మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు?
బైబిలు ఇచ్చే జవాబు
మీరు దేవుని గురించి తెలుసుకొని ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే ఆయనకు దగ్గరవ్వవచ్చు. అప్పుడు దేవుడు “మీకు దగ్గరౌతాడు.” (యాకోబు 4:8) బైబిలు ఇలా మాటిస్తుంది, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.”—అపొస్తలులు కార్యాలు 17:27.
దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏం చేయాలి?
బైబిలు చదవండి
బైబిలు ఏం చెప్తుంది? “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.”—2 తిమోతి 3:16.
దానర్థం: దేవుడే బైబిల్ని రాయించాడు. ఆయన తన ఆలోచనల్ని బైబిలు రాసినవాళ్ల మనసుల్లో పెట్టాడు. ఈ ప్రత్యేక పుస్తకం ద్వారా, మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలియజేశాడు. అంతేకాదు ఆయనకు ఉన్న ప్రేమ, న్యాయం, కరుణ వంటి లక్షణాల్ని తెలియజేశాడు.—నిర్గమకాండం 34:6; ద్వితీయోపదేశకాండం 32:4.
మీరేమి చేయవచ్చు? ప్రతిరోజూ బైబిలు చదవండి. (యెహోషువ 1:8) తర్వాత, ‘ఇది దేవునికున్న ఏ లక్షణం గురించి తెలియజేస్తుంది?’ అని ఆలోచించండి.—కీర్తన 77:12.
ఉదాహరణకు, యిర్మీయా 29:11 చదివి ఇలా ఆలోచించండి: ‘దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, శాంతినా లేక విపత్తునా? ఆయన పగ తీర్చుకునే దేవుడా లేక నాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడా?’
సృష్టిని గమనించండి
బైబిలు ఏం చెప్తుంది? “[దేవుని] అదృశ్య లక్షణాలు ... లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు.”—రోమీయులు 1:20.
దానర్థం: ఒక చిత్రం చిత్రకారుని గురించి, ఒక సంశ్లిష్ట యంత్రం దాన్ని తయారుచేసిన వ్యక్తి గురించి తెలియజేసినట్టే, దేవుడు చేసిన సృష్టి ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. ఉదాహరణకు, మనిషి మెదడుకు ఉన్న సామర్థ్యం, దాని సంశ్లిష్ట నిర్మాణం దేవునికి ఎంత తెలివి ఉందో తెలియజేస్తున్నాయి. అలాగే సూర్యుడిలో, నక్షత్రాల్లో ఉన్న శక్తి దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియజేస్తుంది.—కీర్తన 104:24; యెషయా 40:26.
మీరేమి చేయవచ్చు? మీ చుట్టూ ఉన్న సృష్టిని గమనించడానికి సమయం తీసుకోండి. తర్వాత ఇలా ఆలోచించండి, ‘ప్రకృతిలో కనిపించే అద్భుతమైన డిజైన్లు దేవుని గురించి ఏం చెప్తున్నాయి?’ a అయితే సృష్టిని గమనించడం ద్వారా దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకోలేం. అందుకే ఆయన మనకు బైబిల్ని ఇచ్చాడు.
దేవుని పేరును ఉపయోగించండి
బైబిలు ఏం చెప్తుంది? “అతనికి నా పేరు తెలుసు కాబట్టి నేను అతన్ని కాపాడతాను. అతను నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను.”—కీర్తన 91:14, 15.
దానర్థం: దేవుడు తన పేరును తెలుసుకొని, దాన్ని గౌరవపూర్వకంగా ఉపయోగించేవాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. దేవుని పేరు యెహోవా. b (కీర్తన 83:18; మలాకీ 3:16) తన పేరును మనకు తెలియజేయడం ద్వారా ఆయన తనను మనకు పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, “నేను యెహోవాను. ఇదే నా పేరు.”—యెషయా 42:8.
మీరేమి చేయవచ్చు? యెహోవా గురించి మాట్లాడేటప్పుడు ఆయన పేరును ఉపయోగించండి.
ప్రార్థన ద్వారా యెహోవాతో మాట్లాడండి
బైబిలు ఏం చెప్తుంది? “తనకు మొరపెట్టే వాళ్లందరికీ ... యెహోవా దగ్గరగా ఉన్నాడు.”—కీర్తన 145:18.
దానర్థం: విశ్వాసంతో తనకు ప్రార్థించేవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు. ప్రార్థన మన ఆరాధనలో ఒక భాగం, అది దేవుని మీద మనకు ప్రగాఢ గౌరవం ఉందని చూపిస్తుంది.
మీరేమి చేయవచ్చు? తరచూ దేవునికి ప్రార్థించండి. (1 థెస్సలొనీకయులు 5:17) మీ ఆందోళనల గురించి, మీ భావాల గురించి ఆయనకు చెప్పండి.—కీర్తన 62:8. c
దేవుని మీద విశ్వాసం వృద్ధి చేసుకోండి
బైబిలు ఏం చెప్తుంది? “విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం.”—హెబ్రీయులు 11:6.
దానర్థం: దేవునికి దగ్గరవ్వాలంటే, మనకు ఆయన మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదని బైబిలు చెప్తుంది. విశ్వాసం అంటే దేవున్ని, ఆయన వాగ్దానాల్ని, ఆయన ప్రమాణాల్ని పూర్తిగా నమ్మడం. మంచి అనుబంధానికి నమ్మకం పునాది లాంటిది.
మీరేమి చేయవచ్చు? నిజమైన విశ్వాసం జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. (రోమీయులు 10:17) కాబట్టి బైబిల్ని లోతుగా పరిశీలించి, దేవున్ని, ఆయన సలహాల్ని నమ్మవచ్చని మీరే తెలుసుకోండి. యెహోవాసాక్షులు మీతో బైబిలు స్టడీ చేయడానికి సంతోషిస్తారు. d
దేవుణ్ణి సంతోషపెట్టేలా నడుచుకోండి
బైబిలు ఏం చెప్తుంది? “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే.”—1 యోహాను 5:3.
దానర్థం: తన ఆజ్ఞలు పాటించడానికి వీలైనంతగా కృషిచేస్తూ, అలా తనపై ప్రేమ చూపించేవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు.
మీరేమి చేయవచ్చు? మీరు బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు, దేవుడు వేటిని ఇష్టపడతాడో, వేటిని ఇష్టపడడో గమనించండి. ‘నా సృష్టికర్తను సంతోషపెట్టడానికి నేను ఏ మార్పులు చేసుకోగలను?’ అని ఆలోచించండి.—1 థెస్సలొనీకయులు 4:1.
దేవుని సలహాలు పాటిస్తూ, ఆయన శ్రద్ధను రుచిచూడండి
బైబిలు ఏం చెప్తుంది? “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి.”—కీర్తన 34:8.
దానర్థం: తన మంచితనాన్ని స్వయంగా రుచిచూసి తెలుసుకోమని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రేమను, మద్దతును చవిచూసినప్పుడు, ఆయనకు దగ్గరవ్వాలని మీకు అనిపిస్తుంది.
మీరేమి చేయవచ్చు? మీరు బైబిలు చదువుతున్నప్పుడు నేర్చుకున్న దేవుని సలహాలు పాటిస్తూ, వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తున్నాయో గమనించండి. (యెషయా 48:17, 18) అలాగే దేవుని సహాయంతో సవాళ్లు అధిగమించిన, తమ జీవితాన్ని అలాగే తమ కుటుంబ సభ్యుల జీవితాల్ని మెరుగుపర్చుకొని నిజమైన సంతోషాన్ని కనుగొన్న నిజ జీవిత ఉదాహరణలు గమనించండి. e
దేవుణ్ణి తెలుసుకోవడం గురించి కొన్ని అపోహలు
అపోహ: దేవుడు చాలా శక్తిమంతుడు, గొప్పవాడు. మనం తనకు దగ్గరవ్వాలని ఎప్పటికీ కోరుకోడు.
నిజం: దేవుడు అందరికన్నా శక్తిమంతుడు, గొప్పవాడు అయినా మనల్ని తనకు దగ్గరవ్వమని ఆహ్వానిస్తున్నాడు. అలా దేవునికి దగ్గరి స్నేహితులైన చాలామంది స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.—అపొస్తలుల కార్యాలు 13:22; యాకోబు 2:23.
అపోహ: దేవుడు ఒక మర్మం, మనం ఆయన్ని ఎప్పటికీ తెలుసుకోలేం.
నిజం: దేవుని గురించిన కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి, ఉదాహరణకు ఆయన మన కంటికి కనబడని వ్యక్తి అనే విషయం. అయినా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు. నిజానికి మనం శాశ్వత జీవితం పొందాలంటే ఆయన్ని తెలుసుకోవాలని బైబిలు చెప్తుంది. (యోహాను 17:3) బైబిలు మనకు అర్థమయ్యే మాటల్లో మన సృష్టికర్త గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, మనుషులు-భూమి విషయంలో ఆయన ఉద్దేశం గురించి, అలాగే ఆయన ప్రమాణాల గురించి వివరిస్తుంది. (యెషయా 45:18, 19; 1 తిమోతి 2:4) అంతేకాదు, మనం చూసినట్లు దేవుని పేరును కూడా బైబిలు తెలియజేస్తుంది. (కీర్తన 83:18) కాబట్టి మనం దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయనకు దగ్గరవ్వవచ్చు కూడా.—యాకోబు 4:8.
a ప్రకృతిలో దేవుని తెలివి ఎలా కనిపిస్తుందో చూపించే ఉదాహరణల కోసం “సృష్టిలో అద్భుతాలు” అనే ఆర్టికల్స్ చూడండి.
b యెహోవా అనే పేరుకు “ఆయన అయ్యేలా చేస్తాడు” అనే అర్థముందని చాలామంది చెప్తారు. దేవుడు తన పేరును మనకు చెప్పడం ద్వారా ఇలా అంటున్నాడు: ‘నా ఇష్టాన్ని, ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను. నేను ఎల్లప్పుడూ నా మాట నిలబెట్టుకుంటాను.’
c “ఎందుకు ప్రార్థించాలి? దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా?” అనే ఆర్టికల్ చూడండి.
d ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.
e “బైబిలు జీవితాలను మారుస్తుంది” ఆర్టికల్స్ చూడండి.