మళ్లీ పుట్టడం అంటే అర్థమేమిటి?
బైబిలు ఇచ్చే జవాబు
‘మళ్లీ పుట్టడం’ లేదా ‘కొత్తగా జన్మించడం’ అనే మాట, దేవునికీ మళ్లీ పుట్టిన వ్యక్తికీ మధ్య కొత్తగా మొదలైన సంబంధాన్ని సూచిస్తుంది. (యోహాను 3:3, 7) అలా మళ్లీ పుట్టిన వాళ్లను దేవుడు తన పిల్లలుగా దత్తత తీసుకుంటాడు. (రోమీయులు 8:15, 16; గలతీయులు 4:4, 5; 1 యోహాను 3:1) చట్టబద్ధంగా దత్తత తీసుకోబడిన పిల్లలు వేరే కుటుంబంలో భాగమైనట్టే, మళ్లీ పుట్టినవాళ్లు కూడా దేవుని కుటుంబంలో భాగమౌతారు.—2 కొరింథీయులు 6:16-18.
ఓ వ్యక్తి ఎందుకు మళ్లీ పుట్టాలి?
‘ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు’ అని యేసు చెప్పాడు. (యోహాను 3:3) కాబట్టి మళ్లీ పుట్టడం, ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలించడానికి సిద్ధం చేస్తుంది. ఈ రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది, కాబట్టి మళ్లీ పుట్టడాన్ని “పరలోకమందు భద్రపరచబడియున్న” స్వాస్థ్యాన్ని పొందడంగా బైబిలు వర్ణిస్తోంది. (1 పేతురు 1:3-5) అలా మళ్లీ పుట్టినవాళ్లకు క్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలిస్తారనే హామీని దేవుడు ఇస్తాడు.—2 తిమోతి 2:12; 2 కొరింథీయులు 1:21, 22.
ఒక వ్యక్తి మళ్లీ ఎలా పుడతాడు?
యేసు ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, మళ్లీ పుట్టే వ్యక్తి “నీటిమూలముగాను ఆత్మమూలముగాను” పుడతాడని చెప్పాడు. (యోహాను 3:5) అంటే, ఆ వ్యక్తి మొదట నీటిలో బాప్తిస్మం పొంది ఆ తర్వాత పవిత్రశక్తితో అభిషేకించబడతాడని దానర్థం.—అపొస్తలుల కార్యములు 1:5; 2:1-4.
అలా మళ్లీ పుట్టిన వాళ్లలో మొదటివాడు యేసు. ఆయన ముందు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు, ఆ తర్వాత దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు (లేదా పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇచ్చాడు). ఆ విధంగా, దేవుని ఆధ్యాత్మిక కుమారునిగా తిరిగి పరలోకానికి వెళ్లగలిగే నిరీక్షణతో యేసు మళ్లీ పుట్టాడు. (మార్కు 1:9-11) దేవుడు యేసును ఓ అదృశ్యప్రాణిగా పునరుత్థానం చేసినప్పుడు ఆ నిరీక్షణ నిజమైంది.—అపొస్తలుల కార్యములు 13:32, 33.
మళ్లీ పుట్టిన ఇతరులు కూడా ముందు నీటిలో బాప్తిస్మం పొంది ఆ తర్వాత పవిత్రశక్తితో అభిషేకించబడ్డారు. a (అపొస్తలుల కార్యములు 2:38, 41) అప్పుడు వాళ్లకు పరలోకానికి వెళ్లే నిరీక్షణ ఉంటుంది, వాళ్లు పునరుత్థానమైనప్పుడు ఆ నిరీక్షణ నిజమౌతుంది.—1 కొరింథీయులు 15:42-49.
మళ్లీ పుట్టడం గురించిన అపోహలు
అపోహ: ఎవరైనా రక్షించబడాలన్నా లేదా క్రైస్తవునిగా అవ్వాలన్నా మళ్లీ పుట్టాలి.
వాస్తవం: క్రీస్తు అర్పించిన బలి ఆధారంగా వచ్చే రక్షణ కేవలం మళ్లీ పుట్టినవాళ్లకు, అంటే పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించే అవకాశం ఉన్నవాళ్లకు మాత్రమే కాదు. ఈ భూమ్మీద జీవించే దేవుని రాజ్య పౌరులు కూడా రక్షణ పొందుతారు. (1 యోహాను 2:1, 2; ప్రకటన 5:9, 10) రక్షణ పొందే ఈ రెండవ గుంపు క్రైస్తవులకు, పరదైసుగా మారిన భూమ్మీద నిత్యం జీవించే అవకాశం ఉంది.—కీర్తన 37:29; మత్తయి 6:9, 10; ప్రకటన 21:1-5.
అపోహ: ఎవరు మళ్లీ పుట్టాలో ఎవరికివాళ్లే నిర్ణయించుకోవచ్చు.
వాస్తవం: దేవునితో స్నేహం చేసి, రక్షణ పొందే అవకాశం ప్రతీఒక్కరికి ఉంది. (1 తిమోతి 2:3, 4; యాకోబు 4:8) కానీ ఎవరు మళ్లీ పుట్టాలి లేదా ఎవరు పవిత్రశక్తితో అభిషేకించబడాలి అనేది మాత్రం దేవుడే నిర్ణయిస్తాడు. మళ్లీ పుట్టడం అనేది ‘ఓ వ్యక్తి కోరిక మీదో, అతని ప్రయత్నం మీదో ఆధారపడి ఉండదు కానీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది’ అని బైబిలు చెప్తోంది. (రోమీయులు 9:16, NW) ‘మళ్లీ పుట్టడం’ అనే మాటకు ‘పైనుండి పుట్టడం’ అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఎవరు మళ్లీ పుట్టాలో దేవుడే నిర్ణయిస్తాడు తప్ప ఎవరికివాళ్లు సొంతగా నిర్ణయించుకోలేరని దీన్నిబట్టి చెప్పవచ్చు.—యోహాను 3:3.
a కానీ కొర్నేలి, అతనితోపాటు ఉన్నవాళ్లు మాత్రం మొదట పవిత్రశక్తితో అభిషేకించబడ్డారు.—అపొస్తలుల కార్యములు 10:44-48.