బైబిలు వచనాల వివరణ
మత్తయి 6:33—“ఆయన రాజ్యమును … మొదట వెదకుడి”
“కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.”—మత్తయి 6:33, కొత్త లోక అనువాదం.
“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:33, పరిశుద్ధ గ్రంథము.
మత్తయి 6:33 అర్థమేంటి?
దేవుని రాజ్యం అంటే, భూమ్మీద దేవుని ఇష్టం జరిగేలా చేసే ఒక పరలోక ప్రభుత్వం. (మత్తయి 6:9, 10) ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని రాజ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా చేసుకోవడం ద్వారా దానికి మొదటి స్థానం ఇస్తాడు. a అలాంటి వ్యక్తి దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా నేర్చుకోవడంతో పాటు, అది చేయబోయే మేలుల గురించి ఇతరులకు చెప్తాడు. (మత్తయి 24:14) దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి, ఆ రాజ్యం రావాలని ప్రార్థిస్తాడు కూడా.—లూకా 11:2.
దేవుని నీతిలో ఏది సరైనదో, ఏది తప్పో చెప్పే దేవుని ప్రమాణాలు ఉన్నాయి. (కీర్తన 119:172) కాబట్టి ఒక వ్యక్తి దేవుని నైతిక నియమాల ప్రకారం జీవించినప్పుడు దేవుని నీతికి మొదటి స్థానం ఇస్తాడు, ఆ నియమాలు ఎప్పుడూ మంచే చేస్తాయి.—యెషయా 48:17.
ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు అనే మాటలో, తన రాజ్యానికి, తన ప్రమాణాలకు జీవితంలో మొదటి స్థానం ఇచ్చేవాళ్ల అవసరాలు తీరుస్తానని దేవుడు చేసిన వాగ్దానం ఉంది.—మత్తయి 6:31, 32.
మత్తయి 6:33 సందర్భం
యేసు ఆ మాటల్ని కొండ మీది ప్రసంగంలో చెప్పాడు. అది మత్తయి 5-7 అధ్యాయాల్లో ఉంది. యేసు మాటల్ని వింటున్నవాళ్లలో చాలామంది పేదవాళ్లు. కాబట్టి జీవనోపాధి సంపాదించడం మీదే ముఖ్యంగా దృష్టి పెట్టాలని, దానివల్ల రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి వాళ్లకు ఎక్కువ టైమ్ ఉండదని వాళ్లు అనుకొని ఉంటారు. అయితే దేవుడు మొక్కల్ని, జంతువుల్ని ఎలా చూసుకుంటున్నాడో గమనించమని యేసు వాళ్లను ప్రోత్సహించాడు. తన రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే మనుషుల్ని కూడా అలాగే చూసుకుంటానని దేవుడు మాటిస్తున్నాడు.—మత్తయి 6:25-30.
మత్తయి 6:33 గురించి అపోహలు
అపోహ: దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి ధనవంతుడు అవుతాడు.
వాస్తవం: దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే వాళ్లకు ఆహారం, బట్టలు వంటి అవసరాలు తీరతాయని యేసు చెప్పాడు. (మత్తయి 6:25, 31, 32) అయితే వాళ్లకు సకల సౌఖర్యాలు ఉంటాయని యేసు చెప్పట్లేదు. అలాగే, ఎంత ఎక్కువ డబ్బు ఉంటే దేవుని ఆశీర్వాదం అంత ఎక్కువ ఉన్నట్టు అని కూడా ఆయన చెప్పట్లేదు. నిజానికి యేసు తన మాటల్ని వింటున్నవాళ్లను ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ప్రాకులాడకూడదని హెచ్చరించాడు, వాటివల్ల ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. (మత్తయి 6:19, 20, 24) అపొస్తలుడైన పౌలు దేవుని రాజ్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు, అయినా కొన్నిసార్లు చాలా తక్కువ వసతులతో ఉండాల్సి వచ్చింది. యేసులాగే పౌలు కూడా ఆస్తిపాస్తుల మోజులో ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరించాడు.—ఫిలిప్పీయులు 4:11, 12; 1 తిమోతి 6:6-10.
అపోహ: క్రైస్తవులు బ్రతకడానికి పని చేయాల్సిన అవసరం లేదు.
వాస్తవం: క్రైస్తవులు తమను, తమ కుటుంబాన్ని పోషించడం కోసం పని చేయాలని బైబిలు చెప్తుంది. (1 థెస్సలొనీకయులు 4:11, 12; 2 థెస్సలొనీకయులు 3:10; 1 తిమోతి 5:8) తన శిష్యులు రాజ్యానికి మాత్రమే స్థానం ఇవ్వాలని యేసు చెప్పలేదు, బదులుగా రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పాడు.
ఎవరైతే దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ జీవనోపాధి కోసం పని చేయడానికి ఇష్టపడతారో, వాళ్లు దేవుడు తమ అవసరాలు తీర్చుకోవడానికి సహాయం చేస్తాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—1 తిమోతి 6:17-19.
a “ఇస్తూ ఉండండి” అనే మాటను, ఒక వ్యక్తి ఫలానా పని ఎప్పుడూ చేస్తూ ఉండాలి అనే అర్థాన్నిచ్చే గ్రీకు క్రియాపదం నుండి అనువదించారు. దాన్ని “ఎల్లప్పుడూ ఇవ్వండి“ అని కూడా అనువదించవచ్చు. కాబట్టి రాజ్యానికి ఏదో ఒక్కసారి లేదా అప్పుడప్పుడూ కాదుగానీ ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇవ్వాలి.