళాలు ఇచ్చేవాళ్లు. (2 రాజు. 12:4, 5; 1 దిన. 29:3-9) కొంతమంది శిష్యులు యేసును, ఆయన అపొస్తలులను “తమకున్న వాటితో” ప్రేమగా చూసుకున్నారు. (లూకా 8:1-3) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా కరువు వల్ల అవస్థలు పడుతున్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి విరాళాలు ఇచ్చి సహాయం చేశారు. (అపొ. 11:27-29) మనకాలంలో కూడా మనస్ఫూర్తిగా విరాళాలు ఇవ్వడం ద్వారా మనం యెహోవాను మహిమపర్చవచ్చు.
12. మనం ఇచ్చే విరాళాలు యెహోవాకు ఎలా మహిమను తీసుకొస్తాయి? (చిత్రం కూడా చూడండి.)
12 మన విరాళాలు ఎలా యెహోవాకు మహిమను తీసుకొస్తాయో ఒక ఉదాహరణ గమనించండి. 2020 లో వచ్చిన నివేదిక ప్రకారం, జింబాబ్వేలో చాలాకాలంగా వర్షాలులేక పెద్ద కరువు వచ్చింది. ఎన్నో లక్షలమంది ఆకలితో అలమటించారు. అందులో ప్రిస్క అనే సిస్టర్ కూడా ఉంది. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా ప్రిస్క ఎప్పటిలాగే ప్రతీ బుధవారం, శుక్రవారం ప్రీచింగ్‌కి వెళ్లేది. పొలం దున్నే సమయంలో కూడా ఆమె ప్రీచింగ్ మానలేదు. చుట్టుపక్కలవాళ్లు ఆమెను ఎగతాళి చేస్తూ “ఇలాగైతే నువ్వు ఆకలితో చచ్చిపోతావు” అన్నారు. అప్పుడు ప్రిస్క ధైర్యంగా, “యెహోవా ఎప్పుడూ తన సేవకుల్ని విడిచిపెట్టలేదు” అంది. కొన్ని రోజులకే సంస్థ నుండి ఆమెకు కావాల్సిన ఆహారం, వస్తువులు అందాయి. మనం ఇచ్చిన విరాళాల వల్లే అది సాధ్యమైంది! ప్రిస్కాని ఎగతాళి చేసినవాళ్లు ఆశ్చర్యపోయి, “దేవుడు ఎప్పుడూ నీ చేయి వదిలేయలేదు. ఆయన గురించి మాకు కూడా తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు. వాళ్లలో ఏడుగురు మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టారు.
13. మన పనులు యెహోవాకు ఎలా మహిమను తీసుకొస్తాయి? (కీర్తన 96:9)
13 కీర్తన 96:9 చదవండి. మనం చేసే పనుల ద్వారా యెహోవాను మహిమపర్చవచ్చు. యెహోవా ఆలయంలో పనిచేసే యాజకులు చాలా శుభ్రంగా ఉండేవాళ్లు. (నిర్గ. 40:30-32) వాళ్లలా మనం కూడా శుభ్రంగా ఉండాలి. కానీ మన శరీరం ఒక్కటే శుభ్రంగా ఉంటే సరిపోదు. (కీర్త. 24:3, 4; 1 పేతు. 1:15, 16) యెహోవాకు నచ్చని పనులు చేయకుండా ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం “పాత వ్యక్తిత్వాన్ని” తీసేసుకొని “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవాలి. అంటే చెడ్డ ఆలోచనల్ని, అలవాట్లను తీసేసుకొని యెహోవా గొప్ప లక్షణాలకు తగిన ఆలోచనల్ని, పనుల్ని అలవాటు చేసుకోవాలి. (కొలొ. 3:9, 10) పెద్దపెద్ద తప్పులు చేసినవాళ్లు కూడా యెహోవా సహాయంతో మారి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవచ్చు.
14. జాక్ ఉదాహరణ నుండి మీరేం నేర్చుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)
14 జాక్ అనే వ్యక్తి ఉదాహరణ గమనించండి. ఆయన చాలా క్రూరంగా ఉండేవాడు. అందరూ అతన్ని రాక్షసుడు అని పిలిచేవాళ్లు. అతను చేసిన నేరాలకు మరణశిక్ష పడింది. అయితే, ఈలోపు జైలుకు వచ్చిన ఒక బ్రదర్ జాక్‌ని కలిసి బైబిలు స్టడీ మొదలుపెట్టారు. ఆయన కరుడుగట్టిన నేరస్తుడైనా తన పాత వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి, చివరికి బాప్తిస్మం తీసుకున్నాడు. తన ప్రవర్తనను ఎంతలా మార్చుకున్నాడంటే ఉరితీసే రోజు జైలు గార్డులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న ఒక ఆఫీసర్ ఇలా చెప్తున్నాడు: “ఒకప్పుడు జాక్ అంత నీచమైనవాడు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు ఇంత మంచోడు ఎవ్వరూ లేరు అనిపించుకున్నాడు.” జాక్ చనిపోయిన తర్వాత కొంతమంది బ్రదర్స్ జైల్లో మీటింగ్ చేయడానికి వచ్చారు. అక్కడున్న ఒక ఖైది మొదటిసారి మీటింగ్‌కి వచ్చాడు. అతను అలా రావడానికి కారణమేంటి? జాక్ తన ప్రవర్తనలో చేసుకున్న మార్పుల్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. యెహోవాను ఆరాధించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలని అనుకున్నాడు. నిజంగా, మన పనులు పరలోక తండ్రియైన యెహోవాకు మహిమను తీసుకొస్తాయి.—1 పేతు. 2:12.
రాబోయే రోజుల్లో యెహోవా తన పేరును ఎలా మహిమపర్చుకుంటాడు?
15. రాబోయే రోజుల్లో యెహోవా తన పేరును పూర్తిగా ఎలా మహిమపర్చుకుంటాడు? (కీర్తన 96:10-13)
15 కీర్తన 96:10-13 చదవండి. 96వ కీర్తన చివరి వచనాలు యెహోవాను నీతిగల న్యాయమూర్తి అని, మంచి రాజు అని చెప్తున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో యెహోవా తన పేరును ఎలా మహిమపర్చుకుంటాడు? న్యాయంగా తీర్పుతీర్చడం ద్వారా అలా చేస్తాడు. తన పవిత్రమైన పేరుకు మచ్చ తీసుకొచ్చిన మహాబబులోనును ఆయన త్వరలోనే నాశనం చేస్తాడు. (ప్రక. 17:5, 16; 19:1, 2) ఆ నాశనాన్ని చూసి కొంతమంది యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టవచ్చు. చివరిగా, హార్‌మెగిద్దోన్‌లో యెహోవా సాతాను లోకాన్ని నేలమట్టం చేస్తాడు. తన పేరును దూషిస్తూ వ్యతిరేకించే వాళ్లందర్నీ నాశనం చేస్తాడు. అదే సమయంలో ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన్ని మహిమపర్చడానికి ముందుండే వాళ్లందర్నీ ఆయన కాపాడతాడు. (మార్కు 8:38; 2 థెస్స. 1:6-10) క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో ఉండే చివరి పరీక్ష కల్లా యెహోవా తన పేరును పూర్తిగా పవిత్రపర్చుకుంటాడు. (ప్రక. 20:7-10) ఆ సమయంలో “సముద్రం నీళ్లతో నిండి ఉన్నట్టు, భూమి యెహోవా మహిమను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది.”—హబ. 2:14.
16. మీరేం చేయాలని నిర్ణయించుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)
16 ప్రతీఒక్కరూ యెహోవా పేరుకు తగిన మహిమను చెల్లించినప్పుడు మన ఆనందానికి ఆకాశమే హద్దు! కానీ ఆరోజు వచ్చేవరకు యెహోవాను మహిమపర్చడానికి మనకున్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ విషయం మీద మనందరం మనసుపెట్టేలా పరిపాలక సభ కీర్తన 96:8 ని 2025 వార్షిక వచనంగా తీసుకుంది. “యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి.”
పాట 12 యెహోవా గొప్ప దేవుడు
a కొన్ని పేర్లను మార్చాం.