కుటుంబం కోసం
నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
స్కూల్లో తనను ఎవరో బాగా ఏడ్పిస్తున్నారని మీ అబ్బాయి చెప్పాడనుకోండి. మీరేం చేస్తారు? ఏడ్పించే పిల్లల్ని శిక్షించమని స్కూల్ అధికారులకు చెప్తారా? లేదా తనను ఏడ్పిస్తున్న వాళ్లను ఎలా తిరిగి ఏడ్పించవచ్చో మీ అబ్బాయికి నేర్పిస్తారా? ఏం చేయాలో నిర్ణయించుకునే ముందు ఏడ్పించడం గురించి కొన్ని అంశాలు తెలుసుకోండి. a
ఏడ్పించడం అంటే ఏంటో నాకు నిజంగా తెలుసా?
ఏడ్పించడం అంటే ఏంటి? ఏడ్పించడం అంటే ఒకరిని అదేపనిగా, కావాలని భౌతికంగా లేదా మానసికంగా వేధించడం. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎగతాళి చేయడం లేదా బాధపెట్టడం వంటివి ఏడ్పించడం అవ్వదు.
ఏడ్పించడం అంటే ఏమిటో తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం: కొంతమంది బాధించే ఏ పనినైనా అది ఎంత చిన్నదైనా సరే ‘ఏడ్పించడం’ అనుకుంటారు. అయితే ప్రతీ చిన్న విషయంలో మీరు తలదూరిస్తే, గొడవల్ని పరిష్కరించుకోవడం ఎలాగో మీ పిల్లలకు నేర్పించలేరు. గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలో నేర్పిస్తే అది ఇప్పుడు, పెద్దయ్యాక మీ అబ్బాయికి ఎంతో ఉపయోగపడుతుంది.
బైబిలు సూత్రం: “ఆత్రపడి కోపపడవద్దు.”—ప్రసంగి 7:9.
ఒక్కమాటలో: కొన్ని సందర్భాల్లో మీరు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో, సమస్యలు వస్తే ఎలా సర్దుకుపోవాలో, నలుగురితో ఎలా ఉండాలో మీ అబ్బాయే నేర్చుకోగలడు.—కొలొస్సయులు 3:13.
తనను అదేపనిగా, కావాలని వేధిస్తున్నారని మీ అబ్బాయి చెప్తే ఏం చేయాలి?
నేనెలా సహాయం చేయవచ్చు?
మీ పిల్లవాడు చెప్పేది ఓపిగ్గా వినండి. (1) ఏం జరుగుతుందో, (2) వాడినే ఎందుకు ఏడ్పిస్తున్నారో తెలుసుకోండి. పూర్తి వాస్తవాలు తెలుసుకునేంత వరకు ఏ ముగింపుకూ రాకండి. పరిస్థితిని మరో వైపు నుండి కూడా ఆలోచించి చూడండి. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీ పిల్లవాడి టీచర్‌తో లేదా ఏడ్పిస్తున్న పిల్లవాడి తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావచ్చు.
బైబిలు సూత్రం: “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.”—సామెతలు 18:13.
మీ పిల్లవాడిని నిజంగా ఏడ్పిస్తుంటే, వాడు దానికి స్పందించే తీరును బట్టి సమస్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు, బైబిలు ఇలా అంటుంది: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) నిజానికి, తిరుగుదాడి చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు.
బైబిలు సూత్రం: “మీకు ఎవరైనా హాని చేస్తే తిరిగి వాళ్లకు హాని చేయకండి, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే తిరిగి వాళ్లను అవమానించకండి.”—1 పేతురు 3:9.
తిరుగుదాడి చేయకపోవడం బలహీనత కాదు, నిజానికి అదే మీ పిల్లవాడి బలం అని వివరించండి. ఎందుకంటే, వేరే వ్యక్తి రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోవడం బలహీనతే అవుతుంది తప్ప బలం అవ్వదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏమీ చేయకుండానే మీ పిల్లవాడు పరిస్థితిని జయించవచ్చు.
మీ పిల్లవాడిని ఆన్లైన్లో ఏడ్పిస్తుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం ఇంకా ముఖ్యం. ఆన్లైన్లో ఏడ్పించినప్పుడు తిరిగి మీరు కూడా కోపంగా గొడవపడితే ఏడ్పించేవాళ్లకు మీరే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దానితో మీ పిల్లవాడు కూడా ఏడ్పిస్తున్నాడని వేరేవాళ్లు నిందించవచ్చు. కాబట్టి, కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. దానివల్ల ఇక ఎలా ఏడ్పించాలో ఎదుటివాళ్లకు అర్థం కాదు, అలా మీ పిల్లవాడు పరిస్థితిని తన అదుపులో ఉంచుకోగలుగుతాడు.
బైబిలు సూత్రం: “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును.”—సామెతలు 26:20.
కొన్ని సందర్భాల్లో, మీ అబ్బాయి ఏడ్పించేవాళ్లకు, లేదా వాళ్లు ఉండే చోట్లకు దూరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఏడ్పించే వ్యక్తి లేదా ఏడ్పించేవాళ్లు సాధారణంగా ఎక్కడ ఉంటారో మీ పిల్లవాడికి తెలిస్తే, వేరే దారిలో వెళ్లడం ద్వారా సమస్యను తప్పించుకోవచ్చు.
బైబిలు సూత్రం: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.
ఇలా చేసి చూడండి: తను స్పందించే తీరును బట్టి ఎలాంటి ప్రయోజనాలు రావచ్చో, ఎలాంటి నష్టాలు రావచ్చో ముందే ఆలోచించుకునేలా మీ పిల్లవాడికి సహాయం చేయండి. ఉదాహరణకు:
ఏడ్పించేవాళ్లను పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది?
ఏడ్పించేవాళ్లతో వాళ్లు చేసేవి ఆపమని ధైర్యంగా చెప్తే ఎలా ఉంటుంది?
తనను ఏడ్పిస్తున్నారని స్కూల్ అధికారులకు చెప్తే ఎలా ఉంటుంది?
ఏడ్పించేవాళ్లతో సరదాగా ఉంటే సమస్య తగ్గవచ్చా?
ముఖాముఖిగా ఏడ్పించినా, ఆన్లైన్లో ఏడ్పించినా పరిస్థితి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, మీ పిల్లవాడితో మాట్లాడుతూ, పరిస్థితులకు తగ్గట్లుగా పరిష్కారం వెదకండి. ఈ వేధింపు ఆగేంతవరకు మీరు వాడికి తోడుంటారని ధైర్యం చెప్పండి.
బైబిలు సూత్రం: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.
a ఈ ఆర్టికల్‌లో అబ్బాయి, పిల్లవాడు అనే పదాలు ఉపయోగించినా ఇందులోని సూత్రాలు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి.