అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్ చేయడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిలు ఇచ్చే జవాబు
భార్యాభర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధాలు ఉండేలా దేవుడు మనుషుల్ని సృష్టించాడు. (ఆదికాండము 1:27, 28; లేవీయకాండము 18:22; సామెతలు 5:18, 19) ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా వేరే పురుషునితోగానీ, స్త్రీతోగానీ సంబంధం పెట్టుకోవడం తప్పని బైబిలు చెప్తుంది. అలాగే, భార్య తన భర్తతో కాకుండా వేరే స్త్రీతోగానీ, పురుషునితోగానీ సంబంధం పెట్టుకోవడం తప్పు. (1 కొరింథీయులు 6:18) అందులో శారీరకంగా కలవడం, ఇతరుల మర్మాంగాలను నిమరడం, ఓరల్ సెక్స్ (ముఖరతి) లేదా ఆనల్ సెక్స్ (ఆసన సంభోగం) వంటివి కూడా ఉన్నాయి.
అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్ చేయడాన్ని బైబిలు ఖండిస్తున్నప్పటికీ, అలాంటి వాటిని చేసేవాళ్లను ద్వేషించమని లేదా అసహ్యించుకోమని బైబిలు చెప్పడంలేదు. బదులుగా బైబిలు, “అందర్నీ గౌరవించండి” అని క్రైస్తవులకు సలహా ఇస్తుంది.—1 పేతురు 2:17, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
ఒక వ్యక్తికి స్వలింగ కోరికలు పుట్టుకతోనే వస్తాయా?
దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపంచేసే బలహీనత మనందరికీ పుట్టుకతోనే వస్తుందని బైబిలు చెప్తున్నప్పటికీ, స్వలింగ కోరికలు (అబ్బాయిలకు అబ్బాయిలతో, అమ్మాయిలకు అమ్మాయిలతో సెక్స్ చేయాలనే కోరిక) పుట్టుకతోనే వస్తాయో లేదో బైబిలు చెప్పడం లేదు. (రోమీయులు 7:21-25) అవి ఎందుకు కలుగుతాయో చెప్పే బదులు, బైబిలు వాటికి దూరంగా ఉండమని నొక్కిచెప్తుంది.
ఒక వ్యక్తికి అలాంటి కోరికలు ఉన్నప్పటికీ దేవున్ని ఎలా సంతోషపెట్టవచ్చు?
బైబిలు ఇలా చెప్తుంది, “మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి,” అంటే ప్రతీవిధమైన అనైతిక లైంగిక కోరికల్ని “వదులుకోవాలి.” (కొలొస్సయులు 3:5, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) తప్పుడు పనులకు దారితీసే కోరికల్ని చంపేయాలంటే మీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి. మీ మనసును మంచి విషయాలతో నింపుకుంటే, చెడు కోరికల్ని వెంటనే తరిమికొట్టగలరు. (ఫిలిప్పీయులు 4:8; యాకోబు 1:14, 15) అలా చేయడం మొదట్లో మీకు కష్టమనిపించినా, కొంతకాలానికి అలవాటు అవ్వవచ్చు. “మీ మనసు విషయంలో” మీరు కొత్తవారిగా అయ్యేలా సహాయం చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు.—ఎఫెసీయులు 4:22-24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండి, స్త్రీపురుషుల మధ్య ఉండే సాధారణమైన లైంగిక కోరికలున్న లక్షలాదిమంది కూడా ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు, పెళ్లయ్యే అవకాశం లేక ఒంటరిగా ఉన్నవాళ్లు, లేదా సెక్స్‌లో పాల్గొనలేని భర్త/భార్య ఉన్నవాళ్లు, ఎలాంటి శోధనలు ఎదురైనాసరే తమ లైంగిక కోరికల్ని అదుపులో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు. స్వలింగ కోరికలు ఉన్న ఇతరులు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని నిజంగా కోరుకుంటే అలాగే చేయవచ్చు.—ద్వితీయోపదేశకాండము 30:19.