యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా?
యెహోవాసాక్షులం బైబిలును అధ్యయనం చేయడానికి ఎన్నో అనువాదాలు ఉపయోగించాం. అయితే, ఏదైనా భాషలో పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం అందుబాటులో ఉంటే, ఆ భాషలో మేము దాన్ని ఉపయోగించడానికే ఇష్టపడతాం. ఎందుకంటే, అందులో దేవుని పేరు ఉంటుంది, దాన్ని ఉన్నదున్నట్టుగా అనువదించారు, అది స్పష్టంగా ఉంటుంది.
దేవుని పేరు. బైబిలును ప్రచురించిన కొంతమంది ప్రచురణకర్తలు దాని రచయితకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఉదాహరణకు, ఒక బైబిలు అనువాదంలో, దాని తయారీకి ఏదోవిధంగా సహాయం చేసిన 70 మంది పేర్లను వరుసగా రాశారు. కానీ, దాని రచయిత అయిన యెహోవా దేవుని పేరును మాత్రం వాళ్లు పూర్తిగా వదిలేశారు!
కొత్త లోక అనువాదంలో మాత్రం అలా జరగలేదు. మూలభాషలో దేవుని పేరున్న ప్రతీచోట, కొత్త లోక అనువాదంలో కూడా ఆ పేరు ఉంది. అలా దేవుని పేరు అందులో వేలాదిసార్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తయారుచేసిన కమిటీలోని వాళ్ల పేర్లు మాత్రం అందులో ప్రచురించలేదు.
ఉన్నదున్నట్టుగా అనువదించారు. చాలా అనువాదాలు బైబిల్లోని అసలైన సందేశాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పట్లేదు. ఉదాహరణకు, ఒక అనువాదంలో మత్తయి 7:13 ఇలా ఉంది: “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది.” నిజానికి అక్కడ, మూలభాషలో ‘నరకం’ అనే పదం లేదు, ‘నాశనం’ అనే పదం ఉంది. అయితే చెడ్డవాళ్లంతా నరకాగ్నిలో నిత్యయాతన అనుభవిస్తారని నమ్మడం వల్ల బహుశా ఆ అనువాదకులు ‘నరకం’ అనే పదాన్ని చేర్చివుంటారు. కానీ ఆ నమ్మకానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు. అందుకే, కొత్త లోక అనువాదం ఆ వచనాన్ని ఉన్నదున్నట్టుగా ఇలా అనువదించింది: “నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది.”
స్పష్టంగా అనువదించారు. మంచి అనువాదం అంటే, ఉన్నదున్నట్టుగా మాత్రమే కాదు, అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండేలా అనువదించాలి. ఓ ఉదాహరణ చూడండి. మత్తయి 5:3 లో యేసు చెప్పిన మాటకు, “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అనేది అక్షరార్థం. కానీ ఈ రోజుల్లో ప్రజలకు ఆ మాట అర్థం కాదు కాబట్టి, కొత్త లోక అనువాదం ఆ వచనాన్ని సులువుగా అర్థమయ్యేలా అనువదించింది. అది ఇలా ఉంది: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”
దేవుని పేరును ఉపయోగించడం, ఉన్నదున్నట్టుగా, స్పష్టంగా అనువదించడంతోపాటు కొత్త లోక అనువాదం బైబిలుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే, దాన్ని ఉచితంగా పంచిపెడుతున్నారు. దాని ఫలితంగా లక్షలాది ప్రజలు తమ మాతృభాషలో బైబిలును చదవగలుగుతున్నారు. వాళ్లలో, బైబిలును డబ్బులిచ్చి కొనుక్కోలేనివాళ్లు కూడా ఉన్నారు.