చనిపోయాక ఏమి జరుగుతుంది?
బైబిలు ఇచ్చే జవాబు
బైబిలు ఇలా చెప్తుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5; కీర్తన 146:4) కాబట్టి, మనం చనిపోయినప్పుడు, మనం ఉనికిలో ఉండం. చనిపోయినవాళ్లు ఆలోచించలేరు, పని చేయలేరు, లేదా ఏమీ అనుభవించలేరు.
“తిరిగి మన్నైపోదువు”
దేవుడు మొదటి మనిషైన ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు చనిపోయాక మనకు ఏమౌతుందో వివరించాడు. ఆదాము అవిధేయత చూపించినందుకు దేవుడు ఆయనతో, “నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు” అన్నాడు. (ఆదికాండము 3:19) దేవుడు ఆదామును “నేలమంటితో” సృష్టించకముందు, ఆదాము ఉనికిలో లేడు. (ఆదికాండము 2:7) అలాగే, ఆదాము చనిపోయినప్పుడు అతను మన్నైపోయి ఉనికిలో లేకుండా పోయాడు.
ఇప్పుడు చనిపోయేవాళ్లకు కూడా అదే జరుగుతుంది. మనుషుల గురించి, జంతువుల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.”—ప్రసంగి 3:19, 20.
మరణమే ముగింపు కాదు
బైబిలు, తరచూ చావును నిద్రతో పోలుస్తుంది. (కీర్తన 13:3; యోహాను 11:11-14; అపొస్తలుల కార్యములు 7:60) గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తికి, అతని చుట్టూ ఏమి జరుగుతుందో తెలీదు. అదేవిధంగా, చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. నిద్రపోయినవాళ్లను లేపినట్టు దేవుడు చనిపోయినవాళ్లను బ్రతికిస్తాడని బైబిలు బోధిస్తుంది. (యోబు 14:13-15) చనిపోయినవాళ్లలో తిరిగి ఎవరినైతే దేవుడు బ్రతికిస్తాడో, వాళ్ల విషయంలో మరణం ముగింపు కాదు.