నెఫీలీయులు ఎవరు?
బైబిలు ఇచ్చే జవాబు
నోవహు రోజుల్లో చెడ్డ దేవదూతలు మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల పుట్టిన సంకరజాతి పిల్లలే నెఫీలీయులు. వాళ్లు భారీకాయులు, క్రూరులు. a
‘దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని’ గమనించినట్లు బైబిలు చెప్తుంది. (ఆదికాండము 6:2) నిజానికి, ఆ “దేవుని కుమారులు” దేవుని మీద తిరుగుబాటు చేసిన అదృశ్య ప్రాణులు. వాళ్లు పరలోకంలో “తాము ఉండాల్సిన చోటును వదిలేసి” భూమ్మీదికి వచ్చి మనిషి రూపం ధరించి ‘తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు.’—యూదా 6; ఆదికాండము 6:2.
ఆ సృష్టి విరుద్ధమైన కలయిక వల్ల పుట్టిన సంకరజాతి పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండేవాళ్లు కాదు. (ఆదికాండము 6:4) వాళ్లు భారీకాయులు, అందర్నీ హింసించేవాళ్లు. ఆ దౌర్జన్యపరులు భూమిని హింసతో నింపేశారు. (ఆదికాండము 6:13) బైబిలు వాళ్లను “పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు” అని పిలుస్తోంది. (ఆదికాండము 6:4) కొంతకాలానికి, వాళ్లలాగే ప్రజలందరూ దౌర్జన్యపరులుగా తయారయ్యారు.—ఆదికాండము 6:5; సంఖ్యాకాండము 13:33. b
నెఫీలీయుల గురించి అపోహలు
అపోహ: ఇప్పటికీ భూమ్మీద నెఫీలీయులు ఉన్నారు.
నిజం: ప్రాచీన కాలంలో యెహోవా భూమ్మీద ఒక గొప్ప జలప్రళయం రప్పించి భూమిని హింసతో నింపేసిన ప్రజలందర్నీ నాశనం చేశాడు. వాళ్లతోపాటే నెఫీలీయులందరూ నాశనమయ్యారు. యెహోవాకు నచ్చినట్లు జీవించిన నోవహు, ఆయన కుటుంబం మాత్రమే ఆ కాలంలోని జలప్రళయం నుండి రక్షించబడ్డారు—ఆదికాండము 6:9; 7:12, 13, 23; 2 పేతురు 2:5.
అపోహ: నెఫీలీయుల తండ్రులు మనుషులు.
నిజం: బైబిలు వాళ్ల తండ్రులను “దేవుని కుమారులు” అని పిలుస్తుంది. (ఆదికాండము 6:2) దేవదూతల్ని వర్ణించడానికి కూడా బైబిలు అదే పదాన్ని ఉపయోగించింది. (యోబు 1:6; 2:1; 38:7; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) దేవదూతలకు మనిషి రూపం ధరించే శక్తి ఉండేది. (ఆదికాండము 19:1-5; యెహోషువ 5:13-15) అపొస్తలుడైన పౌలు “బంధించబడివున్న దేవదూతల” గురించి మాట్లాడాడు. “ఆ దూతలు నోవహు కాలంలో అవిధేయులయ్యారు” అని కూడా ఆయన చెప్పాడు. (1 పేతురు 3:19, 20) ఆ సందర్భం గురించే మాట్లాడుతూ బైబిలు రచయిత యూదా కూడా, కొందరు దేవదూతలు ‘తమ అసలు స్థానాన్ని కాపాడుకోకుండా, తాము ఉండాల్సిన చోటును వదిలేశారు’ అని చెప్పాడు—యూదా 6.
అపోహ: భూమ్మీద పడేయబడిన దేవదూతలే నెఫీలీయులు.
నిజం: ఆదికాండము 6:4 సందర్భాన్ని గమనిస్తే నెఫీలీయులు దేవదూతలు కాదుగానీ, మనిషి రూపం ధరించిన దేవదూతలకు, స్త్రీలకు పుట్టిన సంకరజాతి సంతానమని అర్థమౌతుంది. ఆ దేవదూతలు ‘తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్న” తర్వాత, యెహోవా ఆ కాలంలో ఉన్న దైవభక్తిలేని ప్రజల మీద 120 ఏళ్లలో చర్య తీసుకుంటానని చెప్పాడు. (ఆదికాండము 6:1-3) బైబిలు ఇంకా ఇలా చెప్తుంది, “ఆ దినములలో” మనిషి రూపం ధరించిన దేవదూతలు “నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు [నెఫీలీయులు] వీరే.”—ఆదికాండము 6:4.
a ‘నెఫీలీయులు’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి బహుశా “పడేసేవాళ్లు” అనే అర్థం ఉండవచ్చు. “హింసించడానికి, దోచుకోవడానికి మనుషుల మీద పడి వాళ్లను కిందపడేలా చేసేవాళ్లు” అనే అర్థం ఆ పదానికి ఉండవచ్చని విల్సన్స్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ వర్డ్ స్టడీస్ చెప్తుంది.
b సంఖ్యాకాండము 13:33 లో ఉన్న మాటలు చెప్పిన వ్యక్తులకు, కొంతమంది ప్రజలను చూసినప్పుడు వందల సంవత్సరాల క్రితమే చనిపోయిన నెఫీలీయులు గుర్తుకొచ్చారు.—ఆదికాండము 7:21-23.