గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?
బైబిలు ఇచ్చే జవాబు
బైబిలు “గర్భస్రావం” అనే పదాన్ని, కావాలని కడుపులో ఉన్న పిండాన్ని చంపడమనే భావంతో ఉపయోగించకపోయినప్పటికీ, బైబిల్లో చాలా లేఖనాలు దేవుడు మనిషి జీవాన్ని, ఇంకా పుట్టని బిడ్డ జీవాన్ని ఎలా చూస్తాడో చెప్తున్నాయి.
జీవం దేవుడు ఇచ్చిన బహుమానం. (ఆదికాండం 9:6; కీర్తన 36:9) అందరి జీవం, ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డ జీవం కూడా ఆయనకు చాలా విలువైనది. కాబట్టి ఎవరైనా కావాలని కడుపులో ఉన్న బిడ్డను చంపితే, అది హత్యతో సమానం.
ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: ‘మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, నెలలు నిండకుండానే ఆమె బిడ్డను కన్నది కానీ ప్రాణాపాయం ఏమీ జరగలేదనుకోండి; అప్పుడు ఆమె భర్త మోపే నష్టపరిహారాన్ని గాయం చేసిన వ్యక్తి చెల్లించాలి. న్యాయమూర్తుల ద్వారా అతను దాన్ని చెల్లించాలి. కానీ ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.’—నిర్గమకాండము 21:22, 23, NW. a
మనిషి జీవం ఎప్పుడు మొదలౌతుంది?
తల్లి గర్భవతి అయినప్పటి నుండే దేవుని దృష్టిలో ఆ బిడ్డ జీవం మొదలైనట్టు. దేవుడు ఇంకా పుట్టని బిడ్డను కూడా ఒక వ్యక్తిలాగే చూస్తాడని బైబిలు చాలాసార్లు చెప్పింది. కడుపులో ఉన్న బిడ్డను, పుట్టిన బిడ్డను దేవుడు ఒకేలా చూస్తాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి:
పవిత్రశక్తి ప్రేరణతో దావీదు రాజు దేవునితో ఇలా అన్నాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను.” (కీర్తన 139:16) దావీదు ఇంకా పుట్టకముందే దేవుడు అతన్ని ఒక వ్యక్తిలా చూశాడు.
అంతేకాదు, యిర్మీయా ప్రవక్త విషయంలో తనకు ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉందని అతను ఇంకా పుట్టకముందే దేవునికి తెలుసు. దేవుడు అతనితో ఇలా అన్నాడు: “గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.”—యిర్మీయా 1:4, 5.
బైబిలు రచయిత, వైద్యుడు అయిన లూకా అప్పుడే పుట్టిన శిశువును, ఇంకా పుట్టని శిశువును వర్ణించడానికి ఒకే గ్రీకు పదం వాడాడు.—లూకా 1:41; 2:12, 16.
గర్భస్రావం చేయించుకున్నవాళ్లను దేవుడు క్షమిస్తాడా?
గర్భస్రావం చేయించుకున్నవాళ్లు దేవుని క్షమాపణ పొందవచ్చు. దేవుడు జీవాన్ని ఎలా చూస్తాడో తెలుసుకుని దాన్ని అంగీకరిస్తే, వాళ్లు తప్పు చేశామన్న బాధ నుండి బయటపడవచ్చు. ‘యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసమృద్ధిగలవాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.’ b (కీర్తన 103:8-12) గర్భస్రావంతో సహా గతంలో చేసిన పాపాలన్నిటి విషయంలో నిజంగా పశ్చాత్తాపం చూపించేవాళ్లను యెహోవా క్షమిస్తాడు.—కీర్తన 86:5.
తల్లికి లేదా బిడ్డకు ప్రాణాపాయం ఉన్నప్పుడు గర్భస్రావం చేయించుకోవడం తప్పా?
ఇంకా పుట్టని బిడ్డ జీవం కూడా విలువైనదే అని బైబిలు చెప్తుంది కాబట్టి, తల్లికి లేదా బిడ్డకు ప్రాణాపాయం ఉండవచ్చేమో అనే కారణంతో గర్భస్రావం చేయించడం తప్పు.
ఒకవేళ ప్రసవ సమయంలో అరుదైన అత్యవసర పరిస్థితి ఏర్పడి, తల్లి ప్రాణం కాపాడాలా లేక బిడ్డ ప్రాణం కాపాడాలా అని నిర్ణయించుకోవాల్సి వస్తే అప్పుడేంటి? అలాంటి పరిస్థితుల్లో ఎవరి ప్రాణం కాపాడాలనేది వ్యక్తిగత నిర్ణయం.
a ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ నియమం, తల్లికి జరిగే ప్రాణాపాయం గురించి చెప్తుంది కానీ, కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదని కొంతమంది అనువాదకులు అనుకుంటారు. కానీ హీబ్రూ భాషలోని మాటలు తల్లికి, బిడ్డకు ఇద్దరికీ వర్తిస్తాయి.
b బైబిలు ప్రకారం, యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.