మరియ దేవుని తల్లా?
బైబిలు ఇచ్చే జవాబు
కాదు, మరియ దేవుని తల్లి అని బైబిలు బోధించడం లేదు. అంతేకాదు, మరియను ఆరాధించడం లేదా పూజించడం లాంటివి చేయమని కూడా బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. a ఈ కింది విషయాలను గమనించండి:
తాను దేవుని తల్లినని మరియ ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆమె ‘దేవుని కుమారుడికి’ జన్మనిచ్చిందేగానీ దేవునికి కాదని బైబిలు వివరిస్తుంది.—మార్కు 1:1; లూకా 1:32.
మరియ దేవుని తల్లని, లేదా ఆమె ఆరాధనకు అర్హురాలని యేసు ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి, యేసు తల్లిగా మరియ సంతోషంగా ఉంటుంది అని ఒక స్త్రీ అన్నప్పుడు, యేసు ఆమెను సరిదిద్దుతూ ఇలా అన్నాడు: “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!”—లూకా 11:27, 28.
“దేవుని తల్లి,” “తియోటొకోస్” (దేవున్ని మోసింది) అనే పదాలు బైబిల్లో లేవు.
బైబిల్లో “ఆకాశ రాణి” అనే పదం మరియను సూచించడం లేదు గానీ మతభ్రష్ట ఇశ్రాయేలీయులు ఆరాధించిన అబద్ధ దేవతలను సూచిస్తుంది. (యిర్మీయా 44:15-19) బహుశా “ఆకాశ రాణి” బబులోను దేవతైన ఇష్తార్ను (అష్తారోతు) సూచిస్తుండవచ్చు.
తొలి క్రైస్తవులు మరియను ఆరాధించడం గానీ, ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం గానీ చేయలేదు. వాళ్లు “అన్యమత ఆచారాల్ని వ్యతిరేకించారు. అంతేకాదు మరియ మీదే ఎక్కువ శ్రద్ధ వహిస్తే అది దేవత ఆరాధనకు దారితీస్తుందని వాళ్లు భయపడి ఉండవచ్చు” అని ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు—ఇన్ క్వెష్ట్ ఆఫ్ ది జూయిష్ మేరి.
దేవుడు ఎప్పుడూ ఉనికిలో ఉన్నాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 90:1, 2; యెషయా 40:28) ఆయనకు ఆరంభం లేదు కాబట్టి ఆయనకు తల్లి కూడా ఉండే అవకాశం లేదు. ఇంకా, మరియ దేవున్ని తన గర్భంలో పట్టి ఉంచలేదు; ఎందుకంటే, ఆకాశమహాకాశాలే దేవున్ని పట్టి ఉంచలేవని బైబిలు స్పష్టంగా చెప్తుంది.—1 రాజులు 8:27.
మరియ “దేవుని తల్లి” కాదు యేసు తల్లి
మరియ యూదా గోత్రంలో పుట్టింది, ఆమె దావీదు రాజు వంశం నుండి వచ్చింది. (లూకా 3:23-31) మరియ తనకున్న విశ్వాసం, భక్తి వల్ల దేవునికి ఇష్టురాలైంది. (లూకా 1:28) అందుకే యేసు తల్లి అవ్వడానికి దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. (లూకా 1:31, 35) మరియ, ఆమె భర్త యోసేపుకు ఇంకా ఇతర పిల్లలు కూడా పుట్టారు.—మార్కు 6:3.
మరియ యేసు శిష్యురాలైందని బైబిలు చెప్తునప్పటికీ, ఆమె గురించి అదనపు వివరాలు తెలియజేయడం లేదు.—అపొస్తలుల కార్యాలు 1:14.
a చాలా క్రైస్తవ మతశాఖలు మరియ దేవుని తల్లి అని బోధిస్తున్నాయి. వాళ్లు ఆమెను “ఆకాశ రాణి” లేదా తియోటొకోస్ అని భావిస్తున్నారు. ఈ తియోటొకోస్ అనే గ్రీకు పదానికి “దేవున్ని మోసింది” అని అర్థం.